
పట్టాలపై ఉన్న మృతదేహాలు
సేలం: రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కోవైలో చోటుచేసుకుంది. విచారణలో వారు కేరళకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. కోయంబత్తూరు ఉక్కడం సమీపంలో ఒక ప్రైవేటు కళాశాల ఉంది. ఈ స్థితిలో శుక్రవారం ఉదయం సుమారు 6.30 గంటల సమయంలో పొల్లాచ్చి నుంచి కోవైకు ప్యాసింజర్ రైలు వస్తోంది. ఆ సమయంలో ఒక ప్రేమజంట అకస్మాత్తుగా రైలు కింద పడ్డారు. ఈ ఘటన యువతి, యువకుడు సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న కోవై రైల్వే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపంచనామా నిమిత్తం కోవై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అనంతరం పోలీసులు అక్కడ గాలించగా, రెండు బ్యాగులు పడి ఉన్నాయి. వాటిలో ఆ ప్రేమ జంట ఫొటోలతో కూడిన ఐడీ కార్డులు, ఒక లేఖ కనిపిచింది. ఆ లేఖలో నిన్ను వీడి ఉండలేకున్నాను, జీవించడం ఇష్టం లేదు, నువ్వు రాలేదు, నేను చనిపోతాను అని రాసి ఉంది. ఐడీ కార్డుల ఆధారంగా ప్రేమజంటలో యువకుడు కేరళ రాష్ట్ర మూనాళం, అట్టూరుకు చెందిన అమల్ పి.కుమార్ (19) అని, అతను అదే ప్రాంతంలో ఉన్న కళాశాలలో బి.కామ్ చదువుతున్నట్టుగాను తెలిసింది. అదే విధంగా ఆ యువతి కూడా అదే ప్రాంతానికి చెందిన నాయర్ కుమార్తె సూర్య (19) అని, కేరళలోనే పాఠశాలలో ప్లస్‌టూ చదువుతున్నట్టు పోలీసులు గుర్తించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటన కారణంగా ఆ రైలును అక్కడే నిలిపివేశారు. అదే సమయంలో ఆ రైలు వెనుక పాలక్కాడు నుంచి వస్తున్న రైలును పోత్తనూర్‌లో నిలిపివేశారు. రైళ్లు రెండు గంటలపాటు ఎక్కడివక్కడ ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.