ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై: సహజీవనం సాగిస్తున్న వారి మధ్య మనస్పర్థలు హత్యకు దారి తీశాయి. మదురైలో వెలుగు చూసిన ఈ ఘటనలో మహిళ, యువతితో సహా ఐదుగురు యువకుల్ని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.మదురై అలంగానల్లూరు సమీపంలోని నటరాజన్ నగర్‌కు చెందిన ఇళంగోవన్ ఫైనాన్సియర్. అలాగే,పలు వ్యాపారాలు సైతం ఆయనకు ఉన్నాయి. శనివారం ఇంటి ముందు ఆయన అతి దారుణంగా హత్య చేయబడ్డారు. వ్యాపారంలో ఉన్న గొడవలతో ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావించారు. అయితే, హత్య జరిగిన ప్రదేశంలో ఉన్న ఓ సీసి కెమెరా అస్సలు గుట్టును రట్టు చేసింది. ఐదు మంది యువకులు అతి కిరాతకంగా కత్తులతో ఇళంగోవన్‌ను నరికి చంపుతున్న సమయంలో అక్కడే ఉన్న మహిళ చోద్యం చూడటమే కాదు, చిరు నవ్వు చిందిస్తూ ఉండటం పోలీసులకు కీలక ఆధారంగా మారింది. ఆ ఇంటి గేటు వద్ద జరిగిన ఈ హత్య సమయంలో ఆయువకులు మరీ కిరాతకంగా వ్యవహరిస్తుండటం, వారిని ఎదుర్కొనే విధంగా నటరాజన్ పోరాడుతుండటం వంటి దృశ్యాలు ఉన్నా, అదే గేటు వద్ద నటరాజన్‌తో కలిసి కూర్చుని ఉన్న ఆ మహిళ ఎందుకు ఆ యువకుల్ని వారించలేదు, చిరునవ్వులు చిందించింది ..? అన్న అంశాన్ని అస్త్రంగా చేసుకుని విచారణను వేగవంతం చేశారు.
సహజీవనం...మనస్పర్థలు....
ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు గుట్టు వెలుగులోకి వచ్చింది. ఇళంగోవన్ భార్య ఐదేళ్ల క్రితం మరణించింది. ఒంటరిగా ఉన్న ఇళంగోవన్‌కు అభిరామి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ ఇద్దరు నటరాజన్ నగర్‌లో ఇంటిని కొనుగోలు చేసుకుని సహజీవనం సాగిస్తూ వస్తున్నారు. అభిరామికి ఇది వరకే వివాహం కావడం, ఆమెకు అనుహ్య అనే కుమార్తెతో పాటుగా మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త మరణించాడో, లేదా వదిలేశాడో ఏమోగానీ, అభిరామి మాత్రం ఐదేళ్లుగా ఇళంగోవన్‌తోనే కలిసి ఉంటూ వస్తున్నది. ఈ నేపథ్యంలో హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటూ వస్తున్న అభిరామి పెద్దకుమార్తె అనుహ్య తరచూ ఇంటికి వచ్చి వెళ్లుండటంతో ఆమె మీద ఇళంగోవన్ దృష్టి పెట్టాడు. అభిరామి ఇంట్లో లేని సమయంలో అనుహ్యతో ఇళంగోవన్ అసభ్యకరంగా ప్రవర్థించినట్టు సమాచారం. ఈ విషయాన్ని అభిరామి దృష్టికి అనుహ్య తీసుకెళ్లింది. అయితే, తనకు ఏమి తెలియనట్టుగా వ్యవహరిస్తూ వచ్చిన అభిరామి, ఇళంగోవన్ ఆస్తి, ఫైనాన్స్ సంస్థలోని నగదు మీద దృష్టి పెట్టింది. ఆయనతో సన్నిహితంగానే ఉన్నట్టుగా ఉండి, వెన్నుపోటు పడిచే రీతిలో పథకం వేసింది. అనుహ్య స్నేహితుడు బాల మురుగన్, అతడి స్నేహితుడి ద్వారా ఇళంగోవన్‌ను మట్టుబెట్టేందుకు పథకం వేసింది. సంఘటన జరిగిన రోజున ఇళంగోవన్‌తో కలిసి ఇంటి వద్ద ఉన్న ఉయ్యాలలో అనందంగా ఉన్నట్టు నటించిన అభిరామి, చివరకు హత్య జరుగుతున్న సమయంలో చిరునవ్వు చిందించి పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా బుక్ అయింది. గట్టు రట్టు కావడంతో అభిరామి, అనుహ్యలతో పాటుగా బాల మురుగన్, అతడి స్నేహితులు ఐదుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment