
తన దగ్గర డబ్బులు లేవని ఫిరోజ్ చెప్పటంతో సద్దాం అతడితో గొడవకు దిగాడు. ఆగ్రహం పట్టలేక వెంట తెచ్చుకున్న..
సాక్షి, హైదరాబాద్ : అప్పు విషయంలో జరిగిన గొడవ ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. అప్పు తీసుకుని డబ్బులు తిరిగివ్వటం లేదన్న కోపంతో నడిరోడ్డుపై స్నేహితుడిని కత్తితో పొడిచాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన బుధవారం రాత్రి మెహదీపట్నంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మెహదీపట్నానికి చెందిన ఫిరోజ్, సద్దాంలు మంచి స్నేహితులు. ఫిరోజ్ కొన్ని రోజులు క్రితం సద్దాం దగ్గర ఐదు వేలు అప్పు తీసుకున్నాడు. చెప్పిన సమయానికి డబ్బు తిరిగి ఇవ్వకపోవటంతో సద్దాం బుధవారం ఫిరోజ్‌ను ప్రశ్నించాడు.
తన దగ్గర డబ్బులు లేవని ఫిరోజ్ చెప్పటంతో సద్దాం అతడితో గొడవకు దిగాడు. ఆగ్రహం పట్టలేక వెంట తెచ్చుకున్న కత్తితో నడిరోడ్డుపై ఫిరోజ్ కడుపులో పొడిచాడు. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫిరోజ్‌ను అత్యవసర చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రి తరలించారు. పరారీలో ఉన్న సద్దాం గురించి పోలీసులు గాలిస్తున్నారు.