ఫారుఖ్‌ను జైలుకు తీసుకెళ్తున్న పోలీసులు
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 2020, డిసెంబర్ 18న జరిగిన కాల్పుల కేసులో ప్రధాన నిందితుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్‌కు ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో ఏ–2, ఏ–3లను నిర్దోషులుగా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక కోర్టు జడ్జి, జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాస్‌రావు సోమవారం తీర్పునిచ్చారు. ఫారూఖ్‌ను కోర్టుకు తీసుకొచ్చినప్పటికీ కోవిడ్ దృష్ట్యా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీర్పు చెప్పారు.
ఫారుఖ్ మరో గదిలో ఉండి జడ్జి తీర్పు విన్నాడు. విచారణలో నిందితుడి నేరం రుజువైందని జడ్జి ప్రకటించారు. ప్రత్యేక కోర్టు .. ఫారూఖ్‌కు జీవిత ఖైదుతోపాటు రూ.12వేల జరిమానా విధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముస్కు రమణారెడ్డి, జిల్లా ఎస్పీ డి.ఉదయ్‌కుమార్ రెడ్డిలు వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణంలోని తాటిగూడకు చెందిన ఫారూఖ్ అహ్మద్ తన ప్రత్యర్థి వర్గానికి చెందిన మాజీ కౌన్సిలర్ సయ్యద్ జమీర్, సయ్యద్ మన్నాన్, సయ్యద్ మోతిషీన్‌పై తుపాకీతో కాల్పులు జరిపాడు. గాయపడిన సయ్యద్ జమీర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
Comments
Please login to add a commentAdd a comment