పిల్లలతో కిడ్నాపర్
సాక్షి, గూడూరు(వరంగల్) : చిన్న పిల్లలను అపహరించబోతున్న కిడ్నాపర్‌ను గ్రామస్తులు గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మండలంలోని గుండెంగలో సోమవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కేసముద్రం మండల కేంద్రంలోని కట్టుకాల్వకు చెందిన తూరాల రాజు, లక్ష్మి దంపతులు ప్రతీ సంవత్సరం సంచార జీవనం గడుపుతూ పెరిగే చెట్లకు మందులు సరఫరా చేస్తుంటారు. ప్రతీ సంవత్సరం వాళ్లు గుండెంగ వస్తుంటారు. వారికి ఇద్దరు పిల్లలు జీవన్(4), రమేష్(3). కాగా, భార్య లక్ష్మి చనిపోగా ఇద్దరు చిన్నారులతో 4 రోజుల క్రితం గుండెంగకు చేరుకున్న రాజును భార్య ఎక్కడికి పోయిందంటూ గ్రామానికి చెందిన హోటల్ యజమానులు దేవా, వాసు అడిగారు.
తన భార్య లక్ష్మి చనిపోయిందని పిల్లలు నాతో పాటు ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో ఆ ఇద్దరు హోటల్ యజమానులకు మగపిల్లలు లేకపోవడంతో ఆ ఇద్దరిని పెంచుకుంటామని చెప్పి నాలుగు రోజులుగా వారి వద్ద ఉంచుకుంటున్నారు. కాగా, చెన్నారావుపేట మండలం బోజెర్వుకు చెందిన అంగడి సమ్మయ్య, సరోజన దంపతులు హైదరాబాద్‌లో కూలీ చేసుకుంటూ ఉంటారు. వారిద్దరు సాయంత్రం 4 గంటలకు గతంలో పరిచయస్తుడైన తూరాల రాజు వద్దకు చేరుకుని ఇద్దరు చిన్న పిల్లలను తాము హైదరాబాద్‌కు తీసుకెళ్తామని చెప్పి రూ.1 లక్ష ఇచ్చే విధంగా మాట్లాడుకున్నారు. ముందుగా ఇస్తేనే పిల్లలను ఇస్తానని రాజు చెప్పగా, వారు తర్వాత ఇస్తామన్నారు.
అయినా రాజు వినకపోవడంతో అంగడి సమ్మయ్య.. రాజుకు మద్యం తాగించాడు. అనంతరం సమ్మ య్య భార్య సరోజన వారికి కొద్దిదూరంలో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులను పట్టుకొని ఓ కిరాణ షాపు పక్కన ఉన్న ఆటో వద్దకు బలవంతంగా తీసుకెళ్తోంది. దీంతో పిల్లలు భయపడి ఏడ్వడం మొదలుపెట్టారు. గమనించిన సమీపంలోని హోటల్ యజమాని భార్య వచ్చి చిన్నారులను ఎటు తీసుకెళ్తున్నావని అడగ్గా ఆమెను నెట్టివేసింది. వెంటనే పిల్లలను ఎత్తుకెల్లే వ్యక్తిగా గుర్తించిన ఆ మహిళ అరిచింది. దీంతో సరోజన పిల్లలను వదిలేసి పారిపోయింది. ఆ తరువాత అక్కడకు చేరుకున్న సమ్మయ్య ఆమె తన భార్యగా చెప్పడంతో అసలు విషయం తెలిసిపోయింది.
ఆ తరువాత రాజు వారిద్దరు పిల్లలను ఇస్తే రూ.1 లక్ష ఇస్తామన్నారని, డబ్బులు ముందు ఇస్తే ఇస్తానన్నానని, తాను మద్యం మత్తులో ఉండగా పిల్లలను పట్టుకెళ్తున్నారన్నారు. వెంటనే వారు ఆ వృద్ధుడిని పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు సంఘటనా వివరాలు తెలుసుకొని వృద్ధుడు, ఇద్దరు పిల్లలతో పాటు వారి తండ్రి రాజును స్టేషన్‌కు తరలించారు. ఈ విషయమై ఎస్సై ఎస్కే.యాసిన్ వివరణ అడగ్గా, ఫిర్యాదు ఏమీ రాలేదని, పిల్లల తండ్రి, కిడ్నాపర్ మద్యం మత్తులో ఉన్నారని, ఐసీడీఎస్ వారిని రప్పించి పిల్లలను వారికి అప్పగిస్తామని, అతనిపై కేసు నమోదు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment