పుల్లయ్య (ఫైల్), మృతిచెందిన చిన్నారి
బోసి నవ్వులు కురిపిస్తున్న ఆ పసిబిడ్డను చంపడానికి ఆ తండ్రికి చేతులెలా వచ్చాయో.. తన పోలికలతో లేడంటూ అత్యంత కిరాతకంగా ఆ చిన్నారి ప్రాణాలు తోడేశాడు. నేలకేసి కొట్టి.. ఆపై గొంతుమీద కాలేసి తొక్కి పసివాడి ఉసురుతీశాడు. అనుమానం పెనుభూతమై.. అతడిని రాక్షసుడిని చేసింది..
రాచర్ల: రాచర్లకు చెందిన గుమ్ముళ్ల చిన్న పుల్లయ్య.. 2009లో అర్థవీడు మండలం, మొహిద్దీన్‌పురానికి చెందిన లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు, ఒక కుమార్తె సంతానం. 2011లో పుట్టింటికి వెళ్లి రెండో సంతానానికి జన్మనిచ్చిన లక్ష్మీదేవి బాలింతగా ఉండగానే ఆమెపై అనుమానం పెంచుకుని.. కిరాతకంగా హత్యచేశాడు. ఈ కేసులో అప్పట్లో ఏడేళ్ల జైలు శిక్ష పడింది. జైలు నుంచి విడుదలయ్యాక 2017లో వెఎస్సార్ జిల్లా రామాపురానికి చెందిన రమాదేవిని రెండో వివాహం చేసుకున్నాడు. బేల్దారి పనులు, కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి ఎనిమిది నెలల కుమారుడు రేవంత్ ఉన్నాడు. బిడ్డ పుట్టినప్పట్నుంచి.. తన పోలికలతో లేడని నిత్యం భార్యను వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు.
శుక్రవారం రాత్రి ఇదే విషయంపై మళ్లీ వేధించాడు. శనివారం ఉదయం కూడా భార్యతో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా మంచంపై ఉన్న రేవంత్‌ను తీసుకుని నేలకేసి కొట్టాడు. అది చాలదన్నట్టు గొంతుపై కాలేసి తొక్కి హతమార్చాడు. కన్న బిడ్డను కళ్ల ముందే చంపేస్తుండటం చూసి హతాశురాలైన రమాదేవి కేకలు వేస్తూ ఇరుగు పొరుగును పిలిచింది. దీంతో మరింత రెచ్చిపోయిన పుల్లయ్య పక్కనే ఉన్న రోకలి బండ తీసుకుని ఆమె తలపై బలంగా మోదాడు. తీవ్ర గాయాలతో ఆమె కేకలు వేస్తూ వీధిలోకి వచ్చి కుప్పకూలిపోయింది. బిడ్డ అప్పటికే మరణించాడు. అది చూసి పుల్లయ్య అక్కడ నుంచి పరారయ్యాడు. ఇరుగుపొరుగు వచ్చి రక్తపు మడుగులో పడి ఉన్న రమాదేవిని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. రమాదేవి సోదరులు శ్రీరాములు, అంజనేయులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం చిన్నారి మృతదేహాన్ని రమాదేవి తల్లిదండ్రులకు అప్పగిస్తామని సీఐ సుధాకర్‌రావు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment