
ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ప్రాంతంలో పోలీసుల దర్యాప్తు
భువనేశ్వర్ : తమ ప్రేమను సమాజం అంగీకరిస్తుందా లేదా అన్న అనుమానంతో ఓ ప్రేమజంట ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన నవరంగపూర్ జిల్లాలోని రాయిఘర్ సమితి చొడియపార గ్రామంలో మంగళవారం సంభవించింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రాంబాయి గోండ్, అమల సింగ్‌లు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వారిద్దరి కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉండడంతో ఒకరింటికి మరొకరు వస్తూ పోతూ ఉంటారు. అలా వారిద్దరి మధ్య చిగురించిన ప్రేమ గాఢమైంది. సోమవారం రాత్రి అమల సింగ్, రాంబాయి ఇంటికి వెళ్లి భోజనం చేసి తిరిగి తన ఇంటికి వెళ్లాడు. రాత్రి రాంబాయి ఇంటిలో నిద్రపోవడం కుటుంబ సభ్యులు చూసి నిదురించిందని భావించారు.
అయితే మంగళవారం ఉదయం నుంచి రాంబాయి ఇంటిలో కనిపించలేదు. ఎటువెళ్లిందా అని కుటుంబసభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. అయినా ఎక్కడా కనిపించక పోవడంతో అమల సింగ్ ఇంటికి వెళ్లి చూశారు. అక్కడ కూడా రాంబాయి గానీ అమల సింగ్ కానీ లేక పోడంటంతో రెండు కుటుంబాల వారు వారిద్దరి కోసం గాలించగా గ్రామ సమీప అడవిలో ఇద్దరూ ఒక చెట్టుకు వేలాడుతూ శవాలై కనిపించారు. వారిద్దరూ అతి దగ్గరగా ఒకరినొకరు కౌగిలించుకుని చున్నీతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.
సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్
తమ ప్రేమను సమాజం అంగీకరిస్తుందా లేదా అన్న అనుమానంతో భయాందోళన చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటారని గ్రామస్తులు అభిప్రాయ పడుతున్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులు గోండ్ భాషలో ఒక సూసైడ్ లేఖ రాసి పెట్టారు. ఆ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మేమిద్దరం ప్రేమించుకున్నాం. మా ప్రేమను మా కుటుంబాలు ఆమోదిస్తాయో లేదా అన్న భయాందోళనతో తాము ఒకటిగా ఆత్మహత్య చేసుకున్నామని లేఖలో రాసి ఉంది. అయితే ఆలేఖ వారు రాసిందా? లేదా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వారి ఆత్మహత్యలతో గ్రామంలో విషాదంలో మునిగిపోయింది. ఈ కేసును రాయిఘర్ సబ్‌ఇన్‌స్పెక్టర్ రామ చంద్ర అగస్థి, గొగోశ్వర మఝిలు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment