యువ వైద్యురాలి మృతి యావత్తు కేరళ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటన పెద్ద రాజకీయ దుమారానికి తెరలేపింది. దీంతో వైద్యుల, ఆరోగ్య కార్యకర్తలకు కేరళ రాష్ట్రంలో ఎలాంటి భద్రత లేదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనతో కేరళ ప్రతిష్ట దిగజారిపోయిందంటూ ప్రతిపక్షాలు పినరయి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశాయి.
అసలేం జరిగిందంటే.. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..బుధవారం కేరళలో 24 ఏళ్ల వందనా దాస్ అనే యువ వైద్యురాలు పెషెంట్ దాడిలో మృతి చెందింది. నిజానికి ఆ రోగిని పోలీసులు తీసుకువచ్చారు. అతను సస్పెన్షకు గురైన ఓ ఉపాధ్యాయుడు. పేరు సందీప్. తన కుటుంబ సభ్యులతో గొడవ పడి రక్షించమంటూ అతను పోలీసుల అత్యవసర హెల్ప్‌లైన్‌కి ఫోన్ చేశాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన సందీప్‌ను సమీపంలోని ఆస్పత్రికి తీసుకు వచ్చారు.
ఆ సమయంలో వందనాదాస్ అతడి గాయానికి డ్రస్సింగ్ చేస్తోంది ఇంతలో ఆకస్మికంగా రెచ్చిపోయి..చికిత్స చేస్తున్న డాక్టర్‌తో సహా సమీపంలో ఉన్న పోలీసులు, సిబ్బందిపై కత్తెరతో విచక్షణ రహితంగా దాడి చేశాడు.
ఆ పేషెంట్ దాడిలో తీవ్రంగా గాయపడిన సదరు యువ డాక్టర్ వందనా దాస్ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయం గురించి తెలసుకున్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వైద్యురాలి మృతికి సంతాపం తెలిపారు. దీన్ని దిగ్బ్రాంతికరమైన బాధకర ఘటన అని అన్నారు. బాధ్యులపై ప్రభుత్వం సత్వరమే కఠిన చర్యలు తీసుకుంటుందని ఓ ప్రకటనలో తెలిపారు.
ఐతే ఈ ఘటనకు వ్యతిరేకంగా మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ), కేరళ గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్స్ అసోసీయేషన్(కేజీఎంఓఏ) వైద్యులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలిపారు. మరోవైపు మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా కేరళ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ స్వయంగా ఈ కేసును దర్యాప్తు చేయడం ప్రారంభించింది. ఏడురోజుల్లోగా ఈ ఘటనపై కొల్లాం జిల్లా పోలీస్ చీఫ్‌ను నివేదిక ఇవ్వాలని కోరింది. ఇదిలా ఉండగా, కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ బాధితురాలు హౌస్ సర్జన్ అని, అంతగా అనుభవం లేదని చేసిన ప్రకటన కాస్త మరింత వివాదాస్పదమై విమర్శలకు ఆజ్యం పోసింది. ఆమె ప్రకటనపై కేరళ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సుధాకరన్ ఫైర్ అయ్యారు.
వైద్యురాలి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ..ఇలాంటికి జరగడం దురదృష్టకరమని సుధాకరన్ అన్నారు. యువ వైద్యురాలు హత్య యావత్తు కేరళ రాష్ట్రాన్నే కలిచివేసిందని కేరళ సీనియర్ నేత సతీశన్ అన్నారు. పోలీసులు నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని సతీశన్ ఆరోపణలు చేశారు.ఈ ఘటనపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పినరయి ప్రభుత్వాన్ని తప్పుపడుతూ విమర్శలు చేయడం ప్రారంభించాయి. కాగా, విద్యాశాఖ మంత్రి శివన్‌కుట్టి సదరు వైద్యురాలి మృతికి సంతాపం తెలపడమే గాక ప్రభుత్వం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
ఐతే కేంద్ర విదేశీ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్, ఈ విషాద సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేయడమే గాక మెడికల్ టూరిజానికి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేరళలో ఇలాంట ఘటన చోటు చేసుకోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఈ ఘటన కేరళ ప్రతిష్టను దెబ్బతీసిందని, కేరళలోని వైద్యులు, ఆరోగ్య కార్యకర్తల భద్రతలో లోపాలను తేటతెల్లం చేసిందని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment