
రామకృష్ణబాబుకు చెందిన మద్యం దుకాణం, తిరుమలరావు (ఫైల్)
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మద్యం దుకాణంలో మద్యం సేవిస్తూ కీ బోర్డ్ కళాకారుడు హఠాన్మరణం చెందిన ఘటన విశాఖపట్నంలో కలకలం రేపింది. అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు చెందిన మద్యం సిండికేట్ దుకాణంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. విశాఖ నగరంలోని మర్రిపాలెంకు చెందిన ఎం.తిరుమలరావు(48) కీ బోర్డ్ ఆర్టిస్టుగా పని చేస్తున్నాడు. ఎంవీపీ కాలనీ 7వ వార్డులోని శ్రీ సాయిరామ శక్తి లింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం సాంస్కృతిక కార్యక్రమాలకు కీ బోర్డ్ ప్లే చేసేందుకు వచ్చాడు. సాయంత్రం 6 గంటల సమయంలో ఆలయానికి సమీపంలోని శ్రీ జయ వైన్స్‌లో మద్యం సేవించేందుకు వెళ్లాడు. అక్కడ మద్యం తాగుతూ తిరుమలరావు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
అయినా మద్యం దుకాణం నిర్వాహకులు పట్టనట్టే వ్యవహరించారు. విషయం తెలిసి సమీపంలోని దేవాలయ కమిటీ అధ్యక్షుడు సింహాద్రిబాబు, స్థానికులు వైన్ షాపు వద్దకు చేరుకున్నారు. ‘108’కి సమాచారం చేరవేయగా ఇప్పుడు రావడం కుదరని అంబులెన్స్ సిబ్బంది ఫోన్ పెట్టేశారు. బాధితుడిని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లేందుకు వాహనం ఏర్పాటు చేయాలని షాపు నిర్వాహకులను కోరగా వారు నిరాకరించారు. ఆటోలో తీసుకుపోండని గదమాయించారు. స్థానికులు, దేవాలయ కమిటీ సభ్యులు ఆందోళన చేపట్టగా.. ఎట్టకేలకు ప్రైవేట్ అంబులెన్స్‌ను పిలిపించారు. అయితే అప్పటికే తిరుమలరావు మృతి చెందినట్టు అంబులెన్స్ సిబ్బంది తేల్చిచెప్పారు. అనంతరం తిరుమలరావు మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు.
కళ్ల ముందే ప్రాణంపోయినా లెక్కలేదా?
ఓ వ్యక్తి తమ దుకాణంలో మద్యం తాగుతూ మరణించినా వైన్ షాపు నిర్వాహకులు స్పందించకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. షాపులో కళ్ల ముందే ఓ ప్రాణం పోయినా ఏమీ జరగనట్టు రాత్రి పదిన్నర దాకా యథావిధిగా మద్యం విక్రయాలు కొనసాగించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మద్యం సిండికేట్‌కు చెందిన ఈ మద్యం దుకాణాన్ని అనుమతులు లేకపోయినా పూర్తిస్థాయి బార్ అండ్ రెస్టారెంట్‌గా మార్చేశారు. అయినా ఎక్సైజ్ అధికారులు, పోలీసులు ఇప్పటివరకు పట్టించుకోలేదు. కాగా, తిరుమలరావు కల్తీమద్యం తాగి ప్రాణాలు పోగొట్టుకున్నాడా లేక మద్యం సేవిస్తూ గుండెపోటుతో మృతిచెందాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కల్తీ మందో కాదో తేలుస్తాం: ఎక్సైజ్ సీఐ
తిరుమలరావు తీసుకున్నది కల్తీ మందా లేక గుండెపోటుతోనే మరణించాడా అనే దానిపై విచారణ చేపట్టామని ఎక్సైజ్ సీఐ బాపినాయుడు తెలిపారు. అతను తీసుకున్న మద్యం శాంపిల్స్ సేకరించి పరీక్షిస్తామని, కల్తీ మద్యం తీసుకున్నట్టు తేలితే వైన్ షాపు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment