విద్యుత్ టవర్ పైకి ఎక్కిన రమేష్, రమేష్(ఫైల్)
చెన్నై , తిరువణ్ణామలై: కుటుంబకలహాలతో జీవితంపై విరక్తి చెందిన యువకుడు విద్యుత్ టవర్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా ఆరణి తాలుకా ఎత్తువాంబాడి గ్రామానికి చెందిన రమేష్(28). ఇతని భార్య గీత, దంపతులకు గిరిజ(8), ఆర్యా(6) ఇద్దరు కుమార్తెలున్నారు. చెన్నైలో కార్మికుడిగా పనిచేస్తున్న రమేష్ కొద్ది రోజుల క్రితం సొంత గ్రామానికి వచ్చాడు. తిరిగి చెన్నైకి వెళ్లలేదు. దీంతో భార్యభర్తల మధ్య తరచూ ఘర్షణ ఏర్పడేది. ఇదిలా ఉండగా గురువారం రాత్రి మళ్లీ ఘర్షణ జరిగింది. దీంతో మనోవేదనకు గురైన రమేష్ శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అనంతరం ఆత్మహత్య చేసుకునేందుకు నెల్లవాయిపాళ్యంలో నూతనంగా నిర్మించిన విద్యుత్ టవర్‌పైకి ఎక్కాడు. అనంతరం ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. గమనించిన స్థానికులు భార్య గీతతో పాటు పోలీసులకు సమాచారం అందజేశారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, బంధువులు రమేష్‌తో చర్చించారు. అయినప్పటికీ రమేష్ కిందకు రావడానికి నిరాకరించాడు. దీంతో పోలీసులు అగ్నిమాపక సిబ్బందిని రప్పించి విద్యుత్ టవర్ చుట్టూ వలలు ఏర్పాటు చేశారు. అనంతరం గ్రామస్తులు కొందరు రమేష్‌ను కిందకు దించేందుకు టవర్‌పైకి ఎక్కారు. రమేష్ తనను కాపాడే ప్రయత్నం చేస్తే కిందకు దూకేస్తానని బెదిరించాడు. పోలీసులు ఐదు గంటల పాటు చర్చలు జరిపినప్పటికీ రమేష్ కిందకు రాలేదు. చర్చలు జరుపుతున్న సమయంలోనే రమేష్ ఉన్న ఫలంగా కిందకు దూకాడు. కిందికి పడే క్రమంలో మధ్యలో కమ్మీలకు రమేష్ తల గట్టిగా తగలడంతో కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్య, పిల్లలు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment