బెడ్‌రూంలో విగత జీవులుగా పడిఉన్న పిల్లలు, ఇన్‌సెట్‌లో ఫ్యామిలీ సెల్ఫీ
హైదరాబాద్: భార్య తనను నిలదీస్తోందన్న ఆగ్రహం.. కన్నపిల్లలని కూడా చూడని ఉన్మాదం.. విచక్షణ మరిచిపోయిన క్షణికావేశం ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. వ్యాపారం సరిగా సాగడం లేదని మానసికంగా కుంగిపోయిన హరీందర్ అనే వ్యక్తి.. దీనిపై భార్య నిలదీయడంతో ఉన్మాదిగా మారిపోయాడు. గాఢ నిద్రలో ఉన్న భార్యను, ఇద్దరు పిల్లలను గొంతుపిసికి చంపేశాడు. భార్య వేధింపులు భరించలేక ఆమెను హత్య చేశానని, తాను జైలుకు వెళితే పిల్లలేమవుతారోనని వారిని కూడా చంపేశానని చెప్పి పోలీసులకు లొంగిపోయాడు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని జిల్లెలగూడలో ఈ దారుణం జరిగింది.
తీవ్రంగా ఆవేశానికి లోనై..
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కుల్కచర్లకు చెందిన మాలె హరీందర్ (38), మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం బాలాజీనగర్‌కు చెందిన జ్యోతి (32)లకు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. హైదరాబాద్‌లోని జిల్లెలగూడలోని సుమిత్ర ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు అభితేజ్ (6), సహస్ర (4). డెంటల్‌లో డిప్లొమా చేసిన హరీందర్ మలక్‌పేటలోని తిరుమల టవర్స్‌లో ఎస్‌డీఆర్ ల్యాబ్ పేరిట కృత్రిమ దంతాలు తయారుచేసే వ్యాపారం చేస్తున్నాడు. కానీ కొంతకాలంగా వ్యాపారం సరిగా నడవక.. ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. చివరికి ఇంటి అవసరాల కోసం కూడా బంధువులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఈ వ్యాపారం వదిలేసి, మరో పని చేయాలంటూ హరీందర్‌పై భార్య జ్యోతి కొద్దిరోజులుగా ఒత్తిడి చేస్తోంది. దీంతో కుటుంబంలో గొడవలు జరుగుతుండడంతో మానసికంగా కుంగిపోయాడు. ఆదివారం రాత్రి కూడా ఈ విషయమై దంపతుల మధ్య గొడవ జరిగింది. తీవ్రంగా ఆవేశానికి లోనైన హరీందర్.. భార్యను చంపేసేందుకు సిద్ధమయ్యాడు. తాను జైలుకు వెళితే పిల్లల పరిస్థితి ఏమవుతుందోనని వారిని కూడా చంపేయాలని నిర్ణయించుకున్నాడు.
నిద్రలోనే గొంతు పిసికి..
సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో హరీందర్ జ్యోతిని గొంతు నులిమి హత్య చేశాడు. తర్వాత పిల్లలు అభితేజ్, సహస్రలను కూడా గొంతు పిసికి చంపేశాడు. ఆరు గంటల సమయం వరకు ఇంట్లోనే ఉన్నాడు. ఆ తర్వాత బయటికి వచ్చి.. భార్య వేధింపులు భరించలేక ఆమెను, పిల్లలను చంపేశానని పొరుగింటి వారితో చెప్పాడు. అనంతరం మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. దీంతో ఎల్‌బీనగర్ డీసీపీ వెంకటేశ్వరరావు, వనస్థలిపురం ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీఐ మన్మోహన్ తదితరులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. హరీందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా.. తాత్కాలికంగా ఎదురైన ఇబ్బందులను ఎదుర్కోవడం చేతగాక తన కుమార్తెను, మనవళ్లను హరీందర్ హతమార్చాడంటూ జ్యోతి తండ్రి సత్తయ్య కన్నీటి పర్యంతమయ్యారు. తన కుమార్తె ఆదివారం సాయంత్రం ఫోన్ చేసి మాట్లాడిందని, వచ్చే వారం పుట్టింటికి వస్తానని చెప్పిందని.. ఇంతలోనే ఇలా జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హరీందర్‌ను కఠినంగా శిక్షించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment