
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘అప్పుకావాలా బాబూ! కేవలం 8 శాతం వడ్డీకే మూడురోజుల్లోనే రూ.5 లక్షల రుణం మంజూరు’. చెన్నై నగరంలో అధికశాతం మంది సెల్‌ఫోన్ ద్వారా అందుకుంటున్న ఆఫర్ ఇది. ఇది నిజమేననుకుని ఈ మాయమాటల వలలో పడ్డారో అప్పు సంగతి అలా ఉంచి పప్పులో కాలేసినట్లే. ఆ తరువాత తిప్పలు ఎలానూ తప్పవు.
చెన్నైలో పట్టభదులైన కొందరు యువకులు పీపీఓ అనే కాల్‌సెంటర్‌ను ఏడు చోట్ల నిర్వహిస్తున్నారు. ఈ కాల్‌సెంటర్లలో 70 మందికి పైగా యువతులను నెలకు రూ.8వేల జీతంపై ఉద్యోగంలో చేర్చుకున్నారు. వీరంతా మధ్యతరగతి కుటుంబాల వారిని సెల్‌ఫోన్ ద్వారా సంప్రదించి అప్పుల కోసం ఎదురుచూసే వారి వివరాలను సేకరిస్తారు. అప్పు తీసుకునేందుకు అంగీకరించిన పక్షంలో మోసపూరిత వ్యక్తులు రంగప్రవేశం చేసి సంప్రదింపులు ప్రారంభిస్తారు. మా సంస్థ తరఫున రూ.5 లక్షల వరకు రుణం మంజూరు చేస్తాం, అయితే మీరు ముందుగా రూ.50వేలు చెల్లించాలి, ఈ మొత్తానికి మీ పేరుతోనే బీమా చేసిస్తాం అని నమ్మిస్తారు. ఇలా రూ.50వేలు చెల్లించే స్థోమతలేని వారిపై మరో రకమైన వల విసురుతారు. మీ బ్యాంకు ఖాతాలో కనీసం రూ.15వేలు బ్యాలెన్స్ ఉండేలా చూసుకోండని చెబుతారు. ఆ తరువాత మీ డాక్యుమెంట్లు మాకు అందజేయండి. మూడురోజుల్లో రూ.5 లక్షలు మీ బ్యాంకు ఖాతాలో ఉంటుందని నమ్మిస్తారు.
అప్పుకోసం అనేక కార్యాలయాల చుట్టూ తిరిగి అల్లాడాల్సిన అవసరం లేదు, ఎలాంటి శ్రమ లేకుండా మీ బ్యాంకు ఖాతాలోనే జమ చేస్తాం అంటారు. మూడు రోజుల తరువాత ‘వన్‌టైం పాస్‌వర్డ్’ అనే ఓటీపీ నెంబరు వస్తుంది. ఆ ఓటీపీ నెంబరును మాకు తెలియజేస్తే వెంటనే రూ.5లక్షలు జమ చేయడం పూర్తవుతుందని చెబుతారు. ఇలా మాటలతో నమ్మించి ఓటీపీ నెంబరు పొంది రుణం కోసం ఎదురుచూస్తున్న వారి బ్యాంకు ఖాతాలోని సొమ్మును తమ ఖాతాల్లోకి బదలాయించుకుంటారు. ఖాతాదారులు పెద్ద మొత్తంలో బ్యాంకు బాలెన్సు పెట్టుకుని ఉన్నట్లయితే అనేక ఖాతాల్లోకి బదిలీ అయిపోతుంది. ఇలా సొమ్ము పోగొట్టుకుని బాధితులుగా మిగిలిపోయిన సుమారు 500 మందికి పైగా చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల మేరకు మోసాగ్రేసరులను పట్టుకునేందుకు కేంద్ర నేర పరిశోధన విభాగం, బ్యాంకు మోసాల నిరోధక విభాగం అధికారులతో ప్రత్యేక పోలీస్ బృందం ఏర్పడింది. ఇప్పటికి ఏడు మంది పట్టుబడ్డారు. మోసపూరిత వ్యక్తుల చేతుల్లో చిక్కుకుని బ్రెయిన్‌వాష్‌కు గురైన కొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. భారీ మొత్తంలో మోసపోయిన వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కనీస బ్యాంకు బ్యాలెన్స్‌తో రూ.15వేలు పోగొట్టుకున్న వారు చిన్నమొత్తమే కదా. పరువుపోగొట్టుకోవడం ఎందుకని మిన్నకుండిపోయారు. దీంతో ప్రత్యేక పోలీసు బృందం విచారణలో బాధితులు 5 వేల మందికిపైగా ఉన్నట్లు తేలింది. ఇలా వీరి నుంచి రూ.కోటికి పైగా సొమ్ము కాజేసినట్లు పోలీసులు అంచనావేశారు.
సెల్‌ఫోన్‌లో అన్ని ముగించాలని ఆశించొద్దు: ఇందుకు సంబంధించి కేంద్ర నేరపరిశోధన విభాగం అధికారి ఒకరు మాట్లాడుతూ, రుణం పొందాలనుకునే వారు అన్ని లావాదేవీలను సెల్‌ఫోన్‌లోనే ముగించుకోవాలని భావిస్తే ఇలాంటి మోసాలకు గురికాక తప్పదని హెచ్చరించారు. రుణాలు ఇస్తామని మోసానికి పాల్పడే వారు ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి కార్యాలయాల సెల్‌ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో నిర్ధారించడం కష్టసాధ్యం. అలాగే అనవసరమైన ‘ఆప్’అను డౌన్‌లోడ్ చేసుకోవద్దు. కొన్నిరకాల యాప్‌ల వల్ల మీ కదలికలను, మొబైల్‌లోని వివరాలను పట్టేసే అవకాశం ఉంది. మీ బ్యాంకు ఖాతాల్లోని సొమ్ము మాయమయ్యే ప్రమాదం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉన్నప్పుడే ఇలాంటి మోసాలకు అడ్డుకట్టవేయవచ్చని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment