విశాఖ లీగల్: మహిళను హత్య చేసిన వ్యక్తికి యావజ్జీవ జైలు శిక్ష, రూ.10వేల జరిమాన విధిస్తూ నగరంలోని మహిళా కోర్టు (6వ అదనపు జిల్లా కోర్టు) న్యాయమూర్తి జి.రజనీ శుక్రవారం తీర్పునిచ్చారు. జరిమాన చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్.శ్రీనివాసరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు కారిపల్లి పెంటయ్య (46) న్యూపోర్టు పోలీస్‌స్టేషన్ పరిధిలోని గాజువాక దగ్గర గంట్యాడలో ఉంటున్నాడు. వృత్తిరీత్యా పెయింటింగ్ పనులు చేసేవాడు. 23 ఏళ్ల కిందట వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు. మనస్పర్థలతో భార్య అతడిని వదిలేసింది. ఈ నేపథ్యంలో గంట్యాడ ప్రాంతానికి చెందిన కనకమహాలక్ష్మి (38)తో పరిచయం ఏర్పడింది. ఆమె కూడా ఇద్దరు పిల్లలతో భర్తకు దూరంగా ఉంది. ఇద్దరి మధ్య పరిచయం వివాహానికి దారితీసింది. పెంటయ్యతో కనకమహాలక్ష్మికి ఒక కూతురు పుట్టింది. కొంత కాలం సవ్యంగా సాగిన వీరి కాపురంలో కలతలు చెలరేగాయి. నిత్యం గొడవలు జరిగేవి. పెంటయ్య భార్యను మానసికంగా, శారీరకంగా తీవ్రంగా హింసించేవాడు. భర్త ఆగడాలను భరించలేక దూరంగా ఉండేది. దీంతో ఎలాగైనా కనకమహాలక్ష్మిని అంతం చేయాలని పెంటయ్య పథకం రచించాడు. 2012 జనవరి 10న లక్ష్మి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండగా వెనుక నుంచి వచ్చి పెంటయ్య ఆమెపై కిరోసిన్ పోసి నిప్పు అంటించాడు.
తీవ్ర గాయాల మధ్య కేజీహెచ్‌లో చేరింది. మరణ వాగ్మూలంలో భర్త తనపై కిరోసిన్ పోసి నిప్పు అంటించినట్లు చెప్పింది. ఈ మేరకు న్యూపోర్టు పోలీస్ అధికారులు టి.త్రినాథ్, శ్రీనివాసరావు, సంజీవరావు కేసు దర్యాప్తు చేసి నిందితునిపై భారతీయ శాక్షాస్మృతి సెక్షన్ 302, 498ఎ కింద కేసు నమోదు చేసి నేరాభియోగపత్రాన్ని దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment