సంచలనం సృష్టించిన కొట్టాయం మహిళ గ్యాంగ్‌రేప్ కేసుపై కేరళ హైకోర్టు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నిందితులైన నలుగురు మత గురువులను తక్షణమే అరెస్ట్ చేయాలని బుధవారం పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిందితుల్లో ఒకరు లొంగిపోగా.. మరో ముగ్గురి కోసం పోలీసులు రాష్ట్రాన్ని జల్లెడ పడుతున్నారు.
కొట్టాయం: గత నెలలో 34 ఏళ్ల తన భార్యపై నలుగురు మత గురువులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని చర్చి మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు చేస్తూ.. ఆమె భర్త ఓ ఆడియో క్లిప్ విడుదల చేశాడు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావటంతో దుమారం చెలరేగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధిత మహిళ నుంచి ఫిర్యాదు నమోదు చేశారు. ‘20 ఏళ్ల క్రితం సదరు చర్చి ఫాదర్ లోబర్చుకున్నాడని, వివాహం చేసుకుంటానని నమ్మబలికి పలుమార్లు అత్యాచారం చేశాడని తెలిపింది. ఆపై పాపపరిహారం కోసం ముగ్గురు మత గురువులను ఆశ్రయించగా.. వాళ్లు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడి మరీ వాళ్లు కూడా తనపై అత్యాచారం చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కాగా, 2006లో మహిళకు వివాహం కాగా, వాళ్ల వేధింపులు మాత్రం ఆగలేదంట. దీంతో జరిగిన విషయాన్ని భర్తకు వివరించగా.. ఆయన మత గురువుల ఆరాచకాలను వెలుగులోకి తెచ్చాడు.
మృగాళ్లలా ప్రవర్తించారు.. కాగా, ఈ కేసులో దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘మత గురువులు మృగల్లా ప్రవర్తించారు. ఓ మహిళపై 20 ఏళ్లుగా లైంగికదాడికి పాల్పడుతున్నారంటే వారిని మనుషులు పరిగణించాల్సిన అవసరం లేదు’ అని పేర్కొంది. అంతేకాదు వాళ్లు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చిన కోర్టు.. తక్షణమే నిందితులను అరెస్ట్ చేయాలని పోలీస్ శాఖను ఆదేశించింది. దీంతో నిందితుల్లో ఒకడైన ఫాదర్ జాబ్ మాథ్యూ పోలీసులకు గురువారం లొంగిపోయాడు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు కేరళ పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే కేరళలో గత 18 నెలలుగా.. మొత్తం 12 మంది మత గురువులను లైంగిక దాడుల కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేశారు.
మేమేం రక్షించట్లేదు.. కాగా, ఈ వ్యవహారంలో చర్చి అధికారులపైనా విమర్శలు చెలరేగాయి. వారిని రక్షిస్తున్నామన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. ఫిర్యాదు అందగానే వారిని తొలగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశాం. ఇప్పుడు వారికి-చర్చికి ఎలాంటి సంబంధం లేదు’ అని ఓ ప్రకటనలో చర్చి మేనేజ్‌మెంట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment