పినపాక : సారపాక నుంచి వరంగల్‌కు వెళ్తున్న లారీ, పినపాక మండలం ఐలాపుంర గ్రామం వద్ద బుధవారం బోల్తాపడింది. దానిని బయటకు తీసే ప్రయత్నంలో విద్యుదాఘాతంతో డ్రైవర్ కమలేష్(40) మృతి చెందాడు. ఈ లారీ, హర్యానాకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఐలాపురం వద్ద మూల మలుపును గుర్తించని లారీ డ్రైవర్ నేరుగా లోయలోకి పోనివ్వడంతో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కమలేష్ ప్రాణాలతో బయటపడ్డాడు.
ప్రమాద విషయం తెలుసుకున్న ఓనర్, గురువారం సాయంత్రానికి ప్రమాద స్థలానికి చేరుకున్నాడు. స్థానికుల సహాయంతో భద్రాద్రి పవర్ ప్లాంట్‌లో పనులు చేస్తున్న భారీ క్రేన్లను ఐలాపురం వద్దకు తీసుకొచ్చారు. వాటి సహాయంతో లోయలో బోల్తాపడిన లారీని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. గురువారం రాత్రి క్రేన్‌కు కట్టిన రోప్(వైర్)ను లారీ డ్రైవర్ సరి చేస్తున్నాడు.
ఈ క్రమంలో, ఏడూళ్లబయ్యారం 33-11 కేవీ విద్యుత్ సబ్‌స్ఠేషన్ నుంచి ఐలాపురంలోగల గురుకుల పాఠశాలకు వెళ్తున్న 11 కేవీ విద్యుత్ లైన్ సరఫరా వెళ్తుంది. లారీ బోల్తాపడిన ప్రదేశంలోనే ఈ విద్యుత్ లైన్ ఉంది. ఇది గమనించని లారీ డ్రైవర్, క్రేన్ డ్రైవర్ రోప్‌తో బోల్తాపడిన లారీని బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు.
అనుకోకుండా 11 కేవీ విద్యుత్ లైన్‌కు విద్యుత్ సరఫరా కావడంతో క్రేన్‌కు కట్టిన రోప్(వైర్) విద్యుత్ వైర్లకు తగిలింది. దీంతో విద్యుత్ సరఫరా జరిగి, రోప్‌ను పట్టుకున్న లారీ డ్రైవర్ కమలేష్‌కు షాక్ తగిలింది. మణుగూరు ఆసుపత్రికి తరలించే లోపే మృతిచెందాడు. ఇతనిది మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఏడూళ్లబయ్యారం పోలీసులు కేసు దర్యాపు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment