
సాక్షి, విజయవాడ: ఏటీఎం కేంద్రాల వద్ద అమాయక ప్రజలనే లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర మోసగాడిని సోమవారం గన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 5 లక్షల 46వేలు నగదుతో పాటు హోండా యాక్టివాను స్వాధీనం చేసుకొన్నారు. గన్నవరం పోలీస్ స్టేషన్‌లో డీసీపీ హర్షవర్ధన్ రాజు, నిందితుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు. ఏటీఎం కేంద్రాల వద్ద నేరాలకు పాల్పడుతున్న నిందితుణ్ని తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన చింతల సురేష్ బాబుగా గుర్తించామని తెలిపారు.
నిందితుడు చెడు వ్యసనాలకు బానిసై..ఏటీఎం కేంద్రాల వద్ద సహాయం చేస్తానని చెప్పి మోసాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. జిల్లాలో 16 నేరాలతో పాటు గన్నవరంలో ఆరు ఏటీఎం కేంద్రాల వద్ద మోసాలకు పాల్పడినట్లుగా గుర్తించామని అన్నారు. గన్నవరంలోనే ఏటీఎం సెంటర్‌లో మరో మోసానికి సురేష్ బాబు సిద్ధంగా ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశామని చెప్పారు. ఏటీఎం కేంద్రాల వద్ద డబ్బులు డ్రా చేసుకునే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. అపరిచిత వ్యక్తులకు ఏటీఎం వివరాలు వెల్లడించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment