చిట్టీల నిర్వాహకుడి భార్య, బాధితులతో మాట్లాడుతున్న సీఐ నారాయణరెడ్డి, పోలీసులు
అనంతపురం, తాడిపత్రి అర్బన్: పలువురి నుంచి చిట్టీలు కట్టించుకున్న సొమ్ముతో నిర్వాహకుడు ఉడాయించిన ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. ఇంటిలోని సామాన్లను తీసుకెళ్లేందుకు వచ్చిన నిర్వాహకుడి భార్యను బాధితులు గుర్తించి పోలీసులకు అప్పగించారు. బాధితులు తెలిపిన మేరకు.. తాడిపత్రి పట్టణంలోని సీపీఐ కాలనీకి చెందిన రాజగోపాల్‌రెడ్డి దాదాపు పద్దెనిమిదేళ్ల నుంచి లగాన్ వ్యాపారం చేస్తున్నాడు. చిరువ్యాపారులు, ఆటో, కారు డ్రైవర్ల వద్ద చిట్టీల పేరుతో దాదాపు రూ.2 కోట్ల వరకు సేకరించాడ. చిట్టీల కంతులు పూర్తయిన వారికి డబ్బు ఇవ్వకుండా తిప్పుకున్నాడు. నాలుగు నెలల కిందట కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యాడు.
బాధితులు వాకబు చేయగా నెలన్నర కిందట తిరుపతిలో ఉన్నట్లు గుర్తించి తాడిపత్రికి తీసుకొచ్చారు. ఒకరోజంతా బంధించి తమ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే రాజగోపాల్‌రెడ్డి వారి కళ్లుగప్పి ఎలాగోలా తప్పించుకుని పారిపోయాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి తాడిపత్రిలో ఉన్న తన ఇంటికి రాజగోపాల్ భార్య శ్రీదేవి వచ్చి సామాన్లు తరలిస్తున్న విషయం తెలుసుకున్న బాధితులు అక్కడకు చేరుకుని ఆమెను పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. బాధితులు ఫిర్యాదు ఇస్తే తాము విచారణ చేపడతామని సీఐ నారాయణరెడ్డి బాధితులకు సూచించారు. శ్రీదేవిని కూడా ఇల్లు విడిచి వెళ్ళవద్దని, భర్త వస్తే వెంటనే తమకు తెలియజేయాలని పోలీసులు సూచించారు. ఆదివారం కూడా బాధితులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తమ గోడు వెల్లబోసుకున్నారు. అయితే చిట్టీల నిర్వాహకుడిపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment