సాక్షి, హైదరాబాద్: రిషబ్ చిట్‌ఫండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ముసుగులో చిట్టీలు, ఫిక్సిడ్ డిపాజిట్ల పేరుతో వందల మందిని మోసం చేసిన కేసులో ప్రధాన నిందితులు శైలేశ్‌కుమార్ గుజ్జర్, అతడి భార్య నందినిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ కుంభకోణం విలువ రూ.70 కోట్లు ఉంటుందని అధికారికంగా తేలినా.. బాధితులు మొత్తం బయటకు వస్తే రూ.200 కోట్లు దాటుతుందని తెలుస్తోంది. నిందితులను శుక్రవారం కోర్టులో హాజరు పరుస్తామని, తదుపరి విచారణకు కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరతామని అదనపు డీసీపీ జోగయ్య వెల్లడించారు. రూ.లక్ష నుంచి రూ.50 లక్షల వరకు విలువైన చిట్టీలు నిర్వహించడంతోపాటు మెచ్యురిటీ పూర్తయిన, పాడుకున్న వారికి నెలకు రూ.2 వడ్డీ ఆశచూపి ఆ మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా తమ వద్దే ఉంచుకున్నారు. కొన్నాళ్లు వడ్డీ చెల్లించిన శైలేశ్ హఠాత్తుగా కుటుంబంతో సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పరారీలో ఉన్న వారిద్దరినీ పట్టుకునేందుకు సీసీఎస్ డీసీపీ అవినాశ్ మహంతి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. చివరకు గురువారం సమీప బంధువు ఇంట్లో తలదాచుకున్న ఇద్దరినీ అరెస్టు చేశారు. వీరిని రిషబ్ సంస్థ కార్యాలయంతోపాటు ఇంటికి తీసుకెళ్లి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
వ్యాపారాల్లో పెట్టుబడులు..
చిట్టీలు, డిపాజిట్ల రూపంలో కాజేసిన డబ్బును హైదారాబాద్‌తోపాటు రాష్ట్రాల్లో వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టానంటూ శైలేశ్ వివరించాడు. ఆ వ్యాపారాల్లో నష్టాలే మిగిలాయని చెప్పాడు. నిందితుడు చెప్పిన వివరాల్లో నిజానిజాలు తేల్చాలని పోలీసులు నిర్ణయించారు. కాగా, నిందితులపై బాధితులు దాడికి యత్నించారు. డబ్బులు ఇప్పించాలని సీసీఎస్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.
‘రిషబ్’ స్కామ్ నిందితుల అరెస్టు
Published Fri, Dec 21 2018 1:22 AM | Last Updated on Thu, Apr 4 2019 5:22 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment