
చెన్నై: తమిళనాడులోని సెంజి సమీపంలో పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్తూ యువకుడు మృత్యువాత పడ్డాడు. విల్లుపురం జిల్లా సెంజి సమీపంలో ఉన్న సిరువాలై గ్రామానికి చెందిన ప్రదీప్ రాజ్ (27). ఇతనికి ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. 16వ తేదీన వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివాహ ఆహ్వాన పత్రికలు పంచడానికి శుక్రవారం తన స్నేహితులైన మామలైవాసన్ (25), రమేష్ (25)తో బైక్‌లో ఆలమ్‌పూండికి వెళ్లాడు. తర్వాత అక్కడ నుండి కనక్కన్‌కుప్పంలో ఉన్న బంధువులకు వివాహ ఆహ్వాన పత్రిక ఇవ్వటానికి వెళ్లారు. దేవదానమ్ పేటలో వస్తుండగా అదుపుతప్పిన బైకు 75 అడుగుల లోతు గల బావిలో పడింది.
ఈ ప్రమాదంలో ప్రదీప్ రాజ్, మామలైవాసన్ ఇద్దరు నీటిలో మునిగి మృతి చెందారు. రమేష్ మాత్రం బావి పక్కన ఉన్న పొదల్లో దూకడంతో చిన్న గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాలను బయటకి తీశారు. అనంతరం పోస్టుమార్టం కోసం ముండియమ్‌బాక్కమ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment