తాళిబొట్టు పట్టుకుని పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ.. | Love Failure Women Commits Suicide in Guntur | Sakshi
Sakshi News home page

ప్రేమికుడు మోసం చేశాడని ఆత్మహత్య

Published Wed, May 1 2019 12:23 PM | Last Updated on Wed, May 1 2019 12:23 PM

Love Failure Women Commits Suicide in Guntur - Sakshi

ఆత్మహత్య చేసుకున్న యువతి(ఫైల్‌), యువతి రాసిన లేఖతో పాటు తాళిబొట్టు

మంగళగిరి: మూడేళ్లుగా ఆ యువకుడిని ప్రేమించింది. పెళ్లి చేసుకుంటాడనుకుని నమ్మి మోసపోయింది. కొంతకాలంగా వివాహం చేసుకోవాలంటూ ఒత్తిడి తేవడంతో పాటు పోలీసుల వద్దకు వెళ్లి తనకు ప్రేమించిన వాడితో వివాహం చేయించాలని కోరింది. కొద్ది రోజులుగా తనకు ఈ రోజు వివాహం అంటూ తాళిబొట్టు పట్టుకుని పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిరుగుతోంది. యువకుడిపై కేసు వద్దని తనతో వివాహం చేసుకునేలా ఒప్పిస్తే చాలని పోలీసులను కోరింది. ఎన్నిసార్లు బతిమాలినా యువకుడి మనస్సు కరగకపోవడంతో మనస్తాపానికి గురైన యువతి చివరకు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కేవలం కుల జాడ్యం కారణంగానే తన లాంటి యువతులు మోసపోతున్నారని ఆవేదనతో రాసిన ఏడు పేజీల లేఖ సమాజంలో కుల అసమానతలపై మరోసారి ప్రశ్న లేవనెత్తింది. ‘‘అమ్మా... నేను ఇలా మోసపోతానని అనుకోలేదు.. ఏనాడూ మీకు చెడ్డ పేరు తేవాలని అనుకోలేదు.,.  అయినా మోసపోయాను ఇక నేను బతకలేను.. నన్ను క్షమించండి..నా చివరి కోరిక మేరకు ప్రతి ఏడాది నా తరఫున కల్వరి సిరి మందిరంలో ప్రార్థనలు జరిగేలా చూడండి.’’ అంటూ రాసిన యువతి చివరి లేఖ మరోసారి కులాల అసమానతలపై ఆలోచన రేకెత్తించింది.

సేకరించిన వివరాల మేరకు మండలంలోని నవులూరు ఉడా కాలనీలో నివసిస్తున్న గుడిసె లోయదాసు అన్నపూర్ణమ్మలకు ఇద్దరు సంతానం. నాగరాణి పెద్ద అమ్మాయి కాగా రమేష్‌ అనే కుమారుడు ఉన్నారు. లోయదాసు గతంలోనే మృతి చెందగా కృష్ణాజిల్లా నుంచి 12 సంవత్సరాల క్రితం బతుకు తెరువు కోసం ఇక్కడకు వచ్చి కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నారు. నాగరాణి మండలంలోని యర్రబాలెంలో కల బ్రిక్స్‌ ఇండస్ట్రీలో కూలి పనికి వెళ్తోంది. బాపనయ్యనగర్‌లో నివాసముంటున్న బల్లా నాగార్జున అదే బ్రిక్స్‌ ఇండస్ట్రీలో పనిచేస్తుండగా ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో నాగార్జున తల్లితండ్రులు వివాహానికి ససేమిరా అనడంతో నాగార్జున కొంతకాలంగా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో నాగరాణి పది రోజుల కిందట రూరల్‌ పోలీసులను ఆశ్రయించింది. నాగార్జునను పిలిపించి తమకు వివాహం జరిపించాలని కోరడంతో నాగార్జునను పిలిపించిన పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది.

నాగరాణి ఏరోజుకా రోజు పోలీసులు తనకు నాగార్జునతో పెళ్లి జరిపిస్తారని ప్రతిరోజు తాళిబొట్టుతో సహా  స్టేషన్‌కు వెళుతోంది. తన ఆశలు నెరవేరకపోవడంతో చివరకు ఈనెల 26న తన నివాసంలో తన మనస్సులోని ఆవేదనంతా ఏడు పేజీల లేఖలో రాసి పురుగుమందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే మంగళగిరిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నాగరాణి తల్లి అన్నపూర్ణమ్మ ఫిర్యాదు మేరకు నాగరాజును అదుపులోకి తీసుకోగా గుంటూరు ఆసుపత్రిలో ఉన్న నాగరాణి నాగార్జునను కలవాలని మరోసారి పోలీసులను కోరింది. దీంతో పోలీసులు నాగార్జునను  ఆసుపత్రికి తీసుకువెళ్లి అరగంట పాటు మాట్లాడించారు. చివరగా నాగార్జునతో మాట్లాడిన నాగరాణి అనంతరం పరిస్థితి విషమించడంతో ఈనెల 29 వతేదీ తెల్లవారుజామున కన్నుమూసింది. మృతదేహానికి పంచనామా నిర్వహించిన అనంతరం మంగళవారం మృతదేహాన్ని నవులూరు ఉడా కాలనీలోని నివాసానికి తరలించారు. తన కుమార్తె మోస పోయిందని తల్లి చేస్తున్న ఆర్తనాదాలు చుట్టుపక్కల వారిని కంట తడి పెట్టించాయి. దళిత సంఘాల నేతలు కారుమంచి రామారావు, ఎం.రవి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. తహసీల్దార్‌ రాంప్రసాద్, రూరల్‌ సీఐ శరత్‌బాబు, ఎస్‌ఐ నాగుల్‌మీరా వివరాలు సేకరించారు.

రూరల్‌ సీఐ శరత్‌బాబు మాట్లాడుతూ యువతి తల్లి ఫిర్యాదు మేరకు నాగార్జునను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. బాధిత కుటుంబానికి ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం ప్రభుత్వం నుంచి అందవలసిన పరిహారం అందజేయడంతో పాటు నాగరాణి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement