
కరెంటు షాక్‌కు కారణమైన ప్రభుత్వ స్కీం బోరు
మరో ఐదు నిమిషాల వ్యవధిలో కరెంటు సరఫరా వేళలు మారుతాయి.. త్రీఫేజ్ నుంచి 2 ఫేజ్‌కు మారబోయే సమయమది..ఫేజ్ మారితే స్కీం బోరుకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది..కరెంట్ ఫేజ్ మారకనే నీళ్లు పట్టుకోవాలనే ఆత్రుత అతడిని మృత్యు ఒడిలోకి చేర్చింది. కరెంటు షాక్‌కు బలై అతడు విగతజీవి అయిన మరుక్షణమే కరెంటు సరఫరా ఆగిపోయింది! ఫేజ్–2లోకి కరెంటు మారింది. ఆ ఒక్క ఐదు నిమిషాలు గడచిపోయి ఉంటే అతడీ లోకంలోనే ఉండేవాడేమో!!
కలకడ : కరెంటు షాక్‌కు గురై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం మండలంలోని కదిరాయచెర్వు పంచాయతీ వడ్డిపల్లెలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం.. వడ్డిపల్లెకు చెందిన బత్తల రెడ్డెప్ప (35) సోమవారం ఉదయం 10గంటల సమయంలో గ్రామానికి చెందిన స్కీంబోరు నీటిని నింపుకునే ప్రయత్నం చేశారు. స్కీంబోరుకు ఉన్న కేబుల్ వైర్లు దెబ్బతిని మోటార్‌కు విద్యుత్ సరఫరా అయింది. అదే ఇది తెలియని రెడ్డెప్ప పైపును పట్టుకున్న మరుక్షణమే కరెంటు షాక్‌తో మృతిచెందారు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఏఎస్‌ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మరణించడంతో రెడ్డెప్ప కుటుంబం వీధినపడింది.
ఐదు నిమిషాల్లో మృత్యు ఒడిలోకి..!
కదిరాయచెర్వు గ్రామానికి ఉదయం 10.30 గంటలకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా నిలిపి వేస్తారు.అయితే మృతుడు రెడ్డెప్ప నీళ్లు ఆగిపోతాయనే తొందరలో 10.25 గంటలకు పరుగున వెళ్లి నీటికోసం మోటార్ పైపును పట్టుకోవడంతో షాక్ కొట్టింది. దీనిమూలాన అతడు చనిపోయాడు. మరుక్షణమే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అవే మృతునికి చివరి క్షణాలయ్యాయి.