నకిలీ పత్రాలతో ఐసీఐసీఐ బ్యాంక్‌కు టోకరా! | Loan With Fake Documents in ICICI Bank Hyderabad | Sakshi
Sakshi News home page

‘బోగస్‌’తో బ్యాంక్‌కు టోకరా!

Published Fri, Mar 13 2020 9:27 AM | Last Updated on Fri, Mar 13 2020 9:27 AM

Loan With Fake Documents in ICICI Bank Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నకిలీ పత్రాలు, బోగస్‌ వ్యక్తులతో రంగంలోకి దిగిన ఓ ఘరానా మోసగాడు ఐసీఐసీఐ బ్యాంక్‌కు రూ.30 లక్షల టోకరా వేశాడు. దాదాపు పదేళ్ళ క్రితం చోటు చేసుకున్న ఈ కేసులో నిందితుల అరెస్టు మాట అటుంచి కనీసం వారెవరో గుర్తించడమూ సాధ్యం కాలేదు. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.గోవింద్‌రెడ్డి చాకచక్యంగా వ్యవహరించి ఛేదించారు. మొత్తం నలుగురిని నిందితులుగా గుర్తించి, ముగ్గురిని పట్టుకున్నారు. విదేశంలోని జైల్లో ఉన్న మరో నిందితుడి కోసం లుక్‌ ఔట్‌ సర్క్యులర్‌ (ఎల్‌ఓసీ) జారీ చేయడానికి నిర్ణయించామని గోవింద్‌రెడ్డి గురువారం ‘సాక్షి’కి తెలిపారు. ఆద్యంతం పక్కా పథకం ప్రకారం వ్యవహరించిన నిందితులు ఈ స్కామ్‌కు పాల్పడ్డారని ఆయన వివరించారు. 

ఖరీదు చేస్తామంటూ పత్రాలు పొంది...
సైదాబాద్‌ ప్రాంతానికి చెందిన సలావుద్దీన్‌ వృత్తిరీత్యా రియల్‌ఎస్టేట్‌ దళారి. ఈ స్కామ్‌ మొత్తానికి ఇతడే సూత్రధారిగా ఉన్నాడు. ఇతగాడు 2008 ఆఖరులో తన స్నేహితుడైన హసన్‌ అలీతో కలిసి ఖైరతాబాద్‌లోని ఏఎస్‌ కన్సల్టెన్సీ నిర్వాహకుడు మహ్మద్‌ రియాసత్‌ హసన్‌ను సంప్రదించాడు. ఆయన నిర్మించిన ఓ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌ను ఖరీదు చేస్తామంటూ చెప్పారు. న్యాయ సలహా తీసుకోవడానికంటూ ఆ ఫ్లాట్‌కు సంబంధించిన పత్రాలను సేకరించారు. లోన్‌ వస్తుందో, రాదో చెప్పడానికి ఓ సారి తమ బ్యాంకు వాళ్ళు వచ్చి చూసి వెళ్తారని ఆయనతో చెప్పాడు. ఆ పత్రాల ఆధారంగా వీరిద్దరూ స్కామ్‌కు నాంది పలికారు. ఇక్కడ స్థిరాస్తిని కలిగి, ప్రస్తుతం విదేశాల్లో ఉన్న వాటి యజమానులు ఆస్తులు విక్రయించే అధికారం ఇక్కడున్న వారికి దఖలు చేసేందుకు ఆస్కారం ఉంటుంది. దీనికోసం విదేశంలోని యజమాని స్పెషల్‌ పవరాఫ్‌ అటార్నీ (ఎస్‌పీఏ) రూపొందించి పంపిస్తారు. దీన్నే సలావుద్దీన్‌ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు.

డ్రైవర్‌ ఫొటోతో ఎస్‌పీఏ తయారీ...
యజమాని రియాసత్‌ హసన్‌ విదేశాలకు వెళ్ళినట్లు, ఆయన తన ఫ్లాట్‌ను విక్రయించడానికి ఎస్‌పీఏ ఇచ్చినట్లు సలావుద్దీన్‌ నకిలీ పత్రాలు సృíష్టించాడు. గతంలో తనకు ట్యాక్సీలు తీసుకువచ్చిన డ్రైవర్‌ అబ్దుల్‌ కవి ఫొటో వినియోగించి, నకిలీ పేర్లు, చిరునామాలతో దీన్ని తయారు చేయించాడు. ఇలా సదరు ఫ్లాట్‌ను విక్రయించడానికి నకిలీ యజమానికి సృష్టించేసిన సలావుద్దీన్‌... దాన్ని ఖరీదు చేయడానికీ ఓ బోగస్‌ పార్టీని ‘సిద్ధం చేశాడు’. హైదరాబాద్‌కు చెందిన సర్ఫ్‌రాజ్‌ అహ్మద్‌ దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడని డాక్యుమెంట్లు సిద్ధం చేసిన సలావుద్దీన్‌... సదరు ఫ్లాట్‌ ఖరీదు చేయడానికి ఆయన ఆసక్తి చూపినట్లు కథ అల్లాడు. ఫ్లాట్‌ రిజిస్ట్రేషన్‌ కోసం అతడు భారత్‌కు రావడానికి కుదరట్లేదని, ఈ నేపథ్యంలోనే ఇక్కడే ఉండే తన భార్యకు సదరు స్థిరాస్తి ఖరీదు చేసే అధికారం దఖలు చేస్తూ పత్రాలు పంపినట్లు నకిలీవి తయారు చేశాడు.

కమీషన్‌ ఆశచూపి యువతికి ఎర...
తనకు బ్యూటీపార్లర్‌లో పరిచయమైన, అవివాహిత అయిన ఫర్హా దీబాను సర్ఫ్‌రాజ్‌ భార్యగా నటించేందుకు ఒప్పించాడు. ఇలా సహకరిస్తే తనకు వచ్చే ‘లాభం’లో కమీషన్‌ ఇస్తానంటూ ఎరవేసి ఒప్పించాడు. ఆమె ఫొటో, నకిలీ పేరు వివరాలతో గుర్తింపుకార్డులు తయారు చేయించాడు. ఎస్సార్‌నగర్‌లోని సబ్‌–రిజిస్ట్రార్‌ ఆఫీస్‌కు కవి, ఫర్హా దీబాలను తీసుకువెళ్ళి... ఖైరతాబాద్‌ ఫ్లాట్‌ను కవి ద్వారా ఫర్హా పేరు మీదకు బదిలీ చేయించాడు. ఈ సేల్‌డీడ్‌ను ఆధారంగా చేసుకుంటూ బేగంపేటలోని ఐసీఐసీఐ బ్యాంక్‌ను ఆశ్రయించి ఫర్హా ద్వారా గృహరుణం దరఖాస్తు చేయించాడు. దీనికి ముందే రియాసత్‌కు చెందిన ఏఎస్‌ కన్సల్టెన్సీ పేరుతోనే వేరే వ్యక్తుల్ని యజమానులు చూపించి ఓ నకిలీ సంస్థను ఏర్పాటు చేసిన సలావుద్దీన్‌ ఆ పేరుతో బ్యాంకు ఖాతా కూడా తెరిచాడు.  

వాయిదాలు చెల్లించకపోవడంతో...
సదరు బ్యాంకు అధికారులు వెళ్ళి ఖైరతాబాద్‌లోని ఫ్లాట్‌ను పరిశీలించారు. ఆ విషయం రియాసత్‌కు తెలిసినప్పటికీ గతంలో సలావుద్దీన్‌ చెప్పినట్లు వాళ్ళు వచ్చారని భావించాడు. ఫ్లాట్‌ను, పత్రాలను సరిచూసిన బ్యాంకు 2009లో రూ.30 లక్షల రుణం మంజూరు చేస్తూ ఏఎస్‌ కన్సల్టెన్సీ పేరుతో చెక్కు ఇచ్చింది. దీన్ని తాను తెరిచిన నకిలీ ఖాతాలో వేసిన సలావుద్దీన్‌ డబ్బు డ్రా చేసుకుని స్వాహా చేశాడు. ఈ మొత్తం నుంచి కొంత హసన్‌ అలీ, అబ్దుల్‌ కవి, ఫర్హా దీబాలకు ఇచ్చాడు. రుణ వాయిదాలు చెల్లించకపోవడంతో అధికారులు ఆ ఫ్లాట్‌ స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళారు. దీన్ని రియాసత్‌ అడ్డుకోవడంతో ఆరా తీయగా జరిగిన మోసం వాళ్ళకు తెలిసింది. దీంతో 2010లో ఐసీఐసీఐ బ్యాంకు అధికారులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు అధికారులు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అసలు నిందితులు ఎవరనేది గుర్తించలేకపోయారు. 

పదేళ్ళకు వీడిన చిక్కుముడి...
ఇటీవల ఈ కేసును సమీక్షించిన ఉన్నతాధికారులు మూసేయవచ్చని నిర్ణయించారు. అయితే వైట్‌ కాలర్‌ అఫెన్సెస్‌ టీమ్‌–10 ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.గోవింద్‌రెడ్డి మాత్రం తనకు ఓ చాన్స్‌ ఇవ్వాలంటూ కోరారు. దీనికి సంయుక్త పోలీసు కమిషనర్‌ అవినాష్‌ మహంతి అనుమతించడంతో పునర్‌ దర్యాప్తు చేపట్టారు. నిందితులు వివిధ చోట్ల దాఖలు చేసిన నకిలీ గుర్తింపుపత్రాలను అధ్యయనం చేసిన ఇన్‌స్పెక్టర్‌ చిన్న క్లూ సంపాదించారు. దీని ఆధారంగా ముందుకు వెళ్ళిన ఆయన సలావుద్దీన్‌తో పాటు కవి, ఫర్హాలను పట్టుకున్నారు. ఈ ఫ్రాడ్‌ తర్వాత దుబాయ్‌ వెళ్ళిన హసన్‌ అలీ అక్కడ ఓ నేరం చేయడంతో ఆ దేశ పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారని దర్యాప్తు అధికారి గుర్తించారు. దీంతో ఇతడిపై అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవులకు ఎల్‌ఓసీ జారీ చేయడంతో పాటు ఈ స్కామ్‌పై ఆధారాలు సేకరించి న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement