
మృతిచెందిన ప్రసాద్
సాక్షి, తగరపువలస(విశాఖపట్టణం) : జీవీఎంసీ భీమిలి జోన్ 10వ వార్డు గ్రంథాలయం వీధికి చెందిన మాదాబత్తుల ప్రసాద్(23) 5వ వార్డు కొత్తపేటలోని తన స్నేహితుడు ఇస్పరి జగదీష్ ఇంట్లో శుక్రవారం ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం 10 గంటల సమయంలో స్నేహితుని ఇంటికి మాట్లాడడానికి వచ్చిన ప్రసాద్ కొంతసేపు అక్కడే గడిపాడు. తరువాత జగదీష్ అతడిని కూర్చోబెట్టి స్నానానికి వెళ్లిపోయాడు. తరువాత ప్రసాద్.. జగదీష్ స్నానం చేస్తున్న గదికి బయట నుంచి గడియపెట్టి వరండాలో లుంగీ తీసుకుని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. స్నానానికి వెళ్లిన జగదీష్ బయట గడియ పెట్టి ఉండటంతో తలుపులు బాదగా పక్కింటి వారు వచ్చి చూసేసరికి ప్రసాద్ ఉరి వేసుకుని కనిపించాడు.
సీమెన్‌గా ఎంపికైన ప్రసాద్
మార్కెట్‌లో అరటి పండ్ల వ్యాపారం చేసుకునే మాదాబత్తుల వెంకటరావు, రమణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. నెల రోజులు క్రితం పెద్ద కుమారుడు గణేష్‌కు వివాహమైంది. రెండో కుమారుడైన ప్రసాద్ సీమెన్‌గా ఎంపికై ఈ నెల 18న ముంబయిలో విధుల్లో చేరనున్నాడు. దీనికోసం తల్లిదండ్రులు రూ.6 లక్షల వరకు ఖర్చు చేసినట్టు తెలిసింది. ప్రసాద్ భీమిలికి చెందిన ఓ యువతిని ప్రేమించాడని, ఆమె ఇంట్లో కోసం వస్తువులు కొని కూడా ఇచ్చాడని, తీరా ఆమె అతని ప్రేమను తిరస్కరించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు అతని స్నేహితులు చెబుతున్నారు. భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment