
మృతి చెందిన శివ, ఆర్ముగం (ఫైల్)
చెన్నై ,అన్నానగర్: విరుదాచలం సమీపంలో బుధవారం ఇంటి పత్రాల తగాదాలో వదినను కడతేర్చి మరిది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. కడలూర్ జిల్లా విరుదాచలం సమీపం మంగలమ్‌పేటకి చెందిన చిన్నస్వామి కుమారుడు కుళందైవేల్ (32). ఇతని భార్య శివ (30). వీరికి కుమారులు హరిహరన్ (11), ఆకాష్ (9) ఉన్నారు. కులందైవేల్ తమ్ముడు ఆర్ముగం (28) కార్మికుడు, తల్లి సరోజాతో నివసిస్తున్నాడు. ఆర్ముగం ఇల్లు ముందు భాగం, కులందైవేల్ ఇల్లు వెనుక భాగం ఉంది. దీంతో ఆరముగమ్‌కి, శివకి మధ్య ఇంటి పత్రాల విషయంలో తరచూ వివాదం నడుస్తోంది.
బుధవారం కుళందైవేల్, శివ కూలీ పనికి వెళ్లారు. మధ్యాహ్నం శివ భోజనం చెయ్యటానికి ఇంటికి వచ్చింది. అప్పుడు ఆమెకి, ఆర్ముగంకి తగాదా ఏర్పడింది. ఇందులో ఆవేశం చెందిన ఆర్ముగం, వదినపై ఇనుపరాడ్‌తో దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావమవడంతో ఆమె సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. దీంతో భయపడిన ఆర్ముగం భయంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న విరుదాచలం పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి, ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉలుందూర్‌పేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment