మణుగూరుటౌన్ : ఆస్తి తగాదాల వివాదంలో ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిపై సొంత తోడల్లుడే రోకలిబండతో మోది హత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మణుగూరు ఆర్టీసీ బస్ డిపో వెనక సంక్షేమ హాస్టల్ పక్కన ఉన్న ఎస్సీ కాలనీలో నివాసముండే కార్ డ్రైవర్ అయినపర్తి శ్రీనాథ్‌ను (35) అతడి తోడల్లుడు కోట్ర శ్రీను రోకలిబండతో తలపై మోది హత్య చేశాడు. శ్రీనాథ్ ముత్యాల రమాదేవితో 12ఏళ్లుగా సహజీవనం కొనసాగిస్తున్నాడు. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. రమాదేవి చెల్లి శ్రీలత భర్త శ్రీను దినసరి కూలీ. వీరిద్దరు కొంతకాలం క్రింతం అశోక్‌నగర్‌లో తాము నివాసముండే ప్రాంతంలో రెండు పోర్షన్ల ఇంటిని పొత్తులో కొనుగోలు చేశారు. ప్రస్తుతం దాంట్లోనే ఉంటున్నారు. ఈక్రమంలో శ్రీను తన పోర్షన్ ఇచ్చేస్తే అమ్ముకుంటాననడంతో ఇద్దరి మధ్య కొన్నిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యలో వీరు మంగళవారం మరోమారు ఘర్షణ పడ్డారు. దీనిని మనసులో పెట్టుకుని అర్ధరాత్రి శ్రీనాథ్ ఇంటికి శ్రీను వెళ్లాడు. శ్రీనాథ్ భార్య, పిల్లలు లోపల నిద్రిస్తుండగా..అతను ఒక్కడే వరండాలో పడుకుని ఉండగా..రోకలిబండతో తలపై బలంగా కొట్టాడు. దీంతో శ్రీనాథ్ అక్కడికక్కడే మృతిచెందాడు. తర్వాత అతను అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. స్వయా నా బంధువే ఇలా కర్కషంగా ప్రాణం తీయడంతో అంతా ఉలిక్కిపడ్డారు. సంఘటనా స్థలాన్ని సీఐ రమేష్‌బాబు సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. స్థానికంగా నివాసముండే శ్రీనాథ్ అక్క శశి ధరణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment