మృతి చెందిన శివరాజ్, అన్బునాథన్
అన్నానగర్ : వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. మదురై సమీపంలో సోమవారం బైకులో వచ్చిన ఇద్దరిని ప్రత్యర్థులు నరికి చంపారు. హంతకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మదురై జిల్లా మేలూర్ సమీపం తిరువాదవూర్ నుంచి ఉత్తరవీధికి వెళ్లే నాయక్కర్ పట్టి రోడ్డులో పెద్ద కాలువ ఉంది. దాని సమీపంలో సోమవారం ఓ యువకుడు, యువతి నడి రోడ్డులో హత్య గురికావడం స్థానికంగా కలకలం రేపింది. దీనిపై స్థానికులు మేలూర్ పోలీసులకి సమాచారం అందించారు. పోలీసు సూపరింటెండెంట్ వనితా, జాయింట్ సూపరింటెండెంట్ సుభాష్, తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టు మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు జరిపిన విచారణలో హత్యకు గురైన వారు తెర్కుతెరు గ్రామానికి చెందిన అయ్యనన్ కుమారుడు అన్బునాథన్ (27), విమల్ భార్య ఆయమ్మాల్ (26) అని తెలిసింది. అన్బునాథన్‌కి వివాహం కాలేదు. ఆయమ్మాల్‌కి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. దీనికారణంగా వారిని నరికి చంపినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
యువకుడి హత్య
నాగై జిల్లా మయిలాడుదురై మణక్కుడికి చెందిన రాజేంద్రన్ కుమారుడు ముత్తళగన్ (23). ఇతని సహోదరుడు కట్టబొమ్మన్‌కి, మయిలాడుదురై బాలాజీ నగర్‌కి చెందిన సురేష్ (28)కి పాత కక్షలున్నాయి. గత 16వ తేదీ మయిలాడుదురై బాలాజీ నగర్‌లో కట్టబొమ్మన్‌కి, సురేష్‌కి తగాదా ఏర్పడింది. కట్టబొమ్మన్ బైకుని సురేష్, అతని స్నేహితులు శశికుమార్, ముత్తుపాండి, మణికంఠన్, కీర్తిధరన్ తీసుకొని వెళ్లారు. ఆ బైకుని తిరిగి అడగడానికి సోమవారం ముత్తళగన్, కట్టబొమ్మన్, స్నేహితుడు శివరాజ్ (19)ని పిలుచుకుని మయిలాడుదురై బాలాజీ నగర్‌కి వెళ్లాడు. ఇరుతరపువారికి తగాదా ఏర్పడింది. ఆవేశం చెందిన సురేష్, ఇతని స్నేహితులు కలిసి ముత్తళగన్, శివరాజ్‌పై కత్తులతో దాడి చేశారు. కట్టబొమ్మన్ అక్కడ నుంచి పరారయ్యాడు. తీవ్రగాయాలపాలైన శివరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ముత్తళగన్ పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై మయిలాడుదరై పోలీసులు కేసు నమోదు చేసి సురేష్, శశికుమార్ (21), ముత్తు పాండి (19), మణికంఠన్ (22), కీర్తిధరన్ (21)ని అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment