
ఆత్మహత్యకు పాల్పడ్డ శ్రీనివాసన్, ఇన్‌సెట్‌లో సత్యజ్యోతి (ఫైల్)
దొడ్డబళ్లాపురం: వివాహానికి పెద్దలు నిరాకరించారని ప్రేమికులు పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన బెంగళూరు ఉత్తర తాలూకా నగరూరు సమీపంలోని రిసార్ట్‌లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. తమిళనాడు ధర్మపురి హిందూర్ గ్రామం నివాసి శ్రీనివాసన్ (35), కృష్ణగిరికి చెందిన సత్యజ్యోతి (27) ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీనివాసన్ ధర్మపురిలోని ఒక జాతీయ బ్యాంకులో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం అదే బ్యాంకులో క్యాషియర్‌గా చేరిన సత్యజ్యోతితో పరిచయం ఏర్పడి ప్రేమ చిగురించింది. అయితే శ్రీనివాసన్‌కు అప్పటికే వివాహం జరిగి పిల్లలు కూడా ఉన్నారు. దీంతో ఇరువైపుల పెద్దలు వీరి వివాహానికి నిరాకరించారు. బుధవారం బెంగళూరు వచ్చిన వీరు అదేరోజు రాత్రి రిసార్ట్‌లో రూం తీసుకున్నారు.
గురువారం చెక్‌ఔట్ చేస్తామని చెప్పిన ఇద్దరూ చీకటిపడ్డా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన రిసార్ట్ సిబ్బంది నకిలీ కీతో తలుపులుతీసి చూడగా ఇద్దరూ అప్పటికే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంగతి వెలుగుచూసింది. దీంతో రిసార్ట్ వారు పోలీసులకు సమాచారమిచ్చారు. మాదనాయకనహళ్లి పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి పరిశీలించగా మృతులు రాసుకున్న డెత్‌నోట్ దొరికింది. తమ ప్రేమను పెద్దలు నిరాకరించినందుకే ఆత్మహత్య చేసుకుంటున్నామని డెత్‌నోట్‌లో ఉంది. మృతదేహాలను విక్టోరియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment