
సాక్షి, సిటీబ్యూరో: అందినకాడికి అప్పులు చేసి ఏడాది కాలంగా తప్పించుకు తిరుగుతూ పూర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఓ ఘరానా మోసగాడిని మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇతడిపై నగరంలోని రెండు కమిషనరేట్లలో 20 కేసులు ఉండగా... ఐదు కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడని, మరో ఏడు నాన్–బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయని డీసీపీ పి.రాధాకిషన్‌రావు సోమవారం వెల్లడించారు. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలకు చెందిన జి.మధుసూదన్‌రావు వృత్తిరీత్యా వ్యాపారి. బతుకుతెరువు నిమిత్తం 1984లో హైదరాబాద్‌కు వలస వచ్చాడు. 1994లో అబిడ్స్ ప్రాంతంలో షార్ప్ సెక్యూరిటీ సర్వీసెస్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. ఎనిమిదేళ్లు నడిచిన ఇది ఆపై మూతపడింది. ఆపై పారామౌంట్ సర్వైలెన్సెస్ పేరుతో మరో సంస్థను తెరిచాడు. వివిధ సంస్థలకు మానవ వనరులను అందించే వ్యాపారం నిర్వహించాడు. ఈ నేపథ్యంలోనే అనేక మందికి చెక్కులు, ప్రామిసరీ నోట్లు ఇచ్చి భారీగా అప్పులు తీసుకున్నాడు.
రూ.5 కోట్ల వరకు చేరిన మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమయ్యాడు. అప్పులు ఇచ్చిన వారు ఇతడి చెక్కులను బ్యాంకుల్లో వేసుకోగా అవి బౌన్స్ అయ్యాయి. దీంతో ఇతడిపై హైదరాబాద్, రాచకొండల్లోని వివిధ ఠాణాల్లో బాధితులు ఫిర్యాదు చేశారు. వీటి ఆధారంగా ఇప్పటి వరకు మొత్తం 20 కేసులు నమోదయ్యాయి. కొన్ని కేసుల్లో అరెస్టు అయిన మధుసూదన్‌రావు బెయిల్‌పై వచ్చి కోర్టు వాయిదాలకు హాజరుకావట్లేదు. ఈ నేపథ్యంలో ఇతడిపై ఏడు నాన్–బెయిలబుల్ వారెంట్లు, ఐదు బెయిలబుల్ వారెంట్లు జారీ కావడంతో పాటు మరో ఐదు కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడు. దాదాపు ఏడాది కాలంగా పూర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మధుసూదన్‌రావు ఎవరికీ దొరకట్లేదు. సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఏర్పాటైన బృందం ఇతడి కోసం ముమ్మరంగా గాలించింది. ఎట్టకేలకు సోమవారం పట్టుకుని కాచిగూడ పోలీసులకు అప్పగించింది.
Comments
Please login to add a commentAdd a comment