కేఎస్‌ఎస్ ట్రావెల్స్ చైర్మన్ అల్తాఫ్ హుసేన్ ఆబిది వన్‌టౌన్‌లో పేర్లు రాయిస్తున్న ఉమ్రా బాధితులు
ప్రొద్దుటూరు క్రైం : ఉమ్రా యాత్రకు పంపిస్తామని మోసం చేసిన కేఎస్‌ఎస్ (కర్వానే సయ్యద్ ఉస్ సజిదిన్) ఉమ్రా ట్రావెల్స్‌కు సంబంధించి భయంకరమైన నిజాలు వెలుగు చూస్తున్నాయి. రాయలసీమకే పరిమితమైందనుకున్న ఈ సంస్థ దేశవ్యాప్తంగా విస్తరించింది. అన్ని రాష్ట్రాల్లోని ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో కేఎస్‌ఎస్ ట్రావెల్స్ బ్రాంచి కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ఒక్క హైదరాబాద్‌లోనే 10 వేల మందికి పైగా ఉమ్రా కోసం డబ్బు చెల్లించగా దేశవ్యాప్తంగా ఈ సంఖ్య లక్షల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు బెంగళూరు, చెన్నై, గుల్బర్గా తదితర ప్రాంతాల నుంచి ప్రొద్దుటూరుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థకు చెందిన చైర్మన్ సయ్యద్ అల్తాఫ్‌హుస్సేన్ అబిది, మేనేజింగ్ డైరెక్టర్ ఇజాజ్‌ఆలీ, మేనేజర్ బర్కత్ ఆలీ పోలీసుల అదుపులో ఉన్నారని తెలియడంతో దేశవ్యాప్తంగా ఉన్న ఉమ్రా బాధితులు ప్రొద్దుటూరుకు పయనమైనట్లు సమాచారం.
జనవరి నుంచి బుకింగ్‌లు
కేఎస్‌ఎస్ ట్రావెల్స్ సంస్థ జనవరి 14 నుంచి ఉమ్రా కోసం బుకింగ్ ప్రారంభించినట్లు బాధితులు చెబుతున్నారు. ప్రారంభంలో రూ.14 వేలకే ఉమ్రా పంపిస్తామని ప్రచారం చేశారు. ఈ మేరకు రెండు బ్యాచ్‌లను ఉమ్రాకు పంపారు. అయినా రూ.14 వేలకే ఉమ్రా యాత్ర ఎలా పంపిస్తారనే అనుమానాలు చాలా మంది నుంచి వస్తుండటంతో ఒక్క సారిగా రూ.30 వేలకు పెంచారు. నెలలోపు పంపిస్తానని రూ. 35 వేలు–రూ.40 వేలు కూడా కొంత మంది నుంచి వసూలు చేశారు. రంజాన్ నెలలో ఉమ్రాకు పంపిస్తానని దేశ వ్యాప్తంగా ఉన్న చాలా మంది వద్ద నుంచి డబ్బు వసూలు చేసినట్లు తెలిసింది. రంజాన్ మాసం ప్రారంభమైనా ఒక్క బ్యాచ్‌ను కూడా ఉమ్రాకు పంపకపోవడంతో బోర్డు తిప్పేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. కడపలో రూ. 3 కోట్లు, కర్నూల్‌లో రూ. 2 కోట్లు, ప్రొద్దుటూరులో రూ. 5 కోట్ల మేర ట్రావెల్స్ నిర్వాహకులు వసూలు చేసినట్లు ఆపరేటర్లు చెబుతున్నారు.
ట్రావెల్స్ కార్యాలయంలో వేలాది పాస్‌పోర్ట్‌లు
రంజాన్ నెలలో తక్కువ ఖర్చుతో ఉమ్రా కు పంపిస్తామని ట్రావెల్స్ నిర్వాహకులు చెప్పడంతో చాలా మంది డబ్బు కట్టారు. దేశవ్యాప్తంగా 3 వేల మందిని ఉమ్రాకు పంపిస్తానని వారి పాస్‌పోర్ట్‌లను ఆయా ప్రాంతాల ఏజెంట్‌లు సేకరించి వీటిని ముంబయికి పంపించారు. అయితే వీరిలో ఏ ఒక్కరినీ ఉమ్రాకు పంపకపోవడంతో పాస్‌పోర్ట్‌లన్నీ ముంబయిలోనే ఉండిపోయాయి.
దేశవ్యాప్తంగా 59 చోట్ల బ్రాంచ్‌లు
కేఎస్‌ఎస్ ఉమ్రా ట్రావెల్స్‌కు దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో 59 బ్రాంచ్‌లు ఉన్నట్లు సంస్థలో పని చేసే ఆపరేటర్లు తెలిపారు. ఉమ్రా పేరుతో సంస్థ నిర్వాహకులు రూ.300 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, ఇప్పటికి సుమారు రూ.200 కోట్ల వరకూ ప్రజల నుంచి వసూలు అయినట్లు వారు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్, లక్నో, ఢిల్లీ, ముంబయి, ఉత్తరాఖండ్, అలీఘడ్ తదితర రాష్ట్రాల్లో బ్రాంచ్‌లను ఏర్పాటు చేశారు.
భయం గుప్పిట్లో ఆపరేటర్లు..
తమకు ప్రాణ భయం ఉందని కేఎస్‌ఎస్ ట్రావెల్స్ కార్యాలయాల్లో పని చేస్తున్న పలువురు ఆపరేట ర్లు వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. కడప, ప్రొద్దుటూరు, కర్నూలు కార్యాలయాల్లో పని చేస్తు న్న ఆపరేటర్లు షఫీ, అక్తర్, గైబు, ఖాజా, ఇషాన్ సోమవారం వన్‌టౌన్‌కు వచ్చారు. ప్రజల నుంచి వీళ్లే డబ్బు తీసుకొని సంస్థకు చెల్లించడంతో తమ పై ఒత్తిడి తెస్తున్నారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరు చొరవ తీసుకోవడం వల్లనే సంస్థ నిర్వాహకులు పోలీసులకు పట్టుబడ్డారు.
ప్రొద్దుటూరుకు క్యూ కడుతున్న బాధితులు
కేఎస్‌ఎస్ ట్రావెల్స్ సంస్థ మోసం చేసిందని, సంస్థ నిర్వాహకులు పోలీసుల అదుపులో ఉన్నారని తెలియడంతో చాలా మంది ప్రొద్దుటూరుకు క్యూ కట్టారు. ప్రొద్దుటూరు, కమలాపురం, మైదుకూరు, కడపతో పాటు కర్నూలు జిల్లాలోని కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ, చాగలమర్రి, అనంతపురం జిల్లాలోని అనంతపురం, గుత్తి తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఉమ్రా బాధితులు డబ్బు కట్టిన రసీదులు తీసుకొని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వస్తున్నారు. ఎలాగైనా తమ డబ్బు వచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు డీఎస్పీ శ్రీనివాసరావును కోరారు. వారి వద్ద ఉన్న పత్రాల ఆధారంగా పోలీసులు పేర్లు నమోదు చేసుకుంటున్నారు.
రూ.56 వేలు కట్టాను
ఉమ్రాకు తక్కువ డబ్బుతో పంపిస్తామని తెలియడంతో మా కుటుంబ సభ్యులు నలుగురి కోసం రూ. 56 వేలు చెల్లించాను. డబ్బు కట్టి చాలా రోజులైనా అతను ఉమ్రాకు పంపలేదు. ఇలా మోసం చేస్తారని అనుకోలేదు. ఎలాగైనా మా డబ్బు ఇప్పించాలి. – షేక్ అన్వర్‌బాషా,డీసీఎస్సార్ కాలనీ, ప్రొద్దుటూరు
వడ్డీకి డబ్బు చెల్లించాను
ఉమ్రాకు వెళ్లే భాగ్యం మళ్లీ వస్తుందో రాదో అని మా ఇంట్లో ఇద్దరి కోసం రూ. 50 వేలు ట్రావెల్స్ నిర్వాహకులకు కట్టాను. కానీ మోసం చేశారని తెలియడంతో రెండు రోజుల నుంచి ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. పోలీసు అధికారులు ఎలాగైనా మా డబ్బు వచ్చేలా చర్యలు తీసుకోవాలి.– షాహుసేన్‌వల్లి, చాగలమర్రి,కర్నూలు జిల్లా
మోసం చేస్తాడని అనుకోలేదు
ఉమ్రాకు పంపిస్తామని ఇలా మోసం చేస్తారని అనుకోలేదు. మోసపోయిన మమ్నల్ని పోలీసు అధికారులు ఆదుకోవాలి. డబ్బు కట్టిన వాళ్లలో చాలా మంది పేదలే ఉన్నారు. రూ. కోట్లలో వసూలు చేసిన కేఎస్‌ఎస్ ట్రావెల్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి. – వల్లీ సాహెబ్, ఖాదర్‌బాద్,ప్రొద్దుటూరు మండలం
Comments
Please login to add a commentAdd a comment