రోదిస్తున్న కుటుంబీకులు యూసుఫ్ మృతదేహం
జన్నారం(ఖానాపూర్): ఉదయం కుటుంబీకులతో ముచ్చటించాడు. కన్న కొడుకును ఆడించి, నవ్వించాడు. ఇంతలోనే విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి బలయ్యాడు. అప్పటి వరకు తమతో ఉన్న వ్యక్తి గంట తర్వాతనే అందరిని వదిలి వెళ్లడంతో ఆ కుటుంబం దిక్కులేనిదైంది. వేలాడే విద్యుత్ తీగలకు తగిలి వ్యవసాయ కూలీ బలైన సంఘటన సోమవారం మండలంలోని కలమడుగులో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, ఎస్సై తహసీనొద్దీన్ తెలిపిన వివరాలివీ.. ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామానికి చెందిన మహ్మద్ అబ్దుల్ యూసుఫ్(27) వ్యవసాయ కూలీ. ఆయనకు భార్య ఫర్వీనా, మూడేళ్ల కొడుకు ఉన్నారు. తల్లి, అక్క కూడ ఆయనతోనే ఉంటున్నారు. యూసుఫ్ ఉదయం టీ తాగిన అనంతరం ఇంట్లో కొడుకుతో ఆడుకుంటున్నాడు.
ఈ క్రమంలో కలమడుగు గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్ వరి నారు ఎండిపోతుందని, ట్యాంకర్‌తో నీరు పోసివద్దామని పనికి పిలవడంతో వెళ్లాడు. ట్యాంకర్ పొలంలోకి తీసుకెళ్లి, దిగుతుండగా వేలాడుతున్న విద్యుత్ వైర్లు తలకు తగిలి షాక్‌తో మరణించాడు. అక్కడే కొంతదూరంలో ఉన్న రైతు గమనించి కేకలు వేస్తూ వెళ్లి చూసే సరికి అప్పటికే మరణించాడు. విషయాన్ని కుటుంబీకులకు తెలిపారు. ఇప్పటి వరకు మాతో ఉన్న నీవు కానరాని లోకాలకు వెళ్లావా? కుటుంబీకులు గుండెలవిసేలా రోదించారు. విషయం తెలుసుకున్న ఎస్సై తహసీనొద్దీన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదు
కలమడుగులోని చెక్‌పోస్టు సమీపంలో వ్యవసాయ భూములపై నుంచి వెళ్లే 11 కేవీ విద్యుత్ తీగలు చేతికి అందే ఎత్తులో వేలాడుతున్నాయి. ఎత్తున్న వ్యక్తి చేతి పైకి ఎత్తితే తీగలు తగులుతాయి. ఈ విషయాన్ని గ్రామస్తులు పలుమార్లు విద్యుత్ అధికారులకు తెలిపారు. అయినా పట్టించుకోలేదు. గతంలో కూడా ఒక్క రైతు తీగలకు తగిలి మరణించినట్లు గ్రామస్తులు తెలిపారు. విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంతోనే యూసుఫ్ మరణించాడని ఆరోపిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకుని మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment