ఆరిలోవ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న మృతుని బంధువులు (ఇన్‌సెట్) వెంకటరమణ మృతదేహం
ఆరిలోవ(విశాఖ తూర్పు): విశాఖ కేంద్ర కారాగారంలో ఓ జీవిత ఖైదీ బుధవారం ఆత్మహత్య చేసుకొన్న సంఘటన ఆందోళనకు దారి తీసింది. ఆత్మహత్య చేసుకొన్నాడని జైల్ అధికారులు, ఆత్మహత్య చేసుకోవడానికి సరైన కారణాలు చెప్పాలని మృతుని బంధువులు, గ్రామస్తులు జైలు ఎదుట సాయంత్రం ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే... ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసుతో పాటు ఆ బాలికను మోసం చేసిన కేసులో ఏక కాలంలో ఆనందపురం మండలం రాయవరం గ్రామానికి చెందిన సియాద్రి వెంకటరమణ(30)కు విశాఖ మెట్రోపాలిటిన్ స్పెషల్ జెడ్జి ఈ నెల 12న రెండు జీవిత ఖైదులు విధించారు. అప్పటి నుంచి విశాఖ కేంద్ర కారాగారంలో ఆయన శిక్ష అనుభవిస్తూ వీవింగ్ విభాగంలో పనిచేస్తున్నాడు.
బుధవారం వెంకటరమణ జైలులో ఉరి వేసుకోవడానికి ప్రయత్నించాడని, ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడని జైలు అధికారులు అతని బంధువులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకొన్న బంధువులు, తల్లి దేవుడమ్మ కేజీహెచ్‌కు చేరుకొన్నారు. అక్కడ వెంకటరమణ మృతి చెందాడని తెలుసుకొని మార్చురీలో ఉన్న మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. మృతిచెందిన విషయాన్ని జైలు అధికారులు దాచిపెట్టి తప్పుడు సమాచారం ఇచ్చారని, వెంకటరమణ మృతికి వేరే కారణం ఉంటుందని, దాన్ని అధికారులు దాచిపెట్టారంటూ సాయంత్రం జైలు ఎదుట సుమారు 200 మంది వరకు రాయవరం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తోటి ఖైదీలు, కాపలాగా ఉన్న జైల్ సిబ్బంది మధ్యలో ఎలా ఉరి వేసుకోవడానికి వీలుపడుతుందని మృతుని బంధువులు ప్రశ్నిస్తున్నారు. జైలు అధికారులు వెంటనే మృతికి కారణాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆరిలోవ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జైలు అధికారులపై ఫిర్యాదు చేశారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉరి వేసుకున్నాడు
వెంకటరమణ బుధవారం మధ్యాహ్నం ఉరి వేసుకొన్నాడు. జైలులో వీవింగ్ విభాగంలో పనిచేస్తున్నాడు. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం ఒంటి గంట సమయంలో తాడుతో ఉరి వేసుకోవడానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న వీవింగ్ ఇన్‌స్ట్రెక్టర్, పనిచేస్తున్న తోటి ఖైదీలు, డ్యూటీలో ఉన్న సిబ్బంది చూసి వెంటనే కిందకు దింపి అధికారులకు తెలియజేశారు. వెంటనే జైలు ఎస్కార్టుతో కేజీహెచ్‌కు తరలించాం. మార్గమధ్యలోనే ఖైదీ మృతి చెం దినట్లు వైద్యులు నిర్థారించారు. మృతుని బంధువులకు సమాచారం అందించాం. –ఎస్.రాహుల్, జైల్ సూపరింటెండెంట్
జైలు అధికారులే ఏదో చేశారు
జైలులో శిక్ష అనుభవిస్తున్న నా కొడుకు వెంకటరమణను జైలు అధికారులే ఏదో చేసేశారు. జైల్‌కు వెళ్లి రెండు వారాలు కాకుండా ఉరి వేసుకొన్నాడని చెప్పారు. అధికారులు అబద్ధం చెబుతున్నారు. వాస్తవాలు వెల్లడించాలి.– సియాద్రి దేవుడమ్మ, మృతుడి తల్లి
Comments
Please login to add a commentAdd a comment