life time prisoner
-
కాల్పుల కేసులో ఫారూఖ్‌కు జీవిత ఖైదు
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 2020, డిసెంబర్ 18న జరిగిన కాల్పుల కేసులో ప్రధాన నిందితుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్‌కు ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో ఏ–2, ఏ–3లను నిర్దోషులుగా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక కోర్టు జడ్జి, జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాస్‌రావు సోమవారం తీర్పునిచ్చారు. ఫారూఖ్‌ను కోర్టుకు తీసుకొచ్చినప్పటికీ కోవిడ్ దృష్ట్యా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీర్పు చెప్పారు. ఫారుఖ్ మరో గదిలో ఉండి జడ్జి తీర్పు విన్నాడు. విచారణలో నిందితుడి నేరం రుజువైందని జడ్జి ప్రకటించారు. ప్రత్యేక కోర్టు .. ఫారూఖ్‌కు జీవిత ఖైదుతోపాటు రూ.12వేల జరిమానా విధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముస్కు రమణారెడ్డి, జిల్లా ఎస్పీ డి.ఉదయ్‌కుమార్ రెడ్డిలు వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణంలోని తాటిగూడకు చెందిన ఫారూఖ్ అహ్మద్ తన ప్రత్యర్థి వర్గానికి చెందిన మాజీ కౌన్సిలర్ సయ్యద్ జమీర్, సయ్యద్ మన్నాన్, సయ్యద్ మోతిషీన్పై తుపాకీతో కాల్పులు జరిపాడు. గాయపడిన సయ్యద్ జమీర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
భార్యా హంతకునికి జీవితఖైదు
విశాఖ లీగల్: మహిళను హత్య చేసిన వ్యక్తికి యావజ్జీవ జైలు శిక్ష, రూ.10వేల జరిమాన విధిస్తూ నగరంలోని మహిళా కోర్టు (6వ అదనపు జిల్లా కోర్టు) న్యాయమూర్తి జి.రజనీ శుక్రవారం తీర్పునిచ్చారు. జరిమాన చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్.శ్రీనివాసరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు కారిపల్లి పెంటయ్య (46) న్యూపోర్టు పోలీస్‌స్టేషన్ పరిధిలోని గాజువాక దగ్గర గంట్యాడలో ఉంటున్నాడు. వృత్తిరీత్యా పెయింటింగ్ పనులు చేసేవాడు. 23 ఏళ్ల కిందట వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు. మనస్పర్థలతో భార్య అతడిని వదిలేసింది. ఈ నేపథ్యంలో గంట్యాడ ప్రాంతానికి చెందిన కనకమహాలక్ష్మి (38)తో పరిచయం ఏర్పడింది. ఆమె కూడా ఇద్దరు పిల్లలతో భర్తకు దూరంగా ఉంది. ఇద్దరి మధ్య పరిచయం వివాహానికి దారితీసింది. పెంటయ్యతో కనకమహాలక్ష్మికి ఒక కూతురు పుట్టింది. కొంత కాలం సవ్యంగా సాగిన వీరి కాపురంలో కలతలు చెలరేగాయి. నిత్యం గొడవలు జరిగేవి. పెంటయ్య భార్యను మానసికంగా, శారీరకంగా తీవ్రంగా హింసించేవాడు. భర్త ఆగడాలను భరించలేక దూరంగా ఉండేది. దీంతో ఎలాగైనా కనకమహాలక్ష్మిని అంతం చేయాలని పెంటయ్య పథకం రచించాడు. 2012 జనవరి 10న లక్ష్మి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండగా వెనుక నుంచి వచ్చి పెంటయ్య ఆమెపై కిరోసిన్ పోసి నిప్పు అంటించాడు. తీవ్ర గాయాల మధ్య కేజీహెచ్‌లో చేరింది. మరణ వాగ్మూలంలో భర్త తనపై కిరోసిన్ పోసి నిప్పు అంటించినట్లు చెప్పింది. ఈ మేరకు న్యూపోర్టు పోలీస్ అధికారులు టి.త్రినాథ్, శ్రీనివాసరావు, సంజీవరావు కేసు దర్యాప్తు చేసి నిందితునిపై భారతీయ శాక్షాస్మృతి సెక్షన్ 302, 498ఎ కింద కేసు నమోదు చేసి నేరాభియోగపత్రాన్ని దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు. -
క్షమాభిక్ష.. ఇదో కక్ష
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: రాష్ట్ర ప్రభుత్వం జీవిత ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ విడుదల చేసిన జీఓ ఎంఎస్ నంబర్ 46 ఖైదీలకు నిరాశ మిగిల్చింది. రాష్ట్ర ప్రభుత్వం 2019 జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఖైదీల క్షమాభిక్ష ప్రసాదిస్తూ జీఓ విడుదల చేసింది. దీని ప్రకారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ నుంచి 57 మంది ఖైదీలు అర్హులైన వారు ఉన్నారని జాబితా తయారు చేస్తూ అధికారులు ప్రభుత్వానికి పంపారు. ఎట్టకేలకు ప్రభుత్వం జీవిత ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ ఈనెల 25వ తేదీ సోమవారం జీఓ విడుదల చేసింది. అయితే రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ నుంచి కేవలం ఎనిమిది మంది మాత్రమే విడుదల చేస్తూ పేర్లు ప్రకటించడంతో ఖైదీల్లో నిరాశ నెలకొంది. ఏళ్ల తరబడి జైలులో మగ్గుతూ వృద్ధాప్యంలోనైనా విడుదలై తమ వారితో కలసి శేష జీవితం గడపాలనుకునే ఖైదీల ఆశలపై సర్కారు నీళ్లుచల్లింది. గత ఏడాది ఇలా.. గత ఏడాది 2018లో రాష్ట్ర ప్రభుత్వం జీఎం ఎంఎస్ నంబర్ 8ను విడుదల చేసింది. దీని ప్రకారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి సుమారు 60 మంది వరకూ క్షమాభిక్షకు అర్హులైన ఖైదీల లిస్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. అయితే కేవలం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి 18 మందికి మాత్రమే క్షమాభిక్ష ప్రసాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. రాజమహేంద్రవరం మహిళా కేంద్ర కారాగారం నుంచి ఎనిమిది మంది క్షమాభిక్షకు అర్హులు ఉండగా ఒక్కరూ కూడా విడుదలకు నోచుకోలేదు. ఈ ఏడాది ఎనిమిది మందిని మాత్రమే ఈ ఏడాది 2019లో జీఓ నంబర్ 6ను ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఏడేళ్లు శిక్షా కాలం పూర్తి చేసి మూడేళ్లు రెమిషన్‌తో కలిపి పదేళ్ల శిక్ష కాలం పూర్తి చేసిన వారు 57 మంది అర్హులు ఉన్నారు. అలాగే ఓల్డ్ ఏజ్ (వృద్ధాప్యం లో ఉన్న వారు) ఐదేళ్లు పూర్తి చేసి రెండేళ్లు రెమిషన్‌తో కలిపి మొత్తం ఏడేళ్ల శిక్షా కాలం పూర్తి చేసిన వారు ఒకరు ఉన్నారు. 498 ఏ కేసులో 14 ఏళ్లు శిక్షా కాలం పూర్తి చేసి ఆరేళ్ల రెమ్యూషన్తో కలిపి మొత్తం 20 ఏళ్ల శిక్షా కాలం పూర్తి చేసిన వారు ఒకరు ఉన్నారు. మొత్తం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి 57 మంది అర్హులైన వారు ఉండగా కేవలం ప్రభుత్వం ఎనిమిది మందిని మాత్రమే విడుదల చేస్తూ జీఓ ఇచ్చింది. క్షమాభిక్ష ఖైదీల సంఖ్యను తగ్గిస్తున్న ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టేందుకు టీడీపీ ప్రభుత్వం చొరవచూపడం లేదని ఖైదీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2016 జూలై 25న క్షమాభిక్ష ప్రసాదించినప్పుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి 110 మంది ఖైదీలు క్షమాభిక్ష పై విడుదలయ్యారు. 2018 జూన్ 10వ తేదీన 66 మంది అర్హులైన వారి పేర్లు పంపించగా కేవలం 18 మందిని మాత్రమే విడుదల చేశారు. ఈ ఏడాది క్షమాభిక్ష కోసం అర్హులైన వారి పేర్లు 57 మంది పురుష ఖైదీలు, ఆరుగురు మహిళా ఖైదీల లిస్టు పంపితే కేవలం ఎనిమిది మందిని మాత్రమే విడుదల చేస్తూ ప్రభుత్వం జీఓ ఇచ్చింది. 498ఏలో శిక్ష పడిన ఖైదీలకు, ఉద్యోగుల హత్య కేసులో జైలుకు వచ్చిన ఖైదీలకు, అనారోగ్యంతో వృద్ధాప్యంలో ఉన్న ఖైదీలకు ప్రభుత్వం దయతో క్షమాభిక్ష ప్రసాదించాలని ఖైదీలు కోరుతున్నారు. కోర్టును ఆశ్రయించడమే వారు చేసిన తప్పు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 2018లో అర్హులైన 22 మంది ఖైదీలు తాము క్షమాభిక్ష విడుదలకు అన్ని విధాలా అర్హులమని, అయితే ప్రభుత్వం జీవో వల్ల విడుదలకు నోచుకోలేదని కోర్టును ఆశ్రయించారు. కోర్టు వీరి పిటిషన్‌ను పరిశీలించి ఖైదీలను విడుదల చేయాలంటూ తీర్పు ఇచ్చింది. అయితే కోర్టు తీర్పును ప్రభుత్వం పట్టించుకోకుండా గత ఏడాది కోర్టును ఆశ్రయించిన 22 మంది ఖైదీలను ఈసారి కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు. -
ఖైదీ మృతిపై ఆందోళన
ఆరిలోవ(విశాఖ తూర్పు): విశాఖ కేంద్ర కారాగారంలో ఓ జీవిత ఖైదీ బుధవారం ఆత్మహత్య చేసుకొన్న సంఘటన ఆందోళనకు దారి తీసింది. ఆత్మహత్య చేసుకొన్నాడని జైల్ అధికారులు, ఆత్మహత్య చేసుకోవడానికి సరైన కారణాలు చెప్పాలని మృతుని బంధువులు, గ్రామస్తులు జైలు ఎదుట సాయంత్రం ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే... ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసుతో పాటు ఆ బాలికను మోసం చేసిన కేసులో ఏక కాలంలో ఆనందపురం మండలం రాయవరం గ్రామానికి చెందిన సియాద్రి వెంకటరమణ(30)కు విశాఖ మెట్రోపాలిటిన్ స్పెషల్ జెడ్జి ఈ నెల 12న రెండు జీవిత ఖైదులు విధించారు. అప్పటి నుంచి విశాఖ కేంద్ర కారాగారంలో ఆయన శిక్ష అనుభవిస్తూ వీవింగ్ విభాగంలో పనిచేస్తున్నాడు. బుధవారం వెంకటరమణ జైలులో ఉరి వేసుకోవడానికి ప్రయత్నించాడని, ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడని జైలు అధికారులు అతని బంధువులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకొన్న బంధువులు, తల్లి దేవుడమ్మ కేజీహెచ్‌కు చేరుకొన్నారు. అక్కడ వెంకటరమణ మృతి చెందాడని తెలుసుకొని మార్చురీలో ఉన్న మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. మృతిచెందిన విషయాన్ని జైలు అధికారులు దాచిపెట్టి తప్పుడు సమాచారం ఇచ్చారని, వెంకటరమణ మృతికి వేరే కారణం ఉంటుందని, దాన్ని అధికారులు దాచిపెట్టారంటూ సాయంత్రం జైలు ఎదుట సుమారు 200 మంది వరకు రాయవరం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తోటి ఖైదీలు, కాపలాగా ఉన్న జైల్ సిబ్బంది మధ్యలో ఎలా ఉరి వేసుకోవడానికి వీలుపడుతుందని మృతుని బంధువులు ప్రశ్నిస్తున్నారు. జైలు అధికారులు వెంటనే మృతికి కారణాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆరిలోవ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జైలు అధికారులపై ఫిర్యాదు చేశారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఉరి వేసుకున్నాడు వెంకటరమణ బుధవారం మధ్యాహ్నం ఉరి వేసుకొన్నాడు. జైలులో వీవింగ్ విభాగంలో పనిచేస్తున్నాడు. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం ఒంటి గంట సమయంలో తాడుతో ఉరి వేసుకోవడానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న వీవింగ్ ఇన్స్ట్రెక్టర్, పనిచేస్తున్న తోటి ఖైదీలు, డ్యూటీలో ఉన్న సిబ్బంది చూసి వెంటనే కిందకు దింపి అధికారులకు తెలియజేశారు. వెంటనే జైలు ఎస్కార్టుతో కేజీహెచ్‌కు తరలించాం. మార్గమధ్యలోనే ఖైదీ మృతి చెం దినట్లు వైద్యులు నిర్థారించారు. మృతుని బంధువులకు సమాచారం అందించాం. –ఎస్.రాహుల్, జైల్ సూపరింటెండెంట్ జైలు అధికారులే ఏదో చేశారు జైలులో శిక్ష అనుభవిస్తున్న నా కొడుకు వెంకటరమణను జైలు అధికారులే ఏదో చేసేశారు. జైల్‌కు వెళ్లి రెండు వారాలు కాకుండా ఉరి వేసుకొన్నాడని చెప్పారు. అధికారులు అబద్ధం చెబుతున్నారు. వాస్తవాలు వెల్లడించాలి.– సియాద్రి దేవుడమ్మ, మృతుడి తల్లి -
13 మంది ఖైదీలకు క్షమాభిక్ష
ఆరిలోవ(విశాఖ తూర్పు): విశాఖ కేంద్ర కారాగారం నుంచి 13 మంది జీవిత ఖైదీలు బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టనున్నారు. వీరంతా క్షమాభిక్షపై కొద్ది రోజుల్లో విడుదల కానున్నారు. ఈ మేరకు రాష్ట్ర జైళ్ల శాఖ ఉన్నతాధికారుల నుంచి శుక్రవారం సాయంత్రం విశాఖ కేంద్రకారాగారం అధికారులకు ఉత్తర్వులు అందాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇక్కడి నుంచి 13 మంది జీవిత ఖైదీలు విడుదల కానున్నారని జైల్ సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ తెలిపారు. వీరిలో ఒకరు మహిళ ఉన్నట్లు చెప్పారు. అయితే వీరిని ఎప్పుడు విడుదల చేయాలో అనే తేదీ ఇంకా ప్రకటించలేదన్నారు. ఈ ఏడాది జనవరిలో క్షమాభిక్ష జీవో విడుదలైందన్నారు. దానిలో నిబంధనలు ప్రకారం సత్ప్రవర్తన కలిగిన 17 మంది ఖైదీలతో కూడిన జాబితాను జైల్ శాఖ ఉన్నతాధికారులకు పంపించామన్నారు. ఆ జాబితాను స్క్రూటినీ చేసిన అనంతరం వారిలో 13 మందిని అర్హులుగా గుర్తించారని చెప్పారు. ఎప్పటి నుంచో విడుదల కోసం ఎదురుచూస్తున్న ఈ ఖైదీలు బయట ప్రపంచంలోకి అడుగు పెట్టనుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
మూడు గంటలు.. ముచ్చెమటలు!
కుషాయిగూడ: కోర్టు తీర్పుతో మానసికంగా కుంగిపోయిన ఓ జీవితఖైదీ హైటెన్షన్ కరెంట్ పోల్ ఎక్కి మూడు గంటల పాటు పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని, తనపై అక్రమ కేసు బనాయించి, జైలుపాలు చేసిన శంకర్పల్లి ఎస్సై నాగరాజును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సూసైడ్ నోట్ రాసి కరెంటు స్తంభమెక్కాడు. దీంతో అప్రమత్తమైన జైల్ సిబ్బంది ట్రాన్స్ కో అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అనంతరం ఫైర్ సిబ్బంది సహకారంతో అతడిని సురక్షితంగా కిందకు దించడంతో కథ సుఖాంతమైంది. సోమవారం చర్లపల్లి కేంద్ర కారాగారంలో చోటు చేసుకున్న సంఘటన వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా, శేర్గూడానికి చెందిన యండీ ఖాజాపాషా భార్యపై అనుమానంతో 2012లో బానూరు వద్ద ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. కేసును విచారించిన సంగారెడ్డి కోర్టు 2013లో అతడికి జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. అప్పటి నుంచి చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. జైల్లో సత్పప్రవర్తనతో మెలగడంతో ఖాజాపాషాను 2017లో జైల్ పెట్రోల్‌బంకు విధుల నిర్వహణకు కేటాయించారు. గత డిసెంబర్లో పెరోల్‌పై నెలరోజుల పాటు ఇంటికి వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో జిల్లా కోర్టు తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీలు చేసుకున్నాడు. అయితే ఈ నెల 7న హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షను ఖారారు చేస్తు తీర్పునివ్వడంతో మానసికంగా కుంగిపోయిన ఖాజాపాషా జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో పెట్రోల్‌బంకు ఆవరణలో కరెంటు పోల్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. ఎస్సై నాగరాజును సస్పెండ్ చేయాలి నా భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తనపై అక్రమంగా కేసు బనాయించి, తన పిల్లలకు దూరం చేసిన అప్పటి శంకర్పల్లి ఎస్సై నాగరాజు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సూసైడ్ నోట్ రాసి కరెంటు పోలెక్కడంతో అప్రమత్తమైన జైల్ సిబ్బంది, కుషాయిగూడ పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాన్స్‌కో అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అధికారులు అతనితో మాట్లాడేందుకు ప్రయత్నించగా పై నుంచి మాటలు వినిపించక పోవడంతో మరో ఖైదీని పోల్ పైకి పంపి సెల్‌ఫోన్‌ను అందజేసి పలుమార్లు సంభాషించారు. అతని డిమాండ్లను అంగీకరిస్తూ, సదరు ఎస్సైపై చర్యలు తీసుకుంటామని కుషాయిగూడ ఏసీపీ కృష్ణమూర్తి, జైల్ సూపరింటెండెంట్ భాస్కర్ హామీ ఇచ్చినా అతను కిందకు దిగిరాలేదు. ‘‘బతకాలని అనిపించడం లేదని, నేను చనిపోతాను’’ అంటూ ఫోన్ కట్‌చేశాడు. దాదాపు మూడు గంటల పాటు అధికారులు, సహచర ఖైదీలు ఫోన్లో మాట్లాడుతూ సర్ధిజెప్పే ప్రయత్నం చేసినా అతని నిర్ణయంలో మార్పురాలేదు. దీంతో అధికారులు రక్షణ చర్యలకు శ్రీకారం చుట్టారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది.. అప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్న చర్లపల్లి ఫైర్ సిబ్బంది తమ వద్ద ఉన్న మ్యాట్లతో ప్రాథమికంగా రక్షణ చర్యలు చేపట్టారు. ఫైర్ ఆఫీసర్ శైఖర్రెడ్డి ఉన్నతాధికారులతో మాట్లాడి 54 ఫీట్ల స్కై లిఫ్ట్‌ను రప్పించారు. కిందపడినా ప్రమాదం జరగకుండా రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. ఫైర్ సిబ్బందితో పాటు డిప్యూటీ జైలర్ శోభన్‌బాబు కూడా లిఫ్ట్‌లో పైకి వెళ్లి అతడికి నచ్చజెప్పి కిందకు తీసుకువచ్చాడు. జైళ్లశాఖ డీఐజీ సైదయ్య, చర్లపల్లి ఫైర్ ఆఫీసర్ శేఖర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా అధికారుల నమ్మకాన్ని వమ్ముచేసేలా వ్యవహరించిన ఖాజాపాషాపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అందుకుగాను కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఖాజాపాషాపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. కాగా తమకు జైలు అధికారుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని కుషాయిగూడ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. -
పారిపోయిన జీవిత ఖైదీ అరెస్ట్
బుక్కరాయసముద్రం: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలోని జిల్లా ఓపన్ ఎయిర్ జైలు నందు ఇటీవల పారిపోయిన ఓ జీవిత ఖైదీని అరెస్ట్ చేసినట్లు జైలు సూపరిండెంట్ ఈశ్వరయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఓపన్ ఎయిర్ జైలు నందు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. అనంతపురం మహాత్మాగాంధీ కాలనీకి చెందిన వడ్డే చంద్రశేఖర్‌రెడ్డికి 2004 మార్చిలో హత్యకేసులో జీవిత ఖైదు శిక్ష పడింది. ఐదేళ్లు పూర్తయిన తర్వాత 2009లో అనంతపురం ఓపన్ ఎయిర్‌జైలుకు తీసుక వచ్చారు. ఇక్కడ జైలు నందు వ్యవసాయ పనులు చేసుకుంటూ శిక్షను అనుభవిస్తూ ఉండేవాడు. అయితే ముద్దాయి చంద్రశేఖర్‌రెడ్డి జనవరి 2013లో అధికారులకు కల్లుకప్పి పారిపోయాడు. అప్పటిలో బీకేఎస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అప్పటి నుంచి జైలు సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నగరంలోని అన్నా నగర్లో ఉన్నట్లు సమాచారం అందడంతో హెడ్ వార్డెన్ క్రిష్ణయ్య, వార్డెన్ రంగనాయక్‌లు గురువారం చాకచక్యంగా పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. -
అనారోగ్యంతో జీవిత ఖైదీ మృతి
బుక్కరాయసముద్రం: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలోని ఓపెన్ ఎయిర్‌జైలు నందు జీవిత ఖైదీ అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. ఓపన్ ఎయిర్ జైలు సూపరిండెంట్ ఈశ్వరయ్య తెలిపిన వివరాలు.. కర్నూలు జిల్లా పెద్ద కంబదూరు మండలం, చిన్న కంబదూరు గ్రామానికి చెందిన బోయ బెంగల గంటి లక్ష్మిరెడ్డి (40) 2002 లో ఓహత్య కేసులో నిందితుడు. 2005లో శిక్ష పడింది. 2013లో కడప సెంట్రల్ జైలు నుండి జిల్లా ఓపెన్ ఎయిర్‌జైలుకు వచ్చాడు. గత కొద్ది రోజులుగా మూర్ఛవ్యాదితో బాధపడుతూ ఉన్నాడు. దీంతో అప్పుడప్పుడు జైలు అధికారులు చికిత్సలు చేయిస్తూ ఉండేవారు. సోమవారం ఉదయం మూర్ఛవ్యాది రావడంతో జైలు అధికారులు చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మరణించినట్లు సూపరిండెంట్ ఈశ్వరయ్య తెలిపారు.