చెల్లిని వేధిస్తున్నాడని.. తన్నుల నాటకం   | Man Made Agreement With His Friends For Attack On His Brother In Law At Hyderabad | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 7 2018 10:31 AM | Last Updated on Tue, Sep 4 2018 5:48 PM

Man Made Agreement With His Friends For Attack On His Brother In Law At Hyderabad - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న పోలీస్‌ అధికారులు (వృత్తంలో నిందితులు )

చిలకలగూడ : చెల్లిని వేధిస్తున్న బావకు బుద్దిచెప్పాలని భావించిన ఓ బావమరిది తన స్నేహితులకు సుఫారీ ఇచ్చి బావపై దాడి చేయించాడు. తనపై అనుమానం రాకుండా బావతో కలిసి తానూ దెబ్బలు తిన్నాడు. అనంతరం ఏమీ ఎరగనట్లు బావతో కలిసి తమపై దుండగులు దాడి  చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో అసలు విషయం వెలుగు చూడడంతో సుపారీ ఇచ్చిన స్నేహితులతోపాటు సూత్ర«ధారిని సైతం పోలీసులు అరెస్టు చేశారు. చిలకలగూడ ఠాణాలో గోపాలపురం ఏసీపీ శ్రీనివాసులు, చిలకలగూడ డీఐ నర్సింహరాజు, డీఎస్‌ఐ వెంకటాద్రి బుధవారం వివరాలు వెల్లడించారు.

అంబర్‌పేట ప్రేమ్‌నగర్‌కు చెందిన కే. నరేష్‌కుమార్, వరుసకు బావమరిది అయిన రామంతాపూర్‌కు చెందిన రాచకట్ల శ్రీనివాస్‌ గతనెల 23న రాత్రి ఓ శుభకార్యానికి వెళ్లి బైక్‌పై తిరిగి వస్తుండగా చిలకలగూడ ఠాణా పరిధిలోని జామై ఉస్మానియా వద్ద ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వారిపై దాడిచేశారు. ఈ ఘటనలో నరేష్‌కుమార్‌కు తీవ్రగాయాలు కాగా, శ్రీనివాస్‌కు స్వల్పగాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాస్‌కు వరుసకు చెల్లెలిని నరేష్‌కుమార్‌ పెళ్లి చేసుకున్నాడు. నరేష్‌కుమార్‌ తనను వేధిస్తున్నాడని మాటల సందర్భంలో చెప్పడంతో  అతడికి బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్న శ్రీనివాస్‌  తన స్నేహితులకు  సుపారీ ఇచ్చి  నరేష్‌కుమార్‌పై దాడికి పథకం సిద్ధం చేశాడు. తనపై అనుమానం రాకుండా బావతో పాటు తనను కూడా కొట్టాలని సూచించాడు.

ఈ క్రమంలో గతనెల 23న బావతో కలిసి జామై ఉస్మానియా మీదుగా తిరిగి వెళ్లేలా ప్లాన్‌ చేశాడు. బయలు దేరేముందు తన స్నేహితులకు ఫోన్‌ చేసి చెప్పాడు. జామై ఉస్మానియా వద్దకు రాగానే టాయిలెట్‌కు వెళ్లాలని చెప్పి బైక్‌ను ఆపించాడు. పథకం ప్రకారం ముగ్గురు దుండగులు వీరిపై దాడి చేసి సెల్‌ఫోన్లు, నగదు లాక్కుని పరారయ్యారు. అనంతరం నరేష్‌కుమార్‌తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో నిజం బయట పడడంతో దాడి పథకానికి సూత్రధారైన శ్రీనివాస్‌తో పాటు అతని స్నేహితులు సాయికిరణ్, మహేష్, సీఈ జస్టిన్‌పాల్‌లను బుధవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి రెండు సెల్‌ఫోన్లు, రెండు బైక్‌లతో రూ.4వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. చాకచక్యంగా కేసును చేధించిన చిలకలగూడ డీఐ నర్సింహరాజు, డీఎస్‌ఐ వెంకటాద్రి, క్రైం సిబ్బందిని ఉత్తరమండలం డీసీపీ సుమతి, గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావు అభినందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement