సాక్షి, హైదరాబాద్ : ఆర్ధిక లావాదేవీల నేపథ్యంలో ఓ కంపెనీ యజమానిని మరో కంపెనీకి చెందిన వ్యక్తులు దారుణంగా హత్యచేసి పూడ్చివేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూకట్‌పల్లి సీఐ ప్రసన్నకుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన నేరెళ్ల చంద్రశేఖర్(40) ప్రశాంత్‌నగర్‌లో గాజు గ్లాస్‌ల కంపెనీ నిర్వహిస్తున్నాడు. గ్లాస్ తయారీ పరిశ్రమ ముసుగులో అతడు డ్రగ్స్‌సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2017 జనవరిలో డ్రగ్స్ కేసులో చంద్రశేఖర్ జైలుకు వెళ్లివచ్చాడు. కాగా డ్రగ్స్ కేసులో మధ్యప్రదేశ్‌కు చెందిన కెమికల్ కంపెనీ నిర్వాహకుడు భూషణ్‌పాండే, సంతోష్‌సింగ్, మత్స్యగిరిలతో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ఈ క్రమంలోనే గత నెల 16న చంద్రశేఖర్ వద్ద నుంచి డబ్బులు రాబట్టేందుకుగాను వారు తమ అనుచరులతో కలిసి పథకం పన్నారు. చంద్రశేఖర్‌ను స్థానిక కార్పొరేషన్ బ్యాంక్ వద్దకు రప్పించి అక్కడి నుంచి కారులో కొంపల్లికి తీసుకువెళ్లారు. తమకు రూ. రెండు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తన వద్ద డబ్బులేదని చంద్రశేఖర్ చెప్పడంతో ఆగ్రహానికి గురైన మత్సగిరి, భూషణ్‌ఫాండే, సంతోష్‌సింగ్ తమ అనుచరులు మరో 9 మందితో కలిసి అతడిని చితకబాదడంతో మృతి చెందాడు. అనంతరం వారు మృతదేహాన్ని కొర్రేముల గ్రామ సమీపంలోని ఔటర్‌రింగ్ వద్ద పూడ్చిపెట్టారు. తన భర్త కనిపించడంలేదని చంద్రశేఖర్ భార్య శోభ సెప్టెంబర్ 18న కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టగా హత్య విషయం వెలుగుచూసింది. దీంతో మత్సగిరిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment