
సాక్షి, తిరువనంతపురం : కేరళలో ఓ చర్చి ఫాదర్ దారుణ హత్యకు గురయ్యారు. అదే చర్చిలో పనిచేస్తూ సస్పెన్షన్‌కు గురైన వ్యక్తే ఆయనను కత్తితో పలుమార్లు పొడిచేసి సమీపంలోని అడవిలోకి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో ఫాదర్ చనిపోయారు. వివరాల్లోకి వెళితే.. ఎర్నాకులం జిల్లాలోని మలయత్తూర్ క్యాథలిక్ చర్చ్‌లో ఫాదర్ జావియర్ తెలిక్కాట్ (52) ఫాదర్‌గా పనిచేస్తున్నారు. జానీ అనే వ్యక్తి చర్చిలో మెయింటెన్స్ పనులు, స్మశానంలో పనులు చూసుకుంటున్నాడు.
అయితే, జానీ కొన్ని అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన ఫాదర్ జావియర్ అతడిని పనిలో నుంచి తొలగించాడు. దీన్ని మనసులో పెట్టుకున్న జానీ ఫాదర్ కురుయిష్‌మల కొండపైకి యాత్రకు వెళ్లి గురువారం ఉదయం 10.45గంటల ప్రాంతంలో కిందికి దిగి వస్తుండగా అనూహ్యంగా కత్తితో ఫాదర్ ముందుకు దూసుకొచ్చి వాదన పడుతూనే దాడికి పాల్పడ్డాడు. ఆయనను ఆస్పత్రికి తరలించే లోపే తీవ్ర గాయాలతో కన్నుమూశారు. ఈ సంఘటన ఆ చుట్టుపక్కల సంచలనంగా మారింది. జానీ కోసం పోలీసులు గాలింపులు మొదలుపెట్టారు. అతడు అడవిలోకి పారిపోవడంతో అటవీశాఖ అధికారుల సహాయం తీసుకుంటున్నారు.