umra
-
అంతా పథకం ప్రకారమే.!
కడప అర్బన్ : తక్కువ మొత్తానికే ఉమ్రా యాత్రకు వెళ్లే అవకాశం కల్పిస్తామంటూ నమ్మ బలికి వేలాది మంది నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి కుచ్చుటోపీ పెట్టిన ఘరానా మోసగాళ్లను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. సాధారణంగా ఒక్కొక్కరు ఉమ్రా యాత్రకు వెళ్లాలంటే రూ. 75 వేల నుంచి రూ. 80 వేలు ఖర్చవుతుంది. కానీ పేద ముస్లింల వద్ద నుంచి ఉమ్రా యాత్ర కోసం రూ. 25 వేల నుంచి రూ. 30 వేల వరకు తీసుకున్నారు. వీటిని విమాన, విజా ఖర్చుల కోసమని చెప్పారు. మిగిలిన డబ్బులను విదేశాల్లో ఉన్న దాతల సహాయంతో ఉమ్రా యాత్రకు వెళ్లిన వారికి ఉన్నతమైన సౌకర్యాలను కల్పించారు. ఈ యాత్ర జిల్లాలోని, ఇతర రాష్ట్రాల్లోని పేద ముస్లింలను మూడుసార్లు ప్యాకేజీ ద్వారా పంపించారు. తర్వాత దాతలు లేకపోవడం, దాతలతో మధ్యవర్తిత్వం చేయించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముస్లిం మత గురువు ఇమామ్ తేజబుల్ హసన్ చనిపోయాడు. దీంతో ముందుగా రిజిష్టర్ చేయించుకున్న వారిని, వెనుక రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి డబ్బులతో సర్దుబాటు చేస్తూ ఉమ్రా యాత్ర విజయవంతమవుతున్నట్లు ప్రజలను మోసగించారు. కడప అల్మాస్‌పేటలో కార్వాన్ సయ్యద్ సాజీద్దీన్ టూర్ అండ్ ట్రావెల్స్ (ఉమ్రా అండ్ జియారత్ ఇండియా) ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థను రిజిష్టర్ చేయించుకున్న సయ్యద్ అల్తాఫ్ హుసేన్‌కు ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ మహమ్మద్ అలీ డబ్బును అప్పుగా ఇచ్చి ప్రతిఫలంగా తన ఎంఐఎం పార్టీ కార్యకర్తలను ప్రొద్దుటూరు, రాజంపేటలలో ఏజెంట్లుగా పెట్టేందుకు అల్తాఫ్ హుసేన్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. యాత్రికుల నుంచి వసూలు చేసిన డబ్బులను తమ సొంత అవసరాలకు వినియోగించుకుని స్థిరాస్థులను కూడబెట్టుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరిలో మూడవ నిందితుడు, రాయచోటికి చెందిన బర్కత్ ఆలీ కేఎస్ఎస్ ట్రావెల్స్ కార్యాలయంలో లావాదేవీలు చూసుకుంటూ తమ యజమానికివంతు సహకారం అందించారు. బాధితులు ఆరు వేలకు పైగా...రూ. 15–20 కోట్లు వసూలు జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, రాజంపేటలతోపాటు జమ్ము కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 18 రాష్ట్రాలకు చెందిన ప్రజలను తమ ఉమ్రా ప్యాకేజీ ద్వారా కేఎస్ఎస్ ట్రావెల్స్ వారు విశేషంగా ఆకర్షించారు. తాము తక్కువ మొత్తానికి ఉమ్రా యాత్ర చేయిస్తామంటూ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేశారు. దీంతో ఆకర్శితులైన బాధితులు వేలాది మంది డబ్బులను కూడా అదే స్థాయిలో ఆయా బ్రాంచ్‌లలో కట్టారు. ముంబయిలో కేఎస్ఎస్ ట్రావెల్స్ వారు మరో కార్యాలయాన్ని ప్రారంభించి ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే వారిని ఆకట్టుకున్నారు. ఇలా వీరందరి నుంచి 15 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు. వసూలు చేసిన మొత్తంతో పారిపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబయి కార్యాలయంలో ప్రస్తుతం కేఎస్ఎస్ ట్రావెల్స్ పరిధిలో దాదాపు నాలుగు వేల మంది బాధితులకు సంబంధించిన పాస్‌పోర్టులు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం నిందితులు ముగ్గురిని అరెస్టు చేసిన కడప సీసీఎస్ పోలీసులు 50 మంది బాధితులకు సంబంధించిన పాస్‌పోర్టులను మాత్రమే సీజ్ చేశారు. ఈ కేసులో జిల్లాలోని ఏజెంట్లతోపాటు 18 రాష్ట్రాల్లో ఉన్న ఏజెంట్లను కూడా నిందితులుగా పోలీసులు చేర్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బాధితుల పాస్‌పోర్టులను కోర్టు అనుమతితో వారికి అందజేసే ప్రయత్నం చేస్తామని లేదా బాధితులే కోర్టును ఆశ్రయించి పొందేలా చూస్తామని సీసీఎస్ డీఎస్పీ నాగేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బు నుంచి నిందితులు కూడబెట్టన స్థిరాస్థుల అటాచ్‌మెంట్‌కు కూడా తమవంతు దర్యాప్తులో భాగంగా చేపడతామన్నారు.వీరిపై జిల్లాలోని పలు స్టేషన్లతోపాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదయ్యాయని పోలీసులు చెబుతున్నారు. -
ఉమ్రా యాత్ర పేరుతో మోసం చేసిన నిందితుల అరెస్ట్
సాక్షి, వైఎస్సార్ కడప: పేద మైనారర్టీలను తక్కువ టికెట్ ఖర్చుతో ఉమ్రాకు పంపిస్తామని ఓ ట్రావెల్ ఏజెన్సీ బడా మోసానికి పాల్పడిన విషయం తెలిసిదే. అయితే ఉమ్రా యాత్ర పేరుతో అమాయకపు ముస్లిం ప్రజలను మోసం చేసిన నిందితులను కడప సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. తక్కువ టికెట్ ధరతో కేఎస్ఎస్ ఉమ్రా ట్రావెల్ ఏజెన్సీ యాజమాన్యం దేశ వ్యాప్తంగా వేల మంది దగ్గరి నుంచి కోట్ల రుపాయలను వసూలు చేసింది. ఎంఐఎంకి చెందిన ఓ వ్యక్తితో సహా మరో ఇద్దరు నిందుతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సీసీఎస్ డీఎస్పీ నాగేశ్వర్ రెడ్డి వెల్లడించారు. -
ఉమ్రా ముసుగులో ఘరానా మోసం
ప్రొద్దుటూరు క్రైం : ‘రెండు రోజుల్లో కేఎస్ఎస్ ట్రావెల్స్ చైర్మన్ విదేశాలకు చెక్కేసేవాడు. అదృష్టం కొద్దీ ఈ విషయం మాకు తెలిసింది.. లేదంటే బాధితులు మాపై దాడి చేసేవారు’ కేఎస్ఎస్ ట్రావెల్స్ కార్యాలయాల్లో పని చేస్తున్న పలువురు ఆపరేటర్లు పోలీసుల వద్ద స్వయంగా అన్న మాటలు ఇవి. తక్కువ మొత్తంతో ఉమ్రా (పవిత్ర యాత్ర)కు పంపిస్తానని కేఎస్ఎస్ ట్రావల్స్ తరఫున పెద్ద సంఖ్యలో వసూళ్లు చేసి దగా చేయబోయిన సయ్యద్ అల్తాఫ్ హుస్సేన్ అబిది వ్యవహారం బట్టబయలైంది. వైఎస్ఆర్ జిల్లాలోని కడప కేంద్రంగా చేసుకొని దేశవ్యాప్తంగా కేఎస్ఎస్ ట్రావెల్స్ బ్రాంచ్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జనవరి 16 నుంచి ఉమ్రా కోసం ప్రజల నుంచి డబ్బు వసూలు చేశారు. వచ్చే ఏడాదిలో వెళ్లాలనుకునే వారి నుంచి రూ.14 నుంచి 25 వేలు, త్వరగా వెళ్లాలనుకునే వారి నుంచి రూ. 30– 35 వేలు వసూలు చేశారు. ఇక రంజాన్ నెలలో ఉమ్రా చేయాలనుకునే వారు రూ.60 వేలకు పైగా చెల్లించాల్సి వస్తుంటుంది. అయితే కేఎస్ఎస్ ట్రావెల్స్ వారు మాత్రం రూ.35 వేల నుంచి 40 వేలకే తీసుకెళతామని ప్రచారం చేయడంతో.. చాలా మంది బుక్ చేసుకున్నారు. అయితే రంజాన్ వచ్చేసినా ఏ తారీఖున పంపిస్తారన్నది తేల్చలేదు. హెడ్ ఆఫీసు నుంచి ఇందుకు సంబంధించిన సమాచారం లేదని స్థానిక ఉద్యోగులు చెప్పారు. అయితే డబ్బు చెల్లించిన వారి నుంచి ఇటీవల ఒత్తిడి పెరిగింది. దీనికి తోడు ఉమ్రాకు వెళ్లే తేదీలను మార్చడంతో సిబ్బందికి సైతం సందేహాలు మొదలయ్యాయి. సిబ్బంది సాయంతో కేఎస్ఎస్ ట్రావెల్స్ మోసాలు వెలుగులోకి కేఎస్ఎస్ ట్రావెల్స్ చైర్మన్, భాగస్వాములు కలిసి దేశం విడిచి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ఆపరేటర్లకు సమాచారం అందింది. వాళ్లు విదేశాలకు వెళ్తే ఉమ్రా బాధితులు తమను చంపేస్తారని భావించారు. ఈ క్రమంలోనే చైర్మన్ ఉద్ద ఉన్న ఆపరేటర్ సలహా మేరకు అంతా సమావేశమై చర్చించి ప్రొద్దుటూరు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల సూచనల మేరకు పక్కా ప్రణాళికతో బెంగళూరులో ఉన్న చైర్మన్, ఇతర భాగస్వాములను అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఆపరేటర్లు, సబ్ ఏజెంట్లు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా చైర్మన్‌కు సంబంధించిన వ్యక్తులు తరచూ తమకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఆపరేటర్లు వాపోతున్నారు. ఎంఐఎం ఆలీ ఎవరో మాకు తెలియదు.. పోలీసుల అదుపులో ఉన్న ఎంఐఎం ఆలీ ఎవరో తమకు తెలియదని ఆపరేటర్లు అంటున్నారు. అతనికి చైర్మన్ అల్తాఫ్హుస్సేన్ అబిదితో ఉన్న సంబంధం కూడా తెలియదని అంటున్నారు. ‘ఎంఐఎం ఆలీ బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నాడని అనేక సార్లు మా చైర్మన్ మాతో అనే వారు.. కొన్ని రోజుల క్రితం కూడా ట్రావెల్స్ డబ్బును అతను తీసుకున్నాడు.. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయండని మా చైర్మన్ చెప్పారు’ అని ఆపరేటర్లు పోలీసులతో చెప్పినట్లు తెలిసింది. ఈ కారణంతోనే ఆలీని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. -
ఉమ్రా పేరుతో టోకరా
ప్రొద్దుటూరు క్రైం : ఉమ్రా యాత్రకు పంపిస్తామని మోసం చేసిన కేఎస్ఎస్ (కర్వానే సయ్యద్ ఉస్ సజిదిన్) ఉమ్రా ట్రావెల్స్‌కు సంబంధించి భయంకరమైన నిజాలు వెలుగు చూస్తున్నాయి. రాయలసీమకే పరిమితమైందనుకున్న ఈ సంస్థ దేశవ్యాప్తంగా విస్తరించింది. అన్ని రాష్ట్రాల్లోని ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో కేఎస్ఎస్ ట్రావెల్స్ బ్రాంచి కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ఒక్క హైదరాబాద్‌లోనే 10 వేల మందికి పైగా ఉమ్రా కోసం డబ్బు చెల్లించగా దేశవ్యాప్తంగా ఈ సంఖ్య లక్షల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు బెంగళూరు, చెన్నై, గుల్బర్గా తదితర ప్రాంతాల నుంచి ప్రొద్దుటూరుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థకు చెందిన చైర్మన్ సయ్యద్ అల్తాఫ్హుస్సేన్ అబిది, మేనేజింగ్ డైరెక్టర్ ఇజాజ్ఆలీ, మేనేజర్ బర్కత్ ఆలీ పోలీసుల అదుపులో ఉన్నారని తెలియడంతో దేశవ్యాప్తంగా ఉన్న ఉమ్రా బాధితులు ప్రొద్దుటూరుకు పయనమైనట్లు సమాచారం. జనవరి నుంచి బుకింగ్‌లు కేఎస్ఎస్ ట్రావెల్స్ సంస్థ జనవరి 14 నుంచి ఉమ్రా కోసం బుకింగ్ ప్రారంభించినట్లు బాధితులు చెబుతున్నారు. ప్రారంభంలో రూ.14 వేలకే ఉమ్రా పంపిస్తామని ప్రచారం చేశారు. ఈ మేరకు రెండు బ్యాచ్‌లను ఉమ్రాకు పంపారు. అయినా రూ.14 వేలకే ఉమ్రా యాత్ర ఎలా పంపిస్తారనే అనుమానాలు చాలా మంది నుంచి వస్తుండటంతో ఒక్క సారిగా రూ.30 వేలకు పెంచారు. నెలలోపు పంపిస్తానని రూ. 35 వేలు–రూ.40 వేలు కూడా కొంత మంది నుంచి వసూలు చేశారు. రంజాన్ నెలలో ఉమ్రాకు పంపిస్తానని దేశ వ్యాప్తంగా ఉన్న చాలా మంది వద్ద నుంచి డబ్బు వసూలు చేసినట్లు తెలిసింది. రంజాన్ మాసం ప్రారంభమైనా ఒక్క బ్యాచ్‌ను కూడా ఉమ్రాకు పంపకపోవడంతో బోర్డు తిప్పేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. కడపలో రూ. 3 కోట్లు, కర్నూల్లో రూ. 2 కోట్లు, ప్రొద్దుటూరులో రూ. 5 కోట్ల మేర ట్రావెల్స్ నిర్వాహకులు వసూలు చేసినట్లు ఆపరేటర్లు చెబుతున్నారు. ట్రావెల్స్ కార్యాలయంలో వేలాది పాస్‌పోర్ట్‌లు రంజాన్ నెలలో తక్కువ ఖర్చుతో ఉమ్రా కు పంపిస్తామని ట్రావెల్స్ నిర్వాహకులు చెప్పడంతో చాలా మంది డబ్బు కట్టారు. దేశవ్యాప్తంగా 3 వేల మందిని ఉమ్రాకు పంపిస్తానని వారి పాస్‌పోర్ట్‌లను ఆయా ప్రాంతాల ఏజెంట్లు సేకరించి వీటిని ముంబయికి పంపించారు. అయితే వీరిలో ఏ ఒక్కరినీ ఉమ్రాకు పంపకపోవడంతో పాస్‌పోర్ట్‌లన్నీ ముంబయిలోనే ఉండిపోయాయి. దేశవ్యాప్తంగా 59 చోట్ల బ్రాంచ్‌లు కేఎస్ఎస్ ఉమ్రా ట్రావెల్స్‌కు దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో 59 బ్రాంచ్‌లు ఉన్నట్లు సంస్థలో పని చేసే ఆపరేటర్లు తెలిపారు. ఉమ్రా పేరుతో సంస్థ నిర్వాహకులు రూ.300 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, ఇప్పటికి సుమారు రూ.200 కోట్ల వరకూ ప్రజల నుంచి వసూలు అయినట్లు వారు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్, లక్నో, ఢిల్లీ, ముంబయి, ఉత్తరాఖండ్, అలీఘడ్ తదితర రాష్ట్రాల్లో బ్రాంచ్‌లను ఏర్పాటు చేశారు. భయం గుప్పిట్లో ఆపరేటర్లు.. తమకు ప్రాణ భయం ఉందని కేఎస్ఎస్ ట్రావెల్స్ కార్యాలయాల్లో పని చేస్తున్న పలువురు ఆపరేట ర్లు వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. కడప, ప్రొద్దుటూరు, కర్నూలు కార్యాలయాల్లో పని చేస్తు న్న ఆపరేటర్లు షఫీ, అక్తర్, గైబు, ఖాజా, ఇషాన్ సోమవారం వన్‌టౌన్‌కు వచ్చారు. ప్రజల నుంచి వీళ్లే డబ్బు తీసుకొని సంస్థకు చెల్లించడంతో తమ పై ఒత్తిడి తెస్తున్నారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరు చొరవ తీసుకోవడం వల్లనే సంస్థ నిర్వాహకులు పోలీసులకు పట్టుబడ్డారు. ప్రొద్దుటూరుకు క్యూ కడుతున్న బాధితులు కేఎస్ఎస్ ట్రావెల్స్ సంస్థ మోసం చేసిందని, సంస్థ నిర్వాహకులు పోలీసుల అదుపులో ఉన్నారని తెలియడంతో చాలా మంది ప్రొద్దుటూరుకు క్యూ కట్టారు. ప్రొద్దుటూరు, కమలాపురం, మైదుకూరు, కడపతో పాటు కర్నూలు జిల్లాలోని కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ, చాగలమర్రి, అనంతపురం జిల్లాలోని అనంతపురం, గుత్తి తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఉమ్రా బాధితులు డబ్బు కట్టిన రసీదులు తీసుకొని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వస్తున్నారు. ఎలాగైనా తమ డబ్బు వచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు డీఎస్పీ శ్రీనివాసరావును కోరారు. వారి వద్ద ఉన్న పత్రాల ఆధారంగా పోలీసులు పేర్లు నమోదు చేసుకుంటున్నారు. రూ.56 వేలు కట్టాను ఉమ్రాకు తక్కువ డబ్బుతో పంపిస్తామని తెలియడంతో మా కుటుంబ సభ్యులు నలుగురి కోసం రూ. 56 వేలు చెల్లించాను. డబ్బు కట్టి చాలా రోజులైనా అతను ఉమ్రాకు పంపలేదు. ఇలా మోసం చేస్తారని అనుకోలేదు. ఎలాగైనా మా డబ్బు ఇప్పించాలి. – షేక్ అన్వర్‌బాషా,డీసీఎస్సార్ కాలనీ, ప్రొద్దుటూరు వడ్డీకి డబ్బు చెల్లించాను ఉమ్రాకు వెళ్లే భాగ్యం మళ్లీ వస్తుందో రాదో అని మా ఇంట్లో ఇద్దరి కోసం రూ. 50 వేలు ట్రావెల్స్ నిర్వాహకులకు కట్టాను. కానీ మోసం చేశారని తెలియడంతో రెండు రోజుల నుంచి ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. పోలీసు అధికారులు ఎలాగైనా మా డబ్బు వచ్చేలా చర్యలు తీసుకోవాలి.– షాహుసేన్వల్లి, చాగలమర్రి,కర్నూలు జిల్లా మోసం చేస్తాడని అనుకోలేదు ఉమ్రాకు పంపిస్తామని ఇలా మోసం చేస్తారని అనుకోలేదు. మోసపోయిన మమ్నల్ని పోలీసు అధికారులు ఆదుకోవాలి. డబ్బు కట్టిన వాళ్లలో చాలా మంది పేదలే ఉన్నారు. రూ. కోట్లలో వసూలు చేసిన కేఎస్ఎస్ ట్రావెల్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి. – వల్లీ సాహెబ్, ఖాదర్‌బాద్,ప్రొద్దుటూరు మండలం -
పవిత్రయాత్ర మక్కా
కర్నూలు (ఓల్డ్‌సిటీ): మక్కా యాత్ర పవిత్రమైనదని అల్‌హరమైన్ హజ్–ఒ–ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ ఎం.ఎ.ఆసిఫ్‌పాషా తెలిపారు. ఆదివారం రాత్రి స్థానిక భాగ్యనగర్‌లోని కార్యాలయంలో ఉమ్రా యాత్రికులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఉమ్రా యాత్రికుల ఫ్లైట్ ఈనెల 16వ తేదీన శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరుతుందన్నారు. అనంతరం యాత్రికులకు బ్యాగులు, ట్యాగులు, గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎం.ఎ.ఆరిఫ్‌పాషా కూడా పాల్గొన్నారు. -
పవిత్ర యాత్ర మక్కా
కర్నూలు (ఓల్డ్‌సిటీ): మక్కా.. పవిత్రయాత్ర అని జిల్లా హజ్ కమిటీ అధ్యక్షుడు నూర్‌అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు. అల్‌హరమైన్ హజ్, ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో ఆదివారం ఉమ్రా యాత్రికులకు స్థానిక పెద్ద మార్కెట్ సమీపంలోని ఉర్దూ ఘర్‌లో శిక్షణ తరగతులు నిర్వహించారు. నూర్ అహ్మద్ ఖాన్‌తో పాటు నాయబ్ ఖాజీ సలీం అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థిక స్థోమత కలిగిన ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారైనా హజ్‌కు వెళ్లాలని చెప్పారు. ఆ తర్వాత ఉమ్రా యాత్ర చేయాలన్నారు. సంస్థ ఎండీ ఎం.ఎ.ఆసిఫ్‌పాషా, సభ్యుడు ఎం.ఎ.ఆరిఫ్ మాట్లాడుతూ 49 మంది యాత్రికులతో ఈనెల 20వ తేదీ ఉదయం 10.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఫ్లైట్ బయలుదేరనున్నట్లు తెలిపారు.