ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసరావు
మంగళగిరి: రాజధాని ప్రాంతంలో జరిగిన జ్యోతి హత్య కేసులో పోలీసులు మిస్టరీని దాదాపు ఛేదించినట్లు తెలిసింది. గత ఐదు రోజులుగా కేసు పలు మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసినందుకే జ్యోతిని ప్రియుడు శ్రీనివాసరావు హత్య చేసి ఉంటాడా? అన్న కోణంలో విచారణను వేగవంతం చేశారు. శ్రీనివాసరావు వ్యవహార శైలిని తీవ్రంగా అనుమానిస్తున్న పోలీసులు, ఇప్పటికే అతని ఫోన్ నుంచి కీలకమైన సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో పోలీసుల తీరుపై పలు విమర్శలు రావడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. శుక్రవారం గుంటూరు అర్బన్ ఎస్పీ సి.హెచ్.విజయరావు, ఉమన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీ సరిత, అర్బన్ లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ, డీఎస్పీ హరిరాజేంద్రబాబులు జ్యోతి ప్రియుడు శ్రీనివాసరావును ఎన్నారై ఆసుపత్రిలో విచారించారు. అలాగే సీసీ పుటేజ్, కాల్ డేటా ఆధారంగా పలు కీలక ఆధారాలను సేకరించినట్లు సమాచారం. హత్య జరిగినప్పటి నుంచి ఇంతవరకూ శ్రీనివాసరావు చెబుతున్న మాటలకు ఎక్కడా పొంతన కుదరడం లేదని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. అందువల్లే అతనే జ్యోతిని హత్యచేసి ఉండవచ్చా? అన్న అనుమానాలు బలపడుతున్నాయని అంటున్నారు. ఈ హత్య జరిగిన తీరు పలు అనుమానాలకు తావిచ్చినప్పటికీ ఎవరు ఈ దారుణానికి పాల్పడ్డారో తేల్చడం పోలీసులకు కత్తిమీద సాములా మారింది. దీనికి తోడు మృతదేహంపై ఉన్న బట్టలు, వేలిముద్రల్ని సేకరించకుండానే ఖననం చేయడం, ఆ తర్వాత పోలీసులు దొంగచాటుగా మృతదేహాన్ని వెలికితీసి బట్టలు సేకరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్లపై వేటు వేసిన అధికారులు నార్త్ డీఎస్పీ రామకృష్ణను సైతం కేసు విచారణ నుంచి తప్పించారు.
శ్రీనివాసరావు సెల్‌ఫోన్‌లో కీలక ఆధారాలు
ఈనెల 11న మంగళగిరి మండలంలోని నవులూరు అమరావతి టౌన్‌షిప్‌లో శ్రీనివాసరావు, జ్యోతిలపై దాడి జరగ్గా.. జ్యోతి అక్కడికక్కడే మరణించిన సంగతి తెలిసిందే. దాడిలో గాయపడి ఎన్నారై ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న శ్రీనివాసరావు అనారోగ్యం పేరుతో పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడని, అపస్మారకస్థితిలో ఉన్నానని, తనకు ఏమీ తెలియదంటూ నాలుగు రోజులుగా పోలీసుల విచారణకు సహకరించడం లేదని సమాచారం. 14వ తేదీ మధ్యాహ్నం ఐసీయూ నుంచి వార్డుకు మార్చగానే పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా అతన్ని విచారించారు. ప్రియుడు శ్రీనివాసరావును పెళ్లి చేసుకోవాలని జ్యోతి ఒత్తిడి చేయడంతో ఆమెను అడ్డు తొలగించుకుంటానని స్నేహితులతో చెప్పిన ఆడియో రికార్డుల్ని పోలీసులు సేకరించడంతో పాటు శ్రీనివాసరావు సెల్‌ఫోన్‌లో జ్యోతితో పాటు, పలువురు యువతుల అసభ్యకర ఫొటోలు, వీడియోల్ని గుర్తించినట్లు తెలుస్తోంది. పలువురు యువతులతో శ్రీనివాసరావు చేసిన చాటింగ్‌లు కూడా దొరికాయని చెబుతున్నారు. వీటిన్నంటిని విశ్లేషించాక అతనే జ్యోతిని హత్య చేసి ఉండవచ్చనే అనుమానాలు పోలీసుల్లో బలపడుతున్నాయి. స్నేహితుల సాయంతో తనను గాయపర్చుకుని హత్య చేశాడా? అనే కోణంలో విచారణను వేగవంతం చేశారు. పోలీసు అధికారులు మాత్రం శ్రీనివాసరావే చంపాడన్న విషయాన్ని నిర్ధారించడం లేదు. విచారణ పూర్తయ్యాక మాత్రమే అసలు నిందితులు ఎవరనేది తేలుతుందని, ప్రస్తుతం అతనిపై అనుమానాలు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు.
డాక్టర్ భారతిపై చర్యలు!
జ్యోతి హత్య కేసులో ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు, సిబ్బందిపై వేటుపడగా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ భారతిపై వేటుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. జ్యోతి మృతదేహానికి మొదట పోస్టుమార్టం నిర్వహించిన భారతిని కలెక్టర్ కోన శశిధర్ పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం చేసే సమయంలో తప్పులు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పోస్టుమార్టం రిపోర్టును సైతం కలెక్టర్ తెప్పించుకున్నారని తెలిసింది.
తప్పు చేస్తే శిక్షించండి: శ్రీనివాసరావు తల్లిదండ్రులు
తమ కుమారుడు శ్రీనివాసరావు నేరస్తుడు కాదని, నేరం చేసి ఉంటే చట్టపరంగా శిక్షించవచ్చని శ్రీనివాసరావు తల్లి లక్ష్మి, తండ్రి నరసింహారావు అన్నారు. ఆసుపత్రి ఆవరణలో శ్రీనివాసరావు తల్లి లక్ష్మి విలేకరులతో మాట్లాడుతూ.. నిందితులెవరైనా ఉరితీయాలని తెలిపింది. జ్యోతి కుటుంబసభ్యుల వల్ల తమతో పాటు తన కుమారుడికి ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. జ్యోతిని హత్య చేసేంతటి నేరం తమ కుమారుడు చేస్తాడని అనుకోవడం లేదని నరసింహరావు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment