తిరువనంతపురం: తమ ఇంటి వద్ద కాపలాగా పనిచేస్తున్న పోలీసుపై దాడి చేసినందుకు కేరళ ఐపీఎస్ అధికారి కూతురిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. పరుష పదజాలంతో దూషించడమే కాకుండా, తనపై దాడి చేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటన గురువారం తిరువనంతపురంలో చోటుచేసుకుంది. వివరాలు.. కేరళ పోలీసు శాఖలో అసిస్టెంట్ డీజీపీగా పనిచేస్తున్న సుదేష్ కుమార్ వద్ద హోంగార్డు గవాస్కర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
గురువారం ఉదయం సుదేష్ కుమార్ భార్యాబిడ్డలు వాకింగ్‌కు వెళ్లారు. వారిని తిరిగి ఇంటికి తీసుకెళ్లేందుకు డ్రైవర్ గవాస్కర్ కాస్త ఆలస్యంగా రావడంతో ఐపీఎస్ కూతురు అతన్ని బూతులు తిట్టారు. ఆలస్యానికి గల కారణాన్ని చెప్తున్నా వినకుండా ఆమె నానా రభస చేయడంతో.. గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. అనవసరంగా నోరుపారేసుకోవద్దని కోరాడు. దాంతో కోపంతో ఊగిపోయిన ఆ యువతి అతన్ని తోసేసి దాడికి దిగారు. మొబైల్ ఫోన్‌తో అతడి మెడపై బాది గాయం చేశారు. బాధితుడు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కాగా, మహిళల గౌరవానికి భంగం కలిగించాడంటూ డ్రైవర్‌పై సదరు ఏడీజీపీ కుటుంబం ఫిర్యాదు చేయడంతో అతడిపై కూడా కేసు నమోదైంది. ఈ కేసుల విచారణను డీఎస్సీ స్థాయి వ్యక్తి చేపడతారని సమాచారం. గవాస్కర్ ఘటన తర్వాత కేరళలోని పోలీసు ఉన్నతాధికారుల నివాసాల వద్ద బాధ్యతలు నిర్వహిస్తున్న అనేక మంది కింది స్థాయి సిబ్బంది తమ గోడు వెళ్లగక్కుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో వాళ్ల ఇద్ద చాకిరీ చేయించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కనీస గౌరవం లేకుండా మాట్లాడుతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment