ఆవునూరి మధు (ఫైల్)
ఇల్లెందు: న్యూడెమోక్రసీ (రాయల) వరంగల్ రీజియన్ కార్యదర్శి ఆవునూరి మధును పోలీసులు ముచ్చటగా మూడోసారి అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని విద్యానగర్ కాలనీలోగల ఎన్డీ కార్యాలయ సమీపంలో ఆయనను బుధవారం రాత్రి పోలీసులు గట్టుచప్పుడు కాకుండా పట్టుకెళ్లారు. ఆయన నిర్ణీత సమయానికి చేరాల్సిన చోటుకు చేరకపోవటంతో నాయకులు ఆరా తీశారు.
ఆయనను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలియడంతో నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు లోనయ్యారు. ఆవునూరి నారాయణ స్వామి అలియాస్ మధును 2005, ఆగస్టు 6వ తేదీన ఇల్లెందు మండలం ముత్తారపుకట్టలో తొలిసారిగా పోలీసులు అరెస్ట్ చేశారు. రాజకీయ శిక్షణ తరగతులలో పాల్గొనేందుకు అక్కడకు వెళ్లిన ఆయనను అప్పటి ఇల్లెందు సీఐ సర్వర్ పాషా అరెస్ట్ చేశారు.
2017, జూలై 25న మహబూబాబాద్ జిల్లా గార్ల పోలీసులు చాపల మార్కెట్‌లో మదును అరెస్ట్ చేశారు. ఆయన అరెస్టవడం ఇది రెండోసారి. హైదరాబాద్‌లోని విద్యానగర్ కాలనీలోగల ఎన్డీ కార్యాలయ సమీపంలో 4వ తేదీ (బుధవారం రాత్రి) పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అరెస్టవడం.. ఏడాది లోపులో ఇది మూడోసారి. ఎన్డీ కీలక నాయకుడైన మధు అరెస్టుతో సహజంగానే ఆ పార్టీ శ్రేణులు ఒకింత కలవరపాటుకు లోనయ్యాయనే చెప్పొచ్చు.
ఎవరీ మధు..?
చిరు ప్రాయంలోనే అజ్ఞాతం వైపు అడుగులు వేసిన మధుది, ఇల్లెందు మండలం కొమురారం గ్రామం. అప్పటి అజ్ఞాత దళ నేతలు భాస్కరన్న, దొరన్న, ఎల్లన్న దళాల్లో సభ్యుడిగా పనిచేశారు. కొత్తగూడెం డివిజన్ కార్యదర్శిగా, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, ఖమ్మం–వరంగల్ ఏరియా కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం, ఐదు జిల్లాలతో ఏర్పడిన రీజియన్ కమిటీకి కార్యదర్శిగా ఉన్నారు.
హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ సీనియర్ నేత, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యను పరామర్శించేందుకుగాను హైదరాబాద్‌కు మధు చేరుకున్నారని సమాచారం.
20 కేసులు
ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మధుపై ఇప్పటివరకు 20 కేసులు నమోదయ్యాయి. 1993లో కాచనపల్లిలో పూనెం పాపయ్యపై దాడి, 1997లో కాశన్న దళంపై గుండాల మండలం దేవాళ్లగూడెం వద్ద దాడి, 2001లో కాచనపల్లిలో రంగయ్యపై దాడి, 2002లో గుండాల మండలంలో రోళ్లగడ్డ వద్ద పోలీసులపై దాడి, 2004లో తొమ్మిదోమైలు తండా వద్ద టీడీపీ కార్యకర్తపై దాడి, 2004లో టీఆర్‌ఎస్, మావోయిస్టు పార్టీ కార్యకర్తలపై దాడి ఘటనల్లో మధు ముద్దాయిగా ఉన్నారు.
అగ్ర నేతలంతా బయటే...
న్యూడెమోక్రసీ అజ్ఞాత దళ అగ్ర నేతలంతా అరెస్టయి బయటనే తిరుగుతున్నారు. వీరిలో ఆవునూరి నారాయణస్వామి(మధు), దనసరి సమ్మయ్య(గోపి), పూనెం లింగయ్య(లింగన్న) ఉన్నారు. 2017 జులై 25న మధును గార్లలో, మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి దనసరి సమ్మయ్య(గోపి)ను నవంబర్ 30న మహబూ బాబాద్‌లో, పూనెం లింగయ్య (లింగన్న)ను సెప్టెంబర్ 7న మండల కేంద్రమైన రఘునాథపాలెం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.
మిగిలింది చోటామోటా నాయకులే..
ఎన్డీ రాయల వర్గం అజ్ఞాత నాయకుల్లో అగ్ర నేతలంతా అరెస్టయ్యారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నది చోటామోటా నాయకులే. బయ్యారం ఏరియాలో నవీన్, ఇల్లెందు ఏరియాలో రమేషన్న, గుండాల ఏరియాలో యాకన్న, ఆళ్లపల్లి– బంగారుచెల్క ఏరియాలో ఆజాద్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment