
నిందితుడిని చూపుతున్న డీఎస్పీ రాజేశ్వర్ రావు
పటాన్‌చెరు టౌన్ : లారీ మూతోడా అని వెక్కిరించినందుకు వ్యక్తిని హత్య చేసిన ఘటన పటాన్‌చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గురువారం పటాన్‌చెరు పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాజేశ్వర్ రావు, సీఐ నరేశ్, క్రైం సీఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్‌చెరు మండల పరిధిలోని రుద్రారం గ్రామానికి చెందిన మాచిరెడ్డి గోపాల్‌రెడ్డి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 19న ఇంట్లో నుంచి దుర్గమాత శోభయాత్ర చూసి వస్తా అని చెప్పి వెళ్లిన గోపాల్‌రెడ్డిని గుర్తుతెలియని వ్యక్తులు రుద్రారం గ్రామ శివారులో తోషిభా కంపెనీకి వెళ్లే దారిలో హత్యచేసిన విషయం తెలిసిందే. దీంతో కేసును నమోదు చేసిన పోలీసులు మాచిరెడ్డి గోపాల్‌రెడ్డిని హత్యచేసిన వ్యక్తి రేజింతల నాగరాజుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
అతడిని విచారించగా మృతుడు గోపాల్‌రెడ్డి తరుచూ నాగరాజును లారీ మూతోడా అని వెక్కిరించేవాడని, దీంతో పాటు వీరు ఇద్దరు 10 సంవత్సరాల క్రితం వీ.బీ.సీ కంపెనీలో పని చేసే సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని తెలిపాడు. ఇవి మనసులో పెట్టుకున్న నాగరాజు గోపాల్‌రెడ్డిని పథకం ప్రకారం కూల్‌డ్రింక్ తాగిపిస్తాని చెప్పి ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి గొడవపడ్డాడు. అనంతరం చేతితో బలంగా గాయపరిచి, పక్కనే ఉన్న రాయిని గోపాల్‌రెడ్డి తలపై వేయడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. అనంతరం నాగరాజు గోపాల్‌రెడ్డి సెల్ ఫోన్ తీసుకొని పరారయ్యాడని పోలీసులు తెలిపారు. 2012లో నాగరాజు మరో వ్యక్తితో కలిసి ఓ హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు గురువారం రేజింతల నాగరాజును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment