పుస్తకాల బ్యాగుల్లో గంజాయి పొట్లాలు | Marijuana Packets In School Bags | Sakshi
Sakshi News home page

పుస్తకాల బ్యాగుల్లో గంజాయి పొట్లాలు

Published Thu, Apr 5 2018 12:42 PM | Last Updated on Thu, Apr 5 2018 12:42 PM

Marijuana Packets In School Bags - Sakshi

పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి

పిఠాపురం:ఏజెన్సీ ప్రాంతాల నుంచి సాగే గంజాయి రవాణా రూటు మారింది. అంతగా పోలీసు నిఘా లేని తీర ప్రాంతాన్ని అడ్డాగా చేసుకుని గంజాయిని రవాణా చేస్తున్న గుట్టును పోలీసులు రట్టు చేశారు. కొత్తపల్లి మండలం యండపల్లి కేంద్రంగా గంజాయి అమ్మకాలు సాగిస్తున్నట్టు తెలుసుకున్న పోలీసులు ఆ దిశగా నిఘా పెంచారు. రెండు రోజుల క్రితం ఒక ఆటోలో గంజాయి రవాణా జరుగుతున్నట్టు సమాచారం అందడంతో స్పెషల్‌ పార్టీ పోలీసులు ఉప్పాడ పిఠాపురం రోడ్డులో తనిఖీలు నిర్వహించగా మూడు బ్యాగ్‌లలో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఆ వ్యక్తి నుంచి సుమారు రూ.రెండు లక్షల విలువైన 38 కేజీల గంజాయిని, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆవ్యక్తిని విచారించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూసినట్టు తెలిసింది. కొత్తపల్లి మండలం యండపల్లికి చెందిన ఓ వ్యక్తి ఏజన్సీ ప్రాంతాలకు చెందిన మరి కొందరి వ్యక్తుల ద్వారా గంజాయిని తీసుకువచ్చి ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

జిల్లాలోని పలు ప్రాంతాల్లో గంజాయి తాగే వారి సంఖ్య గణనీయంగా పెరగడంతో కొందరు గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు జరుపుతున్నట్టు తెలిసింది. ఎటువంటి అనుమానం రాకుండా విద్యార్థులు తీసుకువెళ్లే స్కూలు బ్యాగ్‌లలో ప్రత్యేకంగా చేసిన గంజాయి పొట్లాలను తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. స్కూలు బ్యాగ్‌లతో పాటు మామూలుగా ప్రయాణాల్లో వాడే బ్యాగ్‌లలో గంజాయి పొట్లాలు ఉంచి వాటిపై బట్టలు ఇతర వస్తువులను పేర్చి ప్రయాణికుల మాదిరిగా ఆటోలలో గంజాయిని తరలిస్తున్నట్టు తెలిసింది. పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి రెండు స్కూలు బ్యాగ్‌లలో గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు అసలు వ్యాపారులు ఎవరన్న విషయంపై ఆరా తీస్తున్నారు. పటుట్బడిన గంజాయి ఏవిలీన మండలాల ఏజన్సీ ప్రాంతం నుంచి స్కూలు బ్యాగ్‌లలో పెట్టుకుని ఆర్టీసీ బస్సుల్లో తెచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. గంజాయి రవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్న యండపల్లికి చెందిన వ్యక్తి పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ వ్యక్తి కోసం గాలిస్తున్న ప్రత్యేక పోలీసు బృందం ఇంకా ఎవరెవరు ఈ వ్యాపారంలో ఉన్నారు. ఏయే ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కీలక వ్యక్తి పట్టుబడితే అసలు విషయాలు బయటపడతాయని పోలీసు వర్గాలు చెబుతున్నారు. రైల్వే స్టేషన్లలో ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించినట్టు తెలిసింది.

పిఠాపురం, ఉప్పాడ, గొల్లప్రోలు మండలాల్లో కొన్ని గ్రామాల్లో కొందరు వ్యక్తులు గంజాయి రవాణాతో పాటు విక్రయాలు సాగిస్తున్నట్టు సమాచారం. తీర ప్రాంతంలో గుట్టుగా సాగుతున్న గంజాయి రవాణా మూలాలను తెలుసుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసినట్టు విశ్వసనీయ సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement