లక్నో: ఉత్తరప్రదేశ్ బరేలీలో దారుణం వెలుగు చూసింది. అప్పుడే పుట్టిన చిన్నారిని బతికుండగానే కుండలో పెట్టి మరి పూడ్చిపెట్టిన సంఘటన ప్రతి ఒక్కరిని కలిచి వేస్తుంది. వివరాలు.. హితేష్ కుమార్ సిరోహీ అనే వ్యాపారి భార్య వైశాలికి ఏడో నెల. అయితే రెండు రోజుల క్రితం ఆమెకు తీవ్రంగా నొప్పులు రావడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైశాలి నెలలు నిండకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. కానీ దురదృష్టవశాత్తు పుట్టిన కొద్దిసేపటికే ఆ బిడ్డ మరణించింది. పసికందు మృతదేహాన్ని పూడ్చి పెట్టడానికి సిరోహీ శ్మశానికి వెళ్లాడు.
మృతదేహాన్ని పూడ్చడం కోసం శ్మశానంలో గుంత తవ్వుతుండగా.. మూడు అడుగుల లోతున అతడికి ఓ మట్టికుండ అడ్డు తగిలింది. దాన్ని బయటకు తీసి, తెరచి చూసిన సిరోహీకి ఒక్క సారిగా షాక్ తగిలినట్టయ్యింది. ఎందుకంటే ఆ కుండలో అప్పుడే పుట్టిన ఓ చిన్నారి సజీవింగా ఉంది. ఊపిరితీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. దాంతో సిరోహీ వెంటనే చిన్నారిని సమీప ఆస్పత్రికి తరలించాడు. పోలీసులకు కూడా సమాచారం అందించాడు. బతికుండగానే చిన్నారిని కుండలో పెట్టి పూడ్చిపెట్టిన ఘటన బరేలీలో కలకలం రేపింది. మరోవైపు చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో.. అన్ని సదుపాయాలున్న మరో ఆస్పత్రికి తరలించారు వైద్యులు.
ఈ సంఘటనపై స్థానిక ఎమ్మెల్యే రాజేష్ మిశ్రా స్పందించడమే కాక ఆ చిన్నారి వైద్యానికి అయ్యే ఖర్చును భరించడానికి ముందుకు వచ్చాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment