వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ వెంకట్రావ్
అనంతపురం సెంట్రల్: అనంతపురం మండలం సోములదొడ్డి గ్రామంలో ఈ నెల 24న జరిగిన ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగి అంజనప్రసాద్ (27) హత్య మిస్టరీ వీడింది. తమ కూతురును చేసుకోలేదని బావ (అక్క మొగుడు) బయన్న పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను రూరల్ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ వెంకట్రావ్ మీడియాకు వెల్లడించారు.
హత్యకు కారణాలు ఇవి..
సోములదొడ్డిలో నివాసముంటున్న ఆంజనేయులుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తెను నార్పల మండలం ఎం.తిమ్మపల్లికి చెందిన బయన్నకు ఇచ్చి వివాహం జరిపించారు. కొన్నేళ్ల క్రితమే అత్తవారి ఇంటికి ఇల్లరికం వచ్చి స్థిరపడ్డారు. మూడునెలల క్రితం ఆంజనేయులు కుమారుడు అంజనప్రసాద్(27)కు కర్నూలు జిల్లా బేతంచెర్లకు చెందిన యువతితో వివాహమైంది. అంజనప్రసాద్ ఎలాంటి చెడు అలవాట్లు లేకపోవడంతో ఎలాగైనా తన కుమార్తెను ఇచ్చి పెళ్ళి జరిపించాలని బయన్న గతంలో భావించాడు. రూ. 20 లక్షలైనా వరకట్నం ఇస్తా పెళ్లి చేసుకోవాలని పెద్దమనుషులతో ఒత్తిడి చేయించాడు. అయితే చిన్నప్పటి నుంచి ఎత్తుకుని ఆడించానని, అందునా వయసు 12 సంవత్సరాలే ఉండడంతో పెళ్లికి నిరాకరించాడు.
కొత్త జంటను చూసి ఈర్ష్య..
అంజనప్రసాద్‌కు మూడు నెలల క్రితం వివాహమైంది. నవదంపతులు ఒకర్ని విడిచి ఒకరు ఉండలేనంతగా అన్యోన్యంగా ఉండేవారు. అంజనప్రసాద్ నగరంలో ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తుండేవాడు. నవ వధువు స్థానంలో తన కూతురు ఉంటే ఎంత బాగుండేదని, తన కూతురుకు అన్యాయం చేశాడని బయన్న ఈర‡్ష్య పెంచుకున్నాడు. దీంతో పాటు ఇంటి పక్కనే ఉండడంతో బయన్న రోజూ తాగి వచ్చి భార్యను కొడుతుండడంతో అంజనప్రసాద్ తీవ్రంగా మందలించాడు. తనపై దాడి చేసేకి వస్తావా అని కక్ష పెంచుకున్నాడు. దీంతో ఎలాగైనా హత్య చేయాలని భావించాడు. ఈ నెల 24 హత్యకు పథక రచన చేశాడు.
హత్య చేశాడిలా..
ఈనెల 24న రాత్రి అంజనప్రసాద్ ఇంటికి మామిడికాయలు తీసుకొని వచ్చాడు. వీటిని కుటుంబసభ్యులందరూ కలిసి భోజనం చేసిన తర్వాత తిన్నారు. ఎవరిళ్లలో వారు నిద్రపోయారు. రాత్రి 12 గంటలు దాటిన తర్వాత బయన్న ముందుగా వేసుకున్న పథకం ప్రకారం సెల్‌ఫోన్ అలారం పెట్టివ్వాలని అంజనప్రసాద్‌ను నిద్రలేపాడు. తలుపు తీయగానే పండ్లుకోసే కత్తితో గొంతుకోశాడు. తప్పించుకోవడానికి అంజనప్రసాద్ యత్నించిగా మచ్చుకత్తితో కోశాడు. ప్రాణం పోయిన తర్వాత నేరం నుంచి తప్పించుకోవడానికి చీరతో ఉరివేశాడు. అనంతరం రోజుమాదిరిగా హాస్టల్‌లో వంట చేసేందుకు వెళ్లిపోయాడు. ఉదయాన్నే గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎలాగైనా దొరికిపోతాననే ఉద్దేశంతో బయన్న వీఆర్వో ఎదుట లొంగిపోయాడు. హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను స్వాదీనం చేసుకుని, నిందితుడిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ వెంకట్రావ్ వివరించారు. విలేకరుల సమావేశంలో సీఐ కృష్ణమోహన్, ఎస్‌ఐలు జగదీష్, రామ్‌ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment