వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ కృష్ణారావు (ఇన్‌సెట్) నిందితుడు హరికుమార్
రాయచోటి టౌన్ : అవ్వా.. చీటీ డబ్బులు కట్టాలి.. అప్పుగా ఇస్తే తిరిగి చెల్లిస్తానంటూ ఓ వృద్ధురాలి ఇంటికి వెళ్లిన యువకుడు.. అక్కడే బస చేసి అర్ధరాత్రి సమయంలో ఆమెను హతమార్చి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలతో ఉడాయించాడు. ఈనెల 1న చిన్నమండెం మండలంలో జరిగిన వృద్ధురాలి హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. రాయచోటి రూరల్ పోలీసు స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పులివెందుల ఏఎస్పీ కృష్ణారావు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. చిన్నమండెం మండలం పడమటి కోన గ్రామం తొగటపల్లెకు చెందిన బోజనపు లక్ష్మిదేవి ( 90) అనే వృద్ధురాలు ఈ నెల 1వ తేదీ అర్ధరాత్రి హత్యకు గురైంది.
మృతురాలి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకెళ్లినట్లు అప్పట్లో ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతురాలి రెండోకుమారుడు వీర వసంతరాయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయచోటి రూరల్ సీఐ నరసింహారాజు, వీరబల్లె, చిన్నమండెం ఎస్‌ఐలు లక్ష్మిప్రసాద్, సుధాకర్ విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో హత్య జరిగిన రోజు రాత్రి మృతురాలి ఇంటిలో బస చేసిన సమీప బంధువు వేల్పుల హరికుమార్ అనే యువకుడిపై అనుమానంతో ఆ దశగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ యువకుడు గతంలో చాకిబండలో స్కూటర్, పాఠశాలలో కంప్యూటర్ చోరీ చేసిన కేసులో నిందితుడిగా ఉండటంతో అనుమానం మరింత బలపడింది. దీంతో అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సోమవారం తిరుపతిలో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. తిరుపతి బసవతారకం వీధిలో ఉన్న నిందితుడు హరికుమార్ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా చాకచక్యంగా పట్టుకున్నారు. అతన్ని విచారించగా అసలు విషయాలు బహిర్గతమయ్యాయి.
ఎలా జరిగిందంటే..
జనవరి ఒకటో తేది మధ్యాహ్నం తిరుపతి నుంచి ఏపీ03 ఏకె8630 నబంర్ గల బైకుపై బయలు దేరి తొగటపల్లెకు రాత్రి 7గంటలకు చేరుకున్నాడు. రాత్రి 9 గంటల సమయంలో లక్ష్మిదేవి ఇంటి వెనుకవైపు తలుపు వద్దకు వెళ్లి ఆమెను పిలిచాడు. అతన్ని చూసిన వృద్ధురాలు ఇంత రాత్రి వేళలో ఎందుకు వచ్చావు అని అడుగగా తాను చీటి డబ్బులు కట్టాలని, తన వద్ద డబ్బులు లేవని.. అప్పుగా ఇస్తే తిరిగి చెల్లిస్తానని చెప్పాడు. అయితే తన వద్ద ఇప్పుడు డబ్బులు లేవని ఆమె పేర్కొంది. నీ మెడలోని బంగారు ఆభరణాలు ఇస్తే ఎక్కడైనా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకొని తరువాత విడిపించి ఇస్తానని చెప్పాడు. ఆమె అందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత ఇప్పుడు పొద్దుపోయింది.. తెల్లవారి తమ ఊరికి వెళతాను అంతవరకు ఇక్కడే పడుకొంటానని దుప్పటి ఇప్పించుకొన్నాడు. అర్ధరాత్రి సమయంలో లేచి కూర్చోవడంతో గమనించిన వృద్ధురాలు ఎందుకు అప్పుడే లేచావు అని ప్రశ్నించగా తనకు నిద్ర రాలేదని, బయటకు వెళ్లి మూత్ర విసర్జన చేసి వస్తానని చెప్పి వెళ్లి అక్కడున్న విద్యుత్ వైరును తీసుకొచ్చాడు. దాంతో వృద్ధురాలి మెడకు బిగించి హత్య చేశాడు. ఇదే అదునుగా భావించిన నిందితు డు ఆమె మెడలోని గొలుసు, చెవిలోని కమ్మలు, మాటీలు వంటి ఆభరణాలు దోచుకెళ్లాడు. వీటి విలువ సుమారు రూ. లక్ష పదివేలు ఉంటుంది. నిందితుడి వద్ద నుంచి బంగారు ఆభరణాలు, హత్యకు ఉపయోగించిన విద్యుత్ వైరు స్వాధీ నం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment