
రాంచీ: జార్ఖండ్‌లో మావోయిస్టులు పేలుళ్లకు పాల్పడ్డారు. జవాన్ల వాహనాలు లక్ష్యంగా మంగళవారం తెల్లవారుజామున వరుసగా ఐఈడీలు పేల్చడంతో 15 మంది గాయపడ్డారు. సెరైకెలా–ఖర్‌సవాన్ జిల్లాలోని హుర్దా అటవీ ప్రాంత సమీపంలో ఈ పేలుళ్లు జరిగాయి. పోలీసు అధికారుల కథనం ప్రకారం.. సీఆర్‌పీఎఫ్ జవాన్లు, కోబ్రా, జార్ఖండ్ పోలీసులు కుచాయ్ ప్రాంతంలో కూంబింగ్ నిమిత్తం వాహనాల్లో బయలుదేరారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో వీరిని గమనించిన మావోయిస్టులు వరుసగా 15కు పైగానే ఐఈడీ (ఆధునిక పేలుడు పదార్థాలు) పేలుళ్లకు పాల్పడ్డారు. కాగా గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. గాయపడిన జవాన్లను చికిత్స నిమిత్తం హెలికాప్టర్‌లో రాంచీకి తరలించారు. మావో నేత మహరాజ్ ప్రమాణిక్ నాయకత్వంలో ఈ పేలుళ్లు జరిగాయని జిల్లా ఎస్పీ తెలిపారు.