సాక్షి, సిటీబ్యూరో: ఇన్‌స్ట్రాగామ్ యాప్ నుంచి యువతుల ఫొటోలు డౌన్‌లోడ్ చేయడం... వీటిని వినియోగించి డేటింగ్ యాప్ టిండర్‌లో ప్రొఫైల్స్ క్రియేట్ చేయడం... దీని ఆధారంగా చాటింగ్ చేస్తూ సెక్స్ చాట్, న్యూడ్ ఫొటోలంటూ వసూలు చేయడం... ఏడాది కాలంగా ఈ పంథాలో అనేక మందిని మోసం చేసిన సీఏ ఫైనల్ ఇయర్ విద్యార్థి వెన్నెల వెంకటేష్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఇతను ఇప్పటి వరకు అనేక మందితో యువతుల మాదిరిగా చాటింగ్ చేసి రూ.20 లక్షలు వరకు వసూలు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన వెన్నెల వెంకటేష్ కొన్నాళ్ళు విజయవాడలో విద్యనభ్యసించాడు. ప్రస్తుతం సీఏ ఫైనల్ ఇయర్‌కు రావడంతో హైదరాబాద్‌కు మకాం మార్చాడు. యూసుఫ్‌గూడ పరిధిలోని శ్రీరామ్‌నగర్ కాలనీలో ఉంటున్న తన బావ వద్ద నివసిస్తున్నాడు. చార్టెడ్ అకౌంటెంట్‌గా మారే లోపే తేలిగ్గా డబ్బు సంపాదించుకోవాలని భావించిన అతగాడు యువతుల పేరిట ఎరవేసే ప్లాన్ వేశాడు. ఇన్‌స్ట్రాగామ్ నుంచి అందమైన యువతుల ఫొటోలను డౌన్‌లోడ్ చేసుకునేవాడు. వీటిని వినియోగించి వేర్వేరు పేర్లతో డేటింగ్ యాప్ టిండర్‌లో ప్రొఫైల్స్ క్రియేట్ చేసేవాడు.
తనతో ఎవరైనా చాటింగ్ చేయాలంటూ పింగ్ చేయండి అంటూ తన వాట్సాప్ నెంబర్ ఇచ్చేవాడు. అలా చాటింగ్‌లోకి వచ్చిన వారితో అతడే యువతిగా చాటింగ్ చేసేవాడు. సెక్స్ చాటింగ్ చేయాలంటే రూ.100, న్యూడ్ ఫొటోలు పంపాలంటే రూ.300, న్యూడ్ వీడియో కాలింగ్ చేయాలంటూ రూ.500 తన బ్యాంకు ఖాతాలో పంపాలని కోరేవాడు. అంగీకరించిన వారికి విజయవాడలోని బ్యాంకు ఖాతా వివరాలు అందించేవాడు. ఎవరైనా డబ్బు డిపాజిట్ చేయడానికి ముందు ‘మగా, ఆడా?’ అంటూ సందేశం పెడితే వెంటనే ‘బై’ అంటూ వారిని కట్ చేస్తున్న భావన కలిగించే వాడు. దీంతో పూర్తిగా ఇతడి వల్లోపడిపోయి ఆ మొత్తం ట్రాన్స్‌ఫర్ చేసే వాళ్ళు. డబ్బు బయటకు చెప్పుకుంటే పరువు పోతుందనే ఉద్దేశంతో ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేసే వారు కాదు. దీంతో దాదాపు ఏడాది కాలంలో ఇతగాడు అనేక మందిని మోసం చేసి నుంచి రూ.20 లక్షల వరకు తన ఖాతాలో వేయించుకోగలిగాడు.
వెంకటేష్ రెండు నెలల క్రితం నగరానికి చెందిన ఓ యువతి ఫొటో వినియోగించి టిండర్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. ఆ యువతికి ఇటీవలే నగరానికి చెందిన మరో యువకుడితో నిశ్చితార్థం అయింది. అయితే ఈమె ఫొటోతో ఓ ప్రొఫైల్ టిండర్‌లో ఉన్నట్లు కాబోయే భర్త తరఫు వారికి తెలియడంతో ఎంగేజ్‌మెంట్ రద్దయింది. దీంతో ఆమె సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్ ఎన్.మోహన్‌రావు దర్యాప్తు చేశారు. సాంకేతికంగా దర్యాప్తు చేసిన ఆయన వెంకటేష్ నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. ఈ విషయంపై సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ మోహన్‌రావు మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో యువతులు తమ ఫొటోలు అప్ లోడ్ చేయకపోవడమే ఉత్తమమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment