అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ కిడ్నాప్, హత్య | Khammam Assistant Labour Commissioner Assassinated In Forest At Bhupalpally | Sakshi
Sakshi News home page

అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ కిడ్నాప్, హత్య

Published Wed, Mar 11 2020 2:20 AM | Last Updated on Wed, Mar 11 2020 9:41 AM

Khammam Assistant Labour Commissioner Assassinated In Forest At Bhupalpally - Sakshi

ఆనంద్‌రెడ్డి(ఫైల్‌ ఫోటో)

కాజీపేట అర్బన్‌ /భూపాలపల్లి /జనగామ అర్బన్‌:  రియల్‌ మాఫియా ఉచ్చులో పడిన అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ మోకు ఆనంద్‌రెడ్డి (45) హత్యకు గురయ్యారు. వ్యాపార లావాదేవీల కారణంగా హత్యకు గురైనట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారణకు వచ్చారు. హత్యా ప్రదేశాన్ని నిందితుల్లో ఒకరు చూపించగా.. మృతదేహాన్ని మంగళవారం రాత్రి పొద్దుపోయాక గుర్తించారు.  

జనగామ నుంచి ఖమ్మం 
జనగామ జిల్లా ఓబుల్‌కేశపూర్‌కు చెందిన మధుసూదన్‌రెడ్డి, పద్మ దంపతుల పెద్ద కుమారుడు ఆనంద్‌రెడ్డి తొలుత జనగామ, వరంగల్‌లలో అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. ఇప్పుడు ఇన్‌చార్జి అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌గా ఖమ్మంలో పనిచేస్తున్నారు. తరచుగా హన్మకొండకు వచ్చే ఆయన ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఈనెల 7వ తేదీన హన్మకొండలోని ఓ హోటల్‌కు ప్రదీప్‌రెడ్డి వచ్చాడని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లారు.. 

ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్‌ 
హోటల్‌కు వెళ్లాక ఏం చర్చించుకున్నారో ఏమో కానీ.. బయటకు వెళ్లే సమయంలో ఆనంద్‌రెడ్డి తన సోదరుడు శివకుమార్‌రెడ్డికి ఫోన్‌ చేశారు. ‘ప్రదీప్‌రెడ్డి భూపాలపల్లి రామారంలో స్థలం చూపిస్తానని చెబుతున్నాడు.. నువ్వు కూడా రా’అంటూ శివకుమార్‌రెడ్డికి ఫోన్‌లో సూచించారు. దీంతో ఆయన నేరుగా భూపాలపల్లికి వెళ్లి ఫోన్‌ చేస్తే  స్విచ్చాఫ్‌ వచ్చింది. దీంతో హన్మకొండలో తమ బంధువుల ఇళ్లలో ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. 8న హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్‌ కేసు నమోదైంది. తమకు ప్రదీప్‌రెడ్డిపై అనుమానం ఉందని ఆనంద్‌ సోదరుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, హన్మకొండ హోటల్‌లోని సీసీ ఫుటేజీలను పరిశీలించగా.. ప్రదీప్‌రెడ్డి కారులో ఆనందర్‌ రెడ్డి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.  

ఇసుక వ్యాపారం కోసం రూ.80 లక్షల అప్పు  
ప్రదీప్‌రెడ్డి చేసే ఇసుక వ్యాపారం నిమిత్తం ఆనంద్‌రెడ్డి రూ.80 లక్షల వరకు అప్పుగా ఇచ్చినట్లు సమాచారం. కాగా డబ్బులు తిరిగి ఇవ్వమని అడగగా.. తన వద్ద ఇప్పుడు డబ్బులు లేవని, అందుకు తగ్గట్లు స్థలాన్ని ఇస్తానని బదులిచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో భూపాలపల్లి రాంపూర్‌లో స్థలం చూపిస్తామని నమ్మించి తన స్నేహితుడు, డ్రైవర్‌తో కలసి వాహనంలో ఆనంద్‌ను తీసుకెళ్లి హత్య చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే, వేరే చోట హత్య చేసి రాంపూర్‌ వద్ద మృతదేహాన్ని వేశారా, లేక అక్కడే హత్య చేశారా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. 

మృతదేహాన్ని చూపించిన నిందితుల్లో ఒకరు? 
ఆనంద్‌రెడ్డి మృతదేహాన్ని పోలీసులు మంగళవారం రాత్రి గుర్తించినట్లు సమాచారం. అనుమానితులైన ప్రదీప్‌రెడ్డి, ఆయన సోదరుడు, డ్రైవర్‌ ఫోన్లు స్విచ్చాఫ్‌ వచ్చినట్లు సమాచారం. దీంతో గాలింపు చర్యలు చేపట్టగా ముగ్గురిలో ఒకరు పోలీసులకు పట్టుబడ్డాడు. భూపాలపల్లి మండలంలోని కమలాపూర్‌– రాంపూర్‌ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలోని గట్టమ్మ దేవాలయం సమీపంలో ఆనంద్‌రెడ్డి మృతదేహం ఉందని నిందితుడు చెప్పగా.. లైట్ల సాయంతో గంటపాటు వెతికారు. దుర్వాసన ఆధారంగా గట్టమ్మ గుడి నుంచి కిలోమీటరు దూరంలో మృతదేహాన్ని గుర్తించారు.  

చేతులు కట్టేసి హత్య 
ఆనంద్‌రెడ్డిని ముగ్గురు వ్యక్తులు కలసి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. ఒక టెంటు కింద కూర్చొని మద్యం సేవించాక.. అతడి చేతులు వెనుకకు కట్టేసి చంపినట్లు చెబుతున్నారు. అయితే మృతదేహం కుళ్లిపోయి ఉండటంతో ఎక్కడెక్కడ కత్తిపోట్లు ఉన్నాయనే విషయాన్ని పోలీసులు నిర్ధారణకు రాలేకపోతున్నారు. 

ప్రదీప్‌రెడ్డిని గత ఏడాదే బహిష్కరించాం: టీఆర్‌ఎస్‌  
కమలాపూర్‌: వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలంలోని శనిగరం గ్రామానికి చెందిన పింగిళి ప్రదీప్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్త కాదని.. ఆ పార్టీ మండల అధ్యక్షుడు మాట్ల రమేష్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో పలు పార్టీలు మారిన ప్రదీప్‌రెడ్డి.. టీఆర్‌ఎస్‌లో చేరినా కొద్దికాలమే కొనసాగారని చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశాల మేరకు గతేడాది మే 6న పార్టీ నుంచి ప్రదీప్‌రెడ్డిని సస్పెండ్‌ చేశామని స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement