
సాక్షి, విశాఖపట్నం: వ్యభిచారాన్ని ప్రశ్నించిన పాపానికి విశాఖపట్నంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తమ అక్రమ కార్యకలాపాలను నిలదీసిన ఓ యువకుడిపై కొందరు వ్యక్తులు కత్తులతో తెగబడ్డారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఆ చౌరస్తాలో ఏ మాత్రం బెరుకు బెంకు లేకుండా కత్తులతో పొడిచి రాడ్డుతో కొట్టి పరారయ్యారు. దీంతో ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఇంత జరుగుతున్నా అక్కడి వారు కనీసం స్పందించకపోవడం దారుణం. వివరాల్లోకి వెళితే జీవీఎంసీ 15వ వార్డు అశోక్‌నగర్‌కు చెందిన పెద్దాడ సురేష్ (30) పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఆశీలమెట్టలోని ద్వారకా వైన్స్ షాపు వద్ద ఉన్న అతడిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, రాడ్డులతో చేసి పరారయ్యారు.
రక్తపు మడుగులో పడిఉన్న సురేష్‌ను బంధువులు సీతమ్మధారలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు లా అండ్ ఆర్డర్ డీసీపీ ఫకీరప్ప, ద్వారకాజోన్ ఏసీపీ పి.రామచంద్రరావు, ఎంవీపీజోన్ సీఐ మళ్ల మహేష్, ద్వారకా ఎస్‌ఐలు మురళీ, అడపా సత్యారావు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు. సంఘటన స్థలంలో ఉన్న వారిని విచారించారు. ద్వారకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం ఆ ప్రాంతంలోనే వ్యభిచారం జరుగుతుందని, ఆ ప్రాంతం నుంచి కుటుంబ సభ్యులతో వెళ్లాలన్న ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఆ విషయాన్ని ప్రశ్నించినందుకే సురేష్‌పై దాడి చేశారని వారు వెల్లడించారు. ఓ వ్యక్తిని హత్య చేసే వరకు వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్ర స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment