ప్రమాద ఘటనపై ఆరా తీస్తున్న పోలీస్ సిబ్బంది
పెద్దాపురం: దేవీ నవరాత్రుల వేళ దుర్గమ్మ చెంతకు కాలినడకన వస్తానని మొక్కుకున్న భక్తుడు అమ్మ దర్శనానికి వెళుతుండగా మార్గం మధ్యలో మృత్యువు కాటేసింది. కాలినడకన విజయవాడ దుర్గ గుడికి బయల్దేరిన భవానీ భక్తులను బుధవారం వేకువజామున పెద్దాపురం ఏడీబీ రోడ్డులో ఐషర్ వ్యాన్ బలంగా ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వారితో పాటు కలినడకన వస్తున్న మరో ఇరువురు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.పెద్దాపురం పోలీసుల కథనం ప్రకారం.. యు.కొత్తపల్లి మండలం మూలపేట నుంచి నలుగురు భవానీలు కాలినడకన విజయవాడ కనకదుర్గ గుడికి బయల్దేరారు. ప్రయాణంలో భాగంగా స్థానిక ఏడీబీ రోడ్డులో వేకువ జామునే ప్రయాణం మొదలుపెట్టిన భవానీలను వెనుక నుంచి టాటా ఏసీ వాహనం బలంగా డీ కొట్టింది. ఈ ప్రమాదంలో మురాలశెట్టి సారాజు (30) అక్కడికక్కడే మృతి చెందగా గరగ సత్తిబాబు తీవ్ర గాయాలపాలయ్యాడు. మరో నల్లా శ్రీనివాస్, గరగ నాగ సూరిబాబు పక్కకు తప్పుకోవడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది.స్థానికుల సమాచారం మేరకు పెద్దాపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎస్సై వి.సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సారాజు మృతితో రోదిస్తున్న బంధువులు
కొత్తపల్లి (పిఠాపురం): కొత్తమూలపేట రామరాఘవపురానికి చెందిన మురాలశెట్టి సారాజు (28) రోడ్డు ప్రమాదంలో బుధవారం మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో మరో భక్తుడు కొత్తమూలపేటకు చెందిన గరగ సత్తిబాబుకు తీవ్రగాయాలు కావడంతో బంధువులు రోదిస్తున్నారు. సారాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సారాజు సోదరుడు శ్రీనివాస్ తొమ్మిదేళ్ల క్రితం శీలంవారి పాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment