మత్తు.. యువత చిత్తు | Marijuana Smuggling in Karimnagar | Sakshi
Sakshi News home page

మత్తు.. యువత చిత్తు

Published Tue, May 21 2019 11:01 AM | Last Updated on Tue, May 21 2019 11:01 AM

Marijuana Smuggling in Karimnagar - Sakshi

ఫ్రెండ్‌ పుట్టిన రోజనో.. శుభకార్యమనో.. లేక బాధకర సందర్భమో గానీ.. ‘నిషా’ అందిస్తున్న మత్తు అనే స్నేహహస్తం.. యవతను ‘ఉన్మత్తు’ ఆగాధంలోకి లాగేస్తోంది. చివరకు బతుకునే ఉప్పెనలా ముంచేస్తోంది. ఈ ఉచ్చులో పడిన వారి బతుకు అర్ధంతరంగా ముగిసిపోతోంది. ఈ విషయంలో మద్యం ప్రధాన పాత్ర పోషిçస్తుంటే.. గంజాయి, డ్రగ్స్‌ విపత్తు తక్కువేం కాకుండా ఉంది.

మంచిర్యాలక్రైం  :మత్తుకాటుతో యువత చిత్తవుతోంది. సరదాగా ప్రారంభమైన ఈ వ్యసనం.. చివరకు అలవాటుగా మారి ఆరోగ్యాన్ని బలి తీసుకుంటోంది. ఏటా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న వారిలో 70శాతం మంది 35 ఏళ్ల లోపువారే కావడం ఆందోళన కలిగించే ఆంశం. ఈ బాధితుల్లో 80శాతం మంది మద్యం, దుమపానం వంటి వ్యసనాల కారణంగానే అనారోగ్యం బారినా పడుతున్నారని వైద్యవర్గాలు వెల్లడిస్తున్నాయి.

పుట్టిన రోజు.. అమ్మాయికి ప్రపోజ్‌ చేసినరోజు.. పెళ్లిరోజు.. ఇలా ఏ చిన్న సందర్భం దొరికినా.. మందుతాగేవారు కొందరుంటే.. స్నేహితులు బలవంతం చేశారని మరికొందరు వ్యసనం బారినపడుతున్నారు. ఒక్క గ్లాస్‌తో మొదలవుతున్న ఈ వ్యసనం.. జీవితాన్ని ఆసుపత్రిపాలుచేసే వరకూ కొనసాగుతోంది. సరదాగా ప్రారంభమవుతున్న ఈ అలవాట్లు చివరికి ఎందరి జీవితాలకో శాపంగా మారుతున్నాయి. చాలామంది సరదాగా గ్లాస్‌ పట్టి చివర కు దేవదాసులై పోతున్నారు. ఒక వ్యక్తి రోజుకు 360ఎంఎల్‌ మద్యం తీసుకుంటే కొన్నాళ్ల తర్వాత మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా ప్రతిరోజూ మద్యం సేవిస్తున్నవారిలో 35 ఏళ్ల యువకులు 60శాతం ఉండడం విచారకరం.  బాధితుల్లో దాదాపు 90 శాతం మద్యంతోపాటు ధూమపానం, గంజాయి, డ్రగ్స్, ఎక్కువగా ఉంటున్నారని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. చిన్న వయసులోనే ఉద్యోగం, ఉపాధి పొందినవారు ఎక్కువ శాతం మత్తుకు బానిస అవుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. సినిమాలు, ఇంటర్‌నెట్‌ ప్రభావం విస్తృతమయ్యాక ‘పార్టీల’ సంస్కృతి పెరిగింది. ఇటీవల లేట్‌నైట్‌ పార్టీ కల్చర్‌ యువతను  ఆకుట్టుకుంటోంది. దీంతో ప్రతి ఆనందానికి మ ద్యం గ్లాసులు గలగలలాడుతున్నాయి. నలు గురు స్నేహితులు కలిస్తే చాలు.. మందు పార్టీ ఇప్పుడు ఫ్యాషన్‌గా తయారవుతోంది. గతంలో పోల్చితే మత్తు బారిన పడుతున్న యువత సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రోజుమం దు తాగేవారు.. సిగరెట్‌ కాల్చేవారు ఒకేసారి మానేసినా మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. చేతులు, కాళ్లు వణకడం, పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం, ఒంటరితనంగా ఫీలవ్వడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి వారిని గుర్తించి తక్షణమే మానసిక వైద్యనిపుణులకు చూపించాలని సూచిస్తున్నారు.

ప్రాథమిక స్థాయిలోనే పగ్గాలు ముఖ్యం
మత్తుకు బానిసై తీవ్ర మానసిక సమస్యలకు దారితీయకముందే అప్రమత్తం కావాలని వైద్యులు సూచిస్తున్నా రు. అతిగా మద్యం, పొగ, గంజాయి, డ్రగ్స్‌ వంటి మ త్తు పదార్థాలు తీసుకోవడం వల్ల శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలూ తలెత్తుతాయి. ఇలాంటి వా టిని ఫ్రాథమిక స్థాయిలో గుర్తించాల్సిన అవసరం ఉం ది. కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. రా త్రివేళల్లో పార్టీలంటూ తరచూ పిల్లలు స్నేహితుల్లో కలి సి బయటకు వెళ్తుంటే ఆలాంటి వారిపై ఓ కన్నేసి ఉం చాల్సిందే. ముఖ్యంగా ఇంట్లో భార్యాభర్తలు ఉద్యోగులైతే పిల్లల్ని అశ్రద్ధ చేయడం కనిపిస్తోంది. దీంతో వారి లో తాము ఒంటరి అనే భావన కలిగి చివరికి చెడు వ్యసనాలకు అలవాటుపడుతారు. ఇంట్లో పెద్దలకు సమ యం లేకపోయినప్పటికీ పిల్లలతో గడిపేందుకు ప్రణా ళిక వేసుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం వారంలో ఒకరోజైనా పూర్తిగా వారితో గడపాలని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చిన్నప్పటినుంచే విలువలు నేర్పిస్తూ పిల్లలకు తల్లిదండ్రులే ఆదర్శంగా నిలువాలని సూచిస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులు మందు, గుట్కా, సిగరెట్‌ వంటి మత్తు పదార్థాలు తీసుకుంటుంటారు. ఇది కూడా వారిపై ప్రభావం చూపుతోంది.

యువత జోగుతోందిలా..
మంచిర్యాల జిల్లాలో ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహిస్తున్న డ్రంకెన్‌డ్రైవ్‌ కేసుల్లో ప ట్టుబడుతున్న వారిలో 35ఏళ్లలోపు ఉన్నవారే అధికంగా ఉంటున్నారని పోలీస్‌వర్గాలు చెబుతున్నాయి. జిల్లా వాణిజ్య, వ్యాపారరంగంలో దినదినం అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ ప్రధానంగా సింగరేణి బొగ్గు గనులు ఉన్నాయి. జిల్లాలో 7.30లక్షల జనాభా ఉండగా సుమారు 2 లక్షలకుపైగా ప్రభుత్వ, సింగరేణి, ప్రైవేటు ఉద్యోగులు ఉన్నారు. సింగరేణి ప్రాంతానికి చెందిన యువత మద్యం, డ్రగ్స్‌కు బానిసవుతున్నట్లు తెలుస్తోంది. మంచిర్యాల, శ్రీరాంపూర్, సీసీ, బెల్లంపల్లి, మందమర్రి పోలీసులు ఇటీవల మద్యంమత్తులో ఉన్న  యువకులను అ దుపులోకి తీసుకుని కౌన్సెలింగ్‌ నిర్వహించినట్లు సమాచారం. జిల్లా కేంద్రం లోని రైల్వేస్టేషన్‌ పరిసర ప్రాంతాలు, కళాశాల రోడ్, ఏసీసీక్వారీ రోడ్‌ ప్రాంతాలను యువత డ్రగ్స్, గంజాయి, మద్యం సేవించేందుకు అడ్డాలుగా చేసుకుంటున్నట్లు సమాచారం.

విస్తృతమవుతున్న డ్రగ్స్‌ వినియోగం
మత్తు పదార్థాల వ్యాపారులు విద్యార్థులను, యువతను టార్గెట్‌ చేస్తూ మత్తులోకి దింపుతూ వ్యాపా రం సాగిస్తున్నారు. మద్యం, గంజాయి, డ్రగ్స్‌.. ఇలా మత్తు పదార్థాలకు యువతరం బా నిసగా మారుతోంది. దినదినం అభివృద్ధి చెం దుతున్న పట్టణాల్లో విద్య, వైద్యం, విజ్ఞానరంగాల్లో గుర్తింపు పొందుతున్న విద్యా సంస్థల్లో డ్రగ్స్‌ వాడుతున్నట్లు సమాచారం. విద్యార్థులు, యువత డ్రగ్స్‌ , గంజా యి, వాడకుండా కట్టడి చేయకుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హైదరా బాద్, మహా రాష్ట్ర, మహబూబాబాద్, విజయవాడ ప్రాంతాల నుంచి కొందరు డ్రగ్స్‌ ముఠా యువత ను టార్గెట్‌ చేస్తూ మంచిర్యాల, కాగజ్‌నగర్, నిర్మల్‌ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది.

కదలికలపై దృష్టి పెట్టాలి
పిల్లల కదలికలను తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరం ఉంది. ఒకసా రి వ్యసనం బారిన పడితే. వాటి నుంచి తప్పించుకునేందుకు శ్రమించాల్సి వస్తుంది. ఒత్తిడి కారణంగానో..? ఒంటరితనం భావనతో కొందరు. చెడుస్నేహాలతో మరికొందరు. ఈ ఊబిలోకి దిగుతున్నారు. ఒక్కసారి మద్యం తాగితే. మనసు దానిపట్ల ఆకర్షణ పెరిగిపోయి.. మానసిక సంఘర్షణకు లోనవుతుంటా రు. మెదడును ఉత్తేజపరిచే మద్యం.. క్రమంగా దానికి బానిసను చేస్తుంది. ఆ తర్వాత మెదడు చురుకుదనం కోల్పోతుంది. మానసిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. తల్లిదండ్రులు పిల్లలపట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి. – విశ్వేశ్వర్‌రావు,మానసిక వైద్యనిపుణులు, మంచిర్యాల

తల్లిదండ్రులదే కీలక బాధ్యత
నయాకల్చర్‌కు అవాటు పడుతున్న యువత సగం మందికిపైగా పెడదోవ పడుతున్నవారే ఉన్నారు. మద్యానికి బానిసలుగా మారడంతోపాటు గుట్కా, సిగరెట్‌ వంటివి వినియోగిస్తున్నారు. పిల్లలను సన్మార్గంలో పెట్టాల్సిన తల్లిదండ్రులు సంపాదన ధ్యేయంగా పనిచేస్తుండడంతో వారు ఈ తరహ వ్యసనాల బారిన పడుతున్నారు. టీనేజీలో ఉన్న పిల్లలతో గడిపేందుకు సమయం కేటా యించి.. వారి దృష్టి ఇతర వ్యాపకాలవైపు మరల్చకుండా కంటికి రెప్పలా కాపాడాల్సి బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంది.– ఎడ్ల మహేష్, సీఐ, మంచిర్యాల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement